Twitter Layoffs: మస్క్ మదిలో మళ్లీ అదే ఆలోచన.. నెక్స్ట్ ఏం జరగనుందో..
ABN , First Publish Date - 2022-11-20T20:55:00+05:30 IST
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ మరోమారు ట్విటర్‌లో తొలగింపుల పర్వానికి దిగాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk).. ట్విటర్‌ను(Twitter) చేజిక్కించుకున్నాక ఏకంగా 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. ఇది ట్విటర్ రోజువారీ కార్యకలాపాలపై కొంత ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. అయితే.. మరోమారు ట్విటర్‌లో తొలగింపుల పర్వానికి(More Layoffs) దిగాలని మస్క్ యోచిస్తున్నట్టు సమాచారం. రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఈ నేపథ్యంలో మస్క్ మరింత మంది ఉద్యోగులను తొలగించాలనుకోవడం చర్చనీయాశం అవుతోంది.
ఈసారి సెల్స్ అండ్ మార్కెటింగ్, పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో కోతలు చేపట్టేందుకు మస్క్ సిద్ధమవుతున్నట్టు ప్రముఖ వార్తాసంస్థ బ్లూంబర్గ్(Bloomberg) ప్రచురించింది. ఇందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయా శాఖల అధిపతులకు సమాచారం వెళ్లిందట. అయితే.. దిగువస్థాయి సిబ్బందిని తొలగించేందుకు తాము సిద్ధంగా లేమని వారు మస్క్‌కు తేల్చి చెప్పారట. ఫలితంగా వారు తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు బ్లూంబర్గ్ పేర్కొంది. కాగా.. ఈ కథనంపై మీడియా ట్విటర్‌ను సంప్రదించగా.. ట్విటర్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. రేపే ఈ తొలగింపులు ఉంటాయని సమాచారం.
ట్విటర్‌ను కొనుగోలు చేశాక మస్క్ చేపట్టిన మార్పులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గత నెలలో మస్క్ ఏకంగా 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విటర్‌ను చేజిక్కించుకున్నారు. సంస్థలో కాలుపెట్టిన కొద్ది రోజులకే ఆయన సంస్థ ఉద్యోగుల్లో ఏకంగా 50 శాతం మందిని తొలగించారు. వర్క్ ఫ్రం హోం పాలసీని కూడా రద్దు చేశారు. ట్విటర్‌ను గాడినపెట్టేందుకు ఉద్యోగులు రోజుకు 12 గంటలు ఏకధాటిగా పనిచేయడానికైనా వెనకాడకూడదంటూ మస్క్ పంపిన అంతర్గత లేఖ కలకలం రేపింది. ఇది మా వల్ల కాదంటూ ఏకంగా 1200 మంది రాజీనామాలు(Resignations) చేసి ఇంటికెళ్లిపోయారట. దీంతో.. కొన్ని దేశాల్లోని ట్విటర్ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారడంతో వాటికి తాళాలు కూడా వేయాల్సి వచ్చింది.