చీకట్లో చిరు దీపం!
ABN , First Publish Date - 2022-12-15T00:45:32+05:30 IST
మనంసృష్టించుకున్న కాలుష్యం పెను భూతమై మనల్ని భయపెడుతోంది. మనం వాడుతున్న ఇంధనాల వల్ల వెలువడిన కర్బన ఉద్గారాలు కోరలు చాచి మనల్ని కమ్మేస్తున్నాయి...
మనంసృష్టించుకున్న కాలుష్యం పెను భూతమై మనల్ని భయపెడుతోంది. మనం వాడుతున్న ఇంధనాల వల్ల వెలువడిన కర్బన ఉద్గారాలు కోరలు చాచి మనల్ని కమ్మేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే వాతావరణ మార్పులు మానవాళి మనుగడకే ముప్పు తెస్తాయంటూ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు శుష్క సిద్ధాంతాలు కావని, కఠోర వాస్తవాలని ప్రజలకు రోజురోజుకీ అనుభవంలోకి వస్తోంది. ఇలాంటి వేళ ఓ చల్లని కబురు మానవాళి చెవుల్ని తాకింది. న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంలీనం) ద్వారా అపరిమిత శక్తిని పుట్టించే ఓ ప్రయోగం అమెరికాలో విజయవంతమైంది. కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ ల్యాబ్‌కు చెందిన నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీలో జరిగిన ఈ ప్రయోగం చీకటిలో చిరు దివ్వెలా రేపటిపై కొత్త ఆశలు రేపుతోంది.
హైడ్రోజన్ ఐసోటోపులైన ట్రిటియం, డ్యుటీరియం మిశ్రమాన్ని లేజర్ల సాయంతో సూర్యుడి కేంద్ర భాగం కంటే పది రెట్లు ఎక్కువ వేడికి శాస్త్రవేత్తలు గురిచేశారు. దానితో హైడ్రోజన్ వాయువు విడిపోయి ప్లాస్మాగా మారి మనం పీల్చే గాలి కంటే పది లక్షల రెట్లు తేలికగా మారింది. ఆ స్థితిలో జరిగిన అణు సంలీనం వల్ల అపారమైన శక్తి వెలువడింది. గతంలో అణు సంలీన ప్రయోగాల ద్వారా ఓ చిన్న బల్బు 5 గంటలపాటు వెలిగేంత తక్కువ శక్తిని మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. ఈసారి మాత్రం ఈ ప్రయోగం చేయడానికి ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ శక్తిని రాబట్టగలిగారు. ఇంధన పరిశోధనల చరిత్రలో ఇదో గొప్ప విజయంగా అమెరికా ఇంధన శాఖ ప్రకటించింది. ఎందుకంటే బొగ్గు, గ్యాస్, చమురు వంటి ఇంధనాల్ని మండించడం వల్ల వెలువడే శక్తి కంటే ఈ అణు సంలీన శక్తి 40 లక్షల రెట్లు అధికం. ప్రస్తుతం అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగిస్తున్న న్యూక్లియర్ ఫిషన్ (అణు విచ్ఛిత్తి) ప్రక్రియ కంటే దీని ద్వారా వెలువడే శక్తి నాలుగు రెట్లు ఎక్కువ. పైగా అణు విచ్ఛిత్తితో పోలిస్తే ఈ ప్రక్రియలో కాలుష్యం కూడా బాగా తక్కువ.
అణు విచ్ఛిత్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వాడే యురేనియం, ప్లుటోనియం రెండూ అణు ధార్మిక పదార్థాలే. వాటి దుష్ప్రభావాలు 40 వేల సంవత్సరాల వరకూ మనుషుల్ని, మట్టిని, గాలిని పట్టి పీడిస్తాయి. కానీ అణు సంలీన ప్రక్రియలో ఉపయోగించే డ్యుటీరియం అణు ధార్మిక పదార్థం కాదు. ఇది సముద్ర జలాల్లో విస్తృతంగా దొరుకుతుంది. ఇక ట్రిటియం అణు ధార్మికమే అయినప్పటికీ చాలా బలహీనమైనది. దీని దుష్ప్రభావాలు 100–200 ఏళ్లకు మించి ఉండవు. ఇది ప్రకృతిలో పెద్దమొత్తంలో దొరకదు కానీ లిథియం నుంచి దీనిని కృత్రిమంగా తయారుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంలీన పద్ధతిలో చేసే ఇంధన ఉత్పత్తి వల్ల ప్రమాదకర గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడవు. ఈ కారణాల వల్ల ఈ తరహా అణు విద్యుత్ కేంద్రాలపై సమీప ప్రాంతాల ప్రజల నుంచి వ్యతిరేకత అంతగా రాకపోవచ్చని భావిస్తున్నారు.
అయితే అణు సంలీనం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కూడా అనేక సవాళ్లు ఉన్నాయి. ఇందులో పుట్టే ప్లాస్మాను ఒక చోట నియంత్రించడం, అణు ధార్మికతను, ట్రిటియం కాలుష్యాన్ని తక్కువ స్థాయిలో ఉంచడం కొంత ఇబ్బందులతో కూడుకున్నవే. తాజా ప్రయోగం విజయవంతమైంది కాబట్టి కాలుష్య రహిత అణు విద్యుత్ మానవాళికి త్వరలో అందుబాటులోకి వస్తుందని అనుకోవడం కూడా పొరపాటే! ఈ ప్రక్రియలో వెలువడే శక్తిని విద్యుత్తుగా ఎలా మార్చాలనే దానిపై ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది. ‘‘కలపను మండించడానికి, ఓ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి మధ్య ఎంత దూరం ఉంటుందో ప్రస్తుతం జరిగిన ప్రయోగానికి, దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి కావడానికి మధ్య అంతే దూరం ఉంది’’ అని ఓ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కనీసం 30 సంవత్సరాలు పడుతుందనేది పలువురి అంచనా.
అయితే మనకి అంత సమయం ఉందా అనేది ఓ పెద్ద ప్రశ్న. గ్లోబల్ వార్మింగ్ వల్ల 2050 నాటికి 120 కోట్ల మంది తామున్న చోట ఉండలేని దుస్థితిలో పడిపోతారని, సర్వం కోల్పోయి నిరాశ్రయులవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చమురు, సహజవాయు నిల్వలు మరో 50 ఏళ్లకు మించి మన అవసరాలకు సరిపోవు. ఈ పరిస్థితిలో సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, జీవ ఇంధనాల ఉత్పత్తిని వీలైనంతగా పెంచుకోవడం, కాలుష్యాన్ని వీలైనంతగా తగ్గించుకోవడం అనివార్యం. అణు సంలీన శక్తి ద్వారా భవిష్యత్తులో కాలుష్య భూతాన్ని మానవుడు తిరిగి సీసాలో బంధించవచ్చేమో! కానీ అంతవరకూ మానవాళి మనుగడ సాగించే మార్గాల్నీ వెదకాల్సిందే. సూర్యుడి కంటే పది రెట్ల వేడిని ఉపయోగించిన తాజా ప్రయోగం చీకట్లో సూర్యుడు కాదు.. చిరు దీపమే అనే గ్రహింపు ప్రధానం!