మన కాలం బహదూర్ షా జఫర్!
ABN , First Publish Date - 2022-12-28T01:23:49+05:30 IST
వారసత్వంగా సంక్రమించిన ప్రాబల్యం, పలుకుబడి అంత తొందరగా పోవు. వైభవం క్షీణిస్తున్నా కొంత ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి కొత్త పాలకులు...
వారసత్వంగా సంక్రమించిన ప్రాబల్యం, పలుకుబడి అంత తొందరగా పోవు. వైభవం క్షీణిస్తున్నా కొంత ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి కొత్త పాలకులు గద్దె నెక్కిన తర్వాత పాత పాలకులకు సంబంధించిన అస్తిత్వ ఆనవాళ్లు లేకుండా చెరిపివేసేందుకు శత విధాలుగా ప్రయత్నాలు జరగడం కద్దు. అయినా వారి అడుగుజాడలు ఉండిపోతాయి. రాజ్యాధికారాలు కోల్పోయిన తర్వాత, చక్రవర్తులే కాదు, వారి కుటుంబ వారసులూ ప్రజా క్షేత్రం నుంచి ఆమడ దూరంగా జరిగిపోతారు. చరిత్ర పురోగమనంలో నిస్సహాయులు అయిపోతారు. నిమిత్తమాత్రంగా ఉండిపోతారు. అయినా నూతన పాలకులు వారిని తమకు ముప్పుగా పరిగణిస్తారు!
భారత్ జోడో యాత్రికుడు రాహుల్ గాంధీని చూస్తుంటే భారత ఉపఖండాన్ని శతాబ్దాల పాటు ఏలిన మొగల్ చక్రవర్తులలో చివరి వాడు బహదూర్ షా జఫర్ గుర్తుకు రావడం లేదూ? నేడు, 52 ఏళ్ల రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా రాజకీయ శూన్యతను అనుభవిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. నాడు, ఢిల్లీ నగరంలో సైతం తన హుకుం చెల్లుబాటు కానీ పరిస్ధితులలో 62 ఏళ్ళ బహదూర్ షా జఫర్, వైభవం కోల్పోయిన మొగల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టాడు.
తన పూర్వీకుల మహోన్నత గతానికి, తన దౌర్భాగ్య వర్తమానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న బహదూర్ షా పాదరక్షలు ధరించి తన సమక్షానికి వచ్చే సామాన్య సిపాయీలను చూసి కూడా మిన్నకుండిపోయే వాడు. ఢిల్లీలోని గల్లీలలో సైతం తన మాట చెల్లుబాటు కాని పరిస్థితులలో నిమిత్తమాత్ర చక్రవర్తిగా ఉన్న బహదూర్ షా జఫర్ తన సింహాసనాన్ని పరిరక్షించుకోవడానికి బదులుగా కవితా సృజన, చదరంగం ఆటపై ఆసక్తి చూపేవాడు. ఏమైతేనేమి, దేశానికి ఒక దశ, దిశ నిర్దేశించిన మహోన్నత మొగల్ చక్రవర్తుల వారసుడుగా ఘనమైన గుర్తింపు మాత్రం ఉన్నది. అదే ఆయనకు, వద్దన్నా కాదన్నా 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ పోరాట సర్వోన్నత నాయకత్వాన్ని కట్టబెట్టింది. చాందీని చౌక్ దాటి తన మాట చెల్లుబాటు కానీ పరిస్థితులలో తనను ఎవరు నాయకుడిగా గుర్తిస్తారని సంశయించినా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల తిరుగుబాటుదారులు ఏకగ్రీవంగా బహదూర్ షా జఫర్‌ను తమ నాయకుడిగా ప్రకటించారు. అతడి నేతృత్వంలో ఆంగ్లేయులపై కత్తి దూశారు. బలమైన ప్రత్యర్థులు కదా ఆంగ్లేయులు, వారే అంతిమ విజేతలయ్యారు. బహదూర్ షా జఫర్ కుమారులను ఊచకోత కోశారు. వృద్ధ చక్రవర్తిని అవమానకరంగా ఢిల్లీ నుంచి బర్మాకు ప్రవాసం పంపించారు. ఆ మొగల్ వంశ వారసుడు భారత్‌లో ఎక్కడ ఏ మూల ఏ రకమైన బలహీనమైన స్థితిలో ఉన్నా తమకు ముప్పుగా పరిణమిస్తాడని ఆంగ్లేయులు భయపడ్డారు మరి.
ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితి గతించిన మొగల్ సామ్రాజ్య అధోగతికి భిన్నంగా లేదు. రాహుల్ గాంధీ, బహదూర్ షా జఫర్ పరిస్థితులకు పెద్దగా తేడా లేదు. అన్ని విధాల అశక్తుడుగా ఉన్నప్పటికీ చివరి మొగల్ చక్రవర్తి ఆనాటి తిరుగుబాటుదారులకు ఒక ఆశాకిరణంగా కనిపించాడు. అదే రీతిలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలకు ఒక వారధిగా వ్యవహరించగల నేతగా రాహుల్ గాంధీ గోచరిస్తున్నాడు. ఆంగ్లేయులు తమను ప్రతిఘటించిన వారందరినీ ఆజ్ఞాతంలోకి లేదా అండమాన్ నికోబార్‌లోని కాలాపానీకి పంపించారు. అయితే ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో అటువంటి పరిస్థితి లేదు. దానికి బదులుగా విచారణ సంస్థల వేధింపులు, మీడియాలో దుష్ప్రచారాన్ని సాగించే వెసులుబాటు ఉన్నది. ప్రస్తుత పాలకులు వాటిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు.
ప్రజల మధ్య ప్రజల కొరకు పోరాట పటిమతో ఉండవల్సిన నాయకుడు కేవలం ట్విటర్ వేదికకే పరిమితమవుతున్నాడన్న అవహేళనను, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోలేక పోతున్నాడన్న నిరసనలను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఒక శుభ ముహూర్తాన భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణులను చైతన్యీకరించింది. సమాజంలోని వివిధ వర్గాలలోనూ ఎనలేని ఆసక్తిని కలిగిస్తోంది. మీడియా సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ పాదయాత్ర మార్గంలో ప్రతి చోటా ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికినట్లుగా చెబుతున్నారు. ట్విటర్ వదిలి రాహుల్ గాంధీ ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. ఇది ఎంతైనా ముదావహం. అది ఆయనకు వ్యక్తిగత లబ్ధి సమకూరుస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ జోడో యాత్ర కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎంత వరకు లబ్ధి చేకూరుస్తుందనేది అసలు ప్రశ్న. విద్వేషానికి వ్యతిరేకంగా, ప్రేమాభిమానాలతో భారతీయులందరు కలిసి మెలిసి ఉండాలనే సంకల్పంతో జరుగుతున్న ఈ యాత్ర తన లక్ష్యాన్ని ఎంత వరకు సాధించగలదు? రాహుల్ గాంధీతో సహా ఎవరూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ ఇంకా బలంగా ఉన్న కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో పాటు, చాలా బలహీనంగా ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయన తన యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొరకు ఏం చేశారు? మహారాష్ట్రలో యాత్ర సందర్భంగా ఆయన మిత్రపక్షం శివసేన పట్ల వ్యవహరించిన తీరు, సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా నష్టం కలిగించాయి. సమర్థుడు, దీక్షా దక్షుడైన రాజకీయ యోధుడిగా ప్రభవించేందుకు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీకి దోహదపడాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)