Jio True 5G: 100 శాతం జియో ట్రూ 5G కవరేజీని పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్
ABN , First Publish Date - 2022-11-25T19:17:37+05:30 IST
ఈ ఏడాది అక్టోబరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పుడు మరో ఘనత సాధించింది.
గాంధీనగర్: ఈ ఏడాది అక్టోబరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పుడు మరో ఘనత సాధించింది. గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లోనూ 5జీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా జిల్లా కేంద్రాల్లో 100 శాతం జియో ట్రూ 5జీ (Jio True 5g) కవరేజీని పొందిన దేశంలోనే తొలి రాష్ట్రంగా గుజరాత్ (Gujarat) అవతరించింది. ఈ సందర్భంగా రిలయన్స్ మాట్లాడుతూ.. గుజరాత్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, అది రిలయన్స్ జిన్మభూమి అని పేర్కొంది. ఈ వ్యూహాత్మక ప్రకటన ప్రజలకు, గుజరాత్‌కు అంకితమని పేర్కొంది.
నేటి (25వ తేదీ) నుంచి గుజరాత్‌లోని జియో యూజర్లకు జియో వెల్కమ్ ఆఫర్ నుంచి ఇన్విటేషన్ అందుతోంది. ఈ ఆఫర్‌లో భాగంగా 1 జీబీపీఎస్ వరకు అపరిమిత డేటా ప్లస్ వేగం ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే లభిస్తుంది. త్వరలోనే గుజరాత్‌లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఐవోటీ సహా మరిన్ని రంగాల్లో జియో ట్రూ 5జీ ఆధారిత కార్యక్రమాలను ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ ఎం అంబానీ మాట్లాడుతూ.. తమ బలమైన ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానించిన 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు కలిగి ఉన్న తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించినందుకు గర్విస్తున్నట్టు చెప్పారు. సాంకేతికత నిజమైన శక్తిని.. బిలియన్ల మంది జీవితాలను అది ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని తాము చూపించాలనుకుంటున్నట్టు చెప్పారు.
అలాగే, రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి రాష్ట్రంలో తొలుత 100 స్కూళ్లను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించాయి. దీనికి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ (Education-For-All) అని పేరు పెట్టాయి. ఇందులో భాగంగా ఆయా స్కూళ్లలో 5జీ కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్, టీచర్, స్టూడెంట్ కొలాబరేషన్ ప్లాట్‌ఫామ్, స్కూల్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ వంటివి ఏర్పాటు చేస్తారు.