Zomato Layoffs: జొమాటో ఉద్యోగులకు కూడా మూడింది.. తాజా నిర్ణయం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-11-19T17:15:29+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉద్యోగాల తీసివేత (Employee Layoffs) పర్వం నడుస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు (IT Companies) మొదలుకుని చిన్నాచితకా సంస్థల దాకా..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉద్యోగాల తీసివేత (Employee Layoffs) పర్వం నడుస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు (IT Companies) మొదలుకుని చిన్నాచితకా సంస్థల దాకా వ్యయ భారం (Job Cuts) తగ్గించుకునేందుకు ఉద్యోగులను ఇంటికి పంపించడమే మార్గంగా ముందుకు వెళుతున్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Online Food Delivery App Zomato) కూడా తాజాగా ఈ వరుసలో నిలిచింది. ఈ వారంలోనే జొమాటోలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు ఉద్వాసన (Zomato Layoffs) పలకాలని ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించేయాలని జొమాటో ఫిక్సయినట్లు సమాచారం. ఈ నిర్ణయం కారణంగా సుమారు 100 మంది ఉద్యోగులపై ఇప్పటికే ప్రభావం పడినట్లు తెలిసింది. రేపోమాపో వారికి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం పంపాలని జొమాటో ఓ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. సప్లై విభాగంలో ఉండే ఉద్యోగులపై ఈ ప్రభావం పడకపోవచ్చు. అంటే.. కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు ఢోకా లేనట్టే.
జొమాటో సంస్థలో Product, Tech, Catalogue, Marketing విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై Zomato Laying off ప్రభావం పడనున్నట్లు తెలిసింది. జొమాటోలో ఉద్యోగాల పీకివేతపై కొన్ని రోజుల క్రితమే జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పరోక్షంగా చెప్పారు. పనితీరు సరిగా లేనివారిని తొలగించే అవకాశం ఉన్నట్లు ముంబైలోని టౌన్‌హాల్ సాక్షిగా ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే ఈ Layoff కాలంలో కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని జొమాటో డిసైడ్ కావడం గమనార్హం. జొమాటో ప్రతినిధి ఒకరు ఈ ఉద్యోగుల తీసివేతపై స్పందిస్తూ.. పనితీరు మెరుగ్గా లేనివారిని తొలగించే ప్రక్రియ ప్రతీ సంవత్సరం జరిగేదేనని.. ఈ నిర్ణయం కారణంగా 3 శాతం వర్క్‌ఫోర్స్‌పై ప్రభావం పడుతుందని.. ఇందులో కొత్తేం లేదని చెప్పారు. జొమాటోలో ఉన్నత స్థాయిలో పనిచేసిన వాళ్లు కొందరు ఇటీవలే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తాతో పాటు రాహుల్ గంజూ, సిద్ధార్థ్ ఝెవర్ వంటి వారు సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగం నుంచి తప్పుకుని వెళ్లిపోయారు.