అమోఘం.. అపూర్వం!
ABN , First Publish Date - 2022-12-20T00:58:00+05:30 IST
విశ్వ క్రీడా యవనికపై ఒలింపిక్స్ తర్వాత అత్యుత్తమ ఆటల పండుగగా విరాజిల్లుతున్న సాకర్ ప్రపంచకప్‌లో, అర్జెంటీనా జగజ్జేతగా ఆవిర్భవించింది...
విశ్వ క్రీడా యవనికపై ఒలింపిక్స్ తర్వాత అత్యుత్తమ ఆటల పండుగగా విరాజిల్లుతున్న సాకర్ ప్రపంచకప్‌లో, అర్జెంటీనా జగజ్జేతగా ఆవిర్భవించింది. కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావంతో అందలమెక్కిన ఈ దక్షిణ అమెరికా జట్టు తమ చక్కని ఆటతీరుతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆసియాదేశం ఖతార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 32 దేశాలు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఆసక్తిగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్ ను ఓడించింది. సమకాలీన ఫుట్‌బాల్‌లోని అత్యున్నత ఆటగాళ్ల జాబితాలో అగ్రభాగాన ఉన్న లియోనెల్ మెస్సీ ఈ గెలుపుతో తన జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 1986లో మారడోనా బృందం తర్వాత అర్జెంటీనా మరోసారి కప్‌ను కైవసం చేసుకున్నట్టయింది. మొత్తంగా ఆ జట్టుకిది మూడో టైటిల్.
నెలరోజులపాటు ప్రపంచాన్ని ఊపేసిన సాకర్ వరల్డ్‌కప్‌లో అనేక సంచలనాలు నమోదయ్యాయి. మొరాకోలాంటి చిన్న దేశం నమ్మశక్యంకాని రీతిలో ఆడింది. ఆసియా జట్లు జపాన్, సౌదీ అరేబియా కూడా పెద్ద జట్లను హడలెత్తించాయి. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంతవరకూ ఏ ఆసియా దేశమూ కప్ నెగ్గకపోయినా అడపా దడపా అద్భుత విజయాలతో అదరగొడుతూనే ఉన్నాయి. 2002 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా నాలుగోస్థానం సాధించడమే ఇప్పటివరకూ ఓ ఆసియా జట్టు ఉత్తమ ప్రదర్శన. వరల్డ్‌కప్‌లో ఐరోపా దేశాలే రాజ్యమేలాయి. అత్యధికంగా జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు, ఫ్రాన్స్ రెండు దఫాలు, స్పెయిన్, ఇంగ్లండ్ ఒక్కోసారి కప్ సాధించాయి. ఇక దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్ (5), అర్జెంటీనా (3), ఉరుగ్వే (2) కూడా కప్ సాధించడంలో ముందున్నాయి. ఒక అరబ్ దేశంలో వరల్డ్‌కప్ జరగడం ఇదే మొదటిసారి. అలాగే, ఓ ఆసియా దేశం ఆతిథ్యమివ్వడం రెండోసారి. 2026లో జరగబోయే వరల్డ్‌కప్‌లో 48 దేశాలు పాల్గొనబోతున్నాయి. అంటే, ఇప్పటికంటే 12 దేశాలు ఎక్కువ. ఆ పోటీలకు ఒక దేశం కాకుండా అమెరికా, కెనడా, మెక్సికో కలసికట్టుగా ఆతిథ్యమివ్వబోతున్నాయి. ఇక ఈసారి వరల్డ్‌కప్‌లో గూగుల్ సెర్చ్ కూడా రికార్డు సృష్టించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతమంది టోర్నీ గురించి గూగుల్‌ను వెతికారట.
ఇక భారత ఫుట్‌బాల్ ప్రస్థానం నానాటికీ తీసికట్టు చందాన సాగుతోంది. రాజకీయ జోక్యం ఎక్కువైనందున జాతీయ సమాఖ్య ఇటీవలే ఫిఫా నుంచి నిషేధానికి గురై మళ్లీ తేరుకున్న సంగతి తెలిసిందే. మన జాతీయ జట్టు ఆటతీరు మిగతా పోటీ జట్లకు ఆమడ దూరంలో ఉంది. ఆసియా దేశాలైన జపాన్, సౌదీ అరేబియా, ఇరాన్, దక్షిణ కొరియా మనకంటే ఎంతో ముందున్నాయి. ప్రపంచ కప్‌లో ఆసియా నుంచి జరిగే అర్హత పోటీల్లో కూడా భారత జట్టు ఏ మాత్రం పోటీనివ్వలేకపోతోంది. అన్ని వయసు విభాగాలతోపాటు సీనియర్ జట్లు కూడా వరల్డ్‌కప్‌లకు అర్హత సాధించాలంటే మనం చేయాల్సింది ఒక్కటే. దేశంలో ఫుట్‌బాల్ వ్యవస్థను సమూలంగా, ప్రాథమిక స్థాయి నుంచే ప్రక్షాళించాలి. యువ ప్రతిభను వెతికిపట్టుకునే, వెలికితీసే కృషి విస్తృతంగా జరగాలి. దీనికిగాను రాష్ట్ర సంఘాలకు పుష్కలంగా నిధులు కేటాయించాలి. రాష్ర్టాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ప్రయాణ, వసతి సదుపాయాలకు ఏ లోటూ లేకుండా చూడాలి. వారికి అన్ని సౌకర్యాలూ కల్పించాలి.
భారత జట్టుకు ఎప్పుడూ ఒకరిద్దరు స్టార్లు తప్ప కనీసం నలుగురైదుగురు మంచి ఆటగాళ్లు ఉండడం లేదు. స్టార్ ఆటగాళ్లు అప్పుడప్పుడు అలా మెరుపులా వచ్చిపోతుండడం కనిపిస్తుంది. పీటర్ తంగరాజ్, సుబ్రతాపాల్, ఐఎమ్ విజయన్, బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి అద్భుత ఆటతీరుతో అలరించారు. 2017లో ఫిఫా అండర్- 17 ప్రపంచకప్‌ను భారత్ లో నిర్వహించినప్పుడు ఆతిథ్యదేశం హోదాలో భారత జట్టు పాల్గొంది. తాజాగా గత అక్టోబరులో అమ్మాయిల అండర్-17 వరల్డ్‌కప్‌ను సైతం భారతదేశమే నిర్వహించింది. అప్పుడు కూడా ఆతిథ్యహోదాలో మన అమ్మాయిలు పాల్గొన్నారు. టోర్నీలు నిర్వహించినంత మాత్రాన మన ఫుట్‌బాల్ చిత్రం మారిపోతుందని భావించలేం. భారత జట్టు వరల్డ్ ర్యాంక్‌ను గమనిస్తే పురుషుల విభాగంలో ఎప్పుడూ వందకు అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. భూటియా, విజయన్ ల ప్రభ వెలుగుతున్న సమయంలో 94వ ర్యాంక్‌కు చేరుకోవడమే మనకు ఇప్పటిదాకా గొప్ప విషయం. ఈ విషయంలో మహిళల జట్టే నయం. ప్రస్తుతం 61వ ర్యాంక్‌లో ఉంది. ఏదేమైనా భారత జట్టు రాబోయే రోజుల్లో వరల్డ్‌కప్ బరిలోకి దిగాలంటే ఫుట్‌బాల్ రంగ ప్రక్షాళన అత్యవసరంగా చేపడితేనే సాధ్యపడుతుంది.