మరింత బలపడిన బెంజమిన్!

ABN , First Publish Date - 2022-11-10T01:34:31+05:30 IST

ఇజ్రాయెల్‌లో తరచూ ఎన్నికలు ఎందుకు వస్తాయన్న ఓ ప్రశ్నకు, బెంజమిన్ నెతన్యాహూ తిరిగి అధికారంలోకి వచ్చేవరకూ ఎన్నికలు వస్తూనే ఉంటాయని...

మరింత బలపడిన బెంజమిన్!

ఇజ్రాయెల్‌లో తరచూ ఎన్నికలు ఎందుకు వస్తాయన్న ఓ ప్రశ్నకు, బెంజమిన్ నెతన్యాహూ తిరిగి అధికారంలోకి వచ్చేవరకూ ఎన్నికలు వస్తూనే ఉంటాయని ఓ విశ్లేషకుడు సమాధానం చెప్పాడు. తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తుడైన నెతన్యాహూ అధికారానికి ఎంతోకాలం దూరంగా ఉండలేరని ప్రతీతి. ఇప్పుడు ‘బిబి’ మరోమారు ఇజ్రాయెల్ ప్రధాని అయ్యారు. కేవలం మూడున్నరేళ్ళలో ఐదుమార్లు ఎన్నికలు జరిగిన ఈ దేశానికి, మూడోమారు ఆయన ప్రధాని అవుతున్నారు. ఇప్పటివరకూ ఏ ఇజ్రాయెల్ ప్రధానికీ దక్కని అవకాశమిది.

నెతన్యాహూ ఇప్పుడు మంచి మెజారిటీ అధికారంలోకి వచ్చారు కనుక, కొంతకాలం ఇజ్రాయెల్ కు వరుస ఎన్నికల బాధ తప్పుతుంది. ఇజ్రాయెలీలు కూడా ఈ వరుస ఎన్నికలతో విసుగెత్తిపోయినట్టుంది. ఇటీవలికాలంలో లేనంతగా అక్కడ భారీ పోలింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా, మితవాద ధోరణులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పదిశాతం మేరకు పెరగడం నెతన్యాహూ రాకను ఎవరు కోరుకుంటున్నారో స్పష్టం చేస్తున్నది. 120 సీట్లున్న పార్లమెంటులో ఆయన లికుడ్ పార్టీ నేతృత్వంలోని మితవాద పార్టీల కూటమి 64స్థానాలు గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే, గాజా నుంచి ఇజ్రాయెల్ మీదకు రాకెట్లు వచ్చిపడ్డాయి. ఇజ్రాయెల్ దీనికి ప్రతి దాడులు చేసినప్పటికీ, నెతన్యాహూ బాధ్యతలు స్వీకరించగానే అది మరింత తీవ్రంగా జరుగుతుందనడంలో సందేహం లేదు. అరబ్బులమీద తీవ్రంగా విషం కక్కుతూ, వారి స్థావరాలను స్వాధీనం చేసుకొని, దేశం నుంచి వెళ్ళగొట్టాలని డిమాండ్ చేసే తీవ్ర మితవాది ఇతామర్ బెన్ గ్విర్ నాయకత్వంలోని జూయిష్ పవర్ పార్టీ ఈ ఎన్నికల్లో 14 స్థానాలతో మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచినందున, ఈ తరహా పార్టీలతోనే నెతన్యాహూ కూటమి కట్టినందున ఇజ్రాయెల్ ఇకపై ఎంత దూకుడుగా ఉండబోతున్నదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం విషయంలోనే కాదు, పాలస్తీనియన్లతో ఇజ్రాయెల్ కనీసంగా వ్యవహరించే తీరును కూడా ప్రభావితం చేసే స్థానంలోకి తనను భవిష్యప్రధానిగా చెప్పుకుంటున్న బెన్ గ్విర్ వంటివారు వచ్చి కూర్చున్నారు. ‘అరబ్బులను చంపేయండి’ అని బహిరంగంగా ప్రకటించే ఆయనకే నెతన్యాహూ హోంమంత్రిత్వశాఖను అప్పగించబోతున్నందున, అరబ్బులపై దాడులు, ఊచకోతలు ఇకపై ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇజ్రాయెలీ సుప్రీంకోర్టు అధికారాలకు కత్తెరవేయాలన్న డిమాండ్ కూడా మితవాద పార్టీలనుంచి బలంగా ఉన్నందున, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ వారి కోర్కె మన్నించే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో గల్ఫ్ దేశాలతో ఎంతోకొంత సత్సంబంధాలు కొనసాగించిన నెతన్యాహూ ఇప్పుడు కొత్తపొత్తుల ఒత్తిడిమేరకు వాటిని చెడగొట్టుకొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమెరికాలో రిపబ్లికన్లతో మరీముఖ్యంగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో నెతన్యాహూ సాన్నిహిత్యం తెలిసిందే. డెమోక్రాట్లతో అంత సయోధ్యలేని నెతన్యామూ తిరిగి అధికారంలోకి రావడం బైడెన్ ప్రభుత్వానికి పంటికిందరాయివంటిది. మితవాదశక్తులన్నీ కట్టగట్టుకొని కొత్తపాలకులు కావడం, అరబ్బులతో ఘర్షణపూరితమైన వైఖరి అనుసరించబోవడం అమెరికాకు ఇబ్బంది కలిగించక తప్పదు.

ఇజ్రాయెల్ చరిత్రలో తొలిసారిగా ఒక అరబ్ పార్టీని అధికారంలో భాగస్వామిగా చేసుకొన్న ప్రస్తుత ప్రధాని లాపిడ్ తన విధానాల ద్వారా ఇజ్రాయెలీల ఆలోచనాధోరణిని కాస్తంత ప్రభావితం చేయగలుగుతారని మిగతా ప్రపంచం భావించింది. కానీ, గత కూటమి ప్రభుత్వం అందులో విఫలం చెంది, నెతన్యాహూ మరింత బలంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు కల్పించింది. నెతన్యాహూ విజయవార్తలు వెలువడగానే, ఆయనకు తొలిగా అభినందనలు తెలియచేసినవారిలో ప్రధాని నరేంద్రమోదీ ఒకరు. మోదీ–బిబి బంధం కంటే, ఇజ్రాయెల్–ఇండియా అనుబంధం మరింత బలమైనది, సుదీర్ఘమైనది అని ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఒకరు వ్యాఖ్యానించినప్పటికీ, నెతన్యాహూ నాయకత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం మనకు మరింత ప్రియమైనదని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అరబ్ ప్రపంచంతో మన ఆర్థిక ప్రయోజనాలు గతంలోకంటే ఎక్కువగా ముడిపడివున్నందున నెతన్యాహూతో భారత అధినాయకత్వం ఆచితూచి వ్యవహరించక తప్పదు.

Updated Date - 2022-11-10T01:34:34+05:30 IST