Layoff Trend: బాబోయ్.. గూగుల్ కూడా అదే బాటలో.. ఎంతమందిని ఇంటికి పంపాలని డిసైడ్ అయిందంటే..
ABN , First Publish Date - 2022-11-22T15:55:41+05:30 IST
ఐటీ(IT Layoffs) రంగంలో లే-ఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్ వరకూ అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుని..
ఐటీ(IT Layoffs) రంగంలో లే-ఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్ వరకూ అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. తాజాగా.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న కంపెనీల జాబితాలో నిలిచింది. పనితీరు సరిగా లేని 10 వేల మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించాలని గూగుల్ నిర్ణయించినట్లు తెలిసింది. గూగుల్ మేనేజర్స్ ప్రస్తుతం 'Poor Performing' Employeesను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 6 శాతం మంది ఉద్యోగులను గూగుల్ ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ర్యాంకింగ్ సిస్టమ్ డేటా ఆధారంగా తక్కువ ర్యాంకింగ్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయించింది.
ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లించే కంపెనీల్లో గూగుల్ అందరి కంటే ముందుంది. 'Employee-Friendly' Company అని చెప్పుకునే గూగుల్ కూడా Layoffs బాటను ఎంచుకోవడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గూగుల్ మాతృ సంస్థ అయిన Alphabet లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,87,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గూగుల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వార్షిక ఆదాయం $2,95,884 (మన కరెన్సీలో దాదాపు రూ.2.41 కోట్లు). అయితే.. మరో పక్క గూగుల్ ఆదాయానికి ఇటీవల భారీగా గండిపడింది.
మూడవ త్రైమాసికంలో $13.9 బిలియన్ డాలర్ల నికర లాభం వచ్చినట్లు గూగుల్ ప్రకటించింది. అయితే.. గతేడాది మూడవ త్రైమాసికంతో పోల్చితే గూగుల్ కంపెనీ లాభాలు 27 శాతం పడిపోవడం గమనార్హం. గూగుల్‌కు మొత్తంగా.. 6 శాతం ఆదాయం పెరిగి $69.1 బిలియన్ డాలర్లు ఆర్జించినప్పటికీ లాభంలో తగ్గుదల మాత్రం స్పష్టంగా కనిపించింది. Alphabet సంస్థ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవాలన్న నిర్ణయానికి కారణం ఈ పరిణామం అయి ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా టెక్ కంపెనీలైన Meta, Twitter, Amazon కంపెనీలు ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఫేస్‌బుక్ మాతృ సంస్థ Meta 11,000 మంది ఉద్యోగులను తొలగించగా.. ట్విటర్ మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మంది ఉద్యోగులను తీసేసింది. అమెజాన్‌లో 2023 వరకూ Layoffs కొనసాగవచ్చనే అంచనాలున్నాయి.