చైనీయుల నిరసన
ABN , First Publish Date - 2022-11-30T00:45:47+05:30 IST
చైనాకమ్యూనిస్టు పార్టీకి జిన్ పింగ్ మూడోమారు చైర్మన్ అయి నెలరోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆయనను ఒకపక్క కొత్తగా వేలాది కరోనాకేసులు, మరోపక్క ప్రజాందోళనలు...
చైనాకమ్యూనిస్టు పార్టీకి జిన్ పింగ్ మూడోమారు చైర్మన్ అయి నెలరోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆయనను ఒకపక్క కొత్తగా వేలాది కరోనాకేసులు, మరోపక్క ప్రజాందోళనలు చుట్టుముడుతున్నాయి. చట్టంచేతికి చిక్కకుండా తమ అభిప్రాయాలను ఎలా చెప్పాలో చైనీయులు ఈ మధ్య బాగా నేర్చుకున్నారు. కరోనా సంక్షోభకాలంలో కూడా దేశంలోని పరిస్థితిని వారు ఎంతోకొంత బయట ప్రపంచానికి తెలియచెప్పారు. మరీముఖ్యంగా, కరోనా వ్యాధి గురించి ఒక డాక్టర్ ఎంతోముందుగా చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవినపెట్టి, ఆ తరువాత తీవ్రంగా వేధించడం, అంతిమంగా కరోనా కారణంగానే ఆ డాక్టర్ కన్నుమూయడం చైనా సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఏ రాతలూ లేని తెల్లకాగితాలను చూపుతూ చైనీయులు పాలకులకు తమ నిరసన తెలియచేస్తున్నారు. దేశంలో ఒక్క కొవిడ్ కేసు కూడా ఉండకుండా చూడాలన్న లక్ష్యం పెట్టుకొని, ఒక్క కేసు బయటపడగానే వందలమందిని నిర్బంధానికి గురిచేసే విధానంతో అక్కడి జనం విసిగిపోయారు. నిరంతర లాక్ డౌన్లతో, కఠినమైన ఆంక్షలతో, నిర్బంధాలతో చైనా అధ్యక్షుడు అనుసరిస్తున్న ఈ ‘జీరో కొవిడ్’ విధానంమీద పెల్లుబుకుతున్న నిరసనలతో ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత దిగివచ్చింది.
వూహాన్ లో పుట్టి యావత్ ప్రపంచానికీ పాకిన ఈ మాయరోగం నుంచి మిగతాదేశాలు కాస్తంత ఒడ్డునపడ్డా చైనాను మాత్రం అది వదలడం లేదు. కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు లక్షలాది అనధికారిక మరణాలతో పాటు, చైనీయులు ఆహార కొరతతోనూ, ఉపాధిలేమితోనూ చాలా కష్టాలు పడ్డారు. అనంతరం కాస్తంత వెసులుబాటు వచ్చినప్పటికీ, నిరంతరం దేశంలో ఎక్కడో ఒకచోట కొత్త కేసులు బయటపడుతూండటం, ప్రభుత్వం ప్రజలను చుట్టుముట్టడం జరుగుతూనే ఉంది. కఠినమైన నిర్బంధాలు, సున్నా కొవిడ్ విధానాలు కరోనా నుంచి ప్రజలను రక్షించలేకపోతున్నాయి. ఇప్పుడు రోజుకు నలభైవేల కేసులవరకూ నమోదవుతూండటంతో ప్రభుత్వం మరింత తీవ్రంగా స్పందించింది. అందులోభాగంగా, జిన్ జియాంగ్ రాజధాని ఉరుమ్కీలో ఒక బహుళ అంతస్థుల భవనం అగ్నిప్రమాదానికి గురై పదిమంది మరణించడంతో ప్రజల్లో ఇంతకాలం ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం అంతా కట్టలుతెంచుకొని బయటకు వచ్చింది. జీరో కొవిడ్ విధానంలో భాగంగా స్థానిక అధికారులు గత వందరోజులుగా ఆ భవనంలో జనాన్ని తాళాలు వేసి మరీ నిర్బంధించారు. అటుగా పోయ దారులన్నీ మూసివేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకోలేకపోయారు. ఈ విషాదం ప్రజల మనసులను తీవ్రంగా తాకి, రోడ్లమీదకు వచ్చేట్టు చేసింది. నిరసనలకు గుమిగూడినవారు వేలల్లో లేకపోవచ్చు కానీ, యువత ఇలా కదిలిరావడం, నిరసనలు క్రమంగా దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించడం, ఇతరులు కూడా అందులో పాల్గొనడం చాలామందికి తియాన్మెన్ ఘటనను గుర్తుచేస్తున్నది. తెల్లకాగితాలు చేతిలో పట్టుకోవడం ద్వారా మిగతా ప్రపంచానికి తమకు మాట్లాడేస్వేచ్ఛ ఏమాత్రం లేదని చెప్పదల్చుకున్నట్టు ఉంది.
జిన్ పింగ్ అధ్యక్షుడైన పదేళ్ళకాలంలో నిరసనలు, ఆందోళనలకు ఏమాత్రం తావులేని రీతిలో పాలన సాగుతోంది. అవినీతి ఆరోపణలతో సహా అన్ని అస్త్రాలూ ప్రయోగించి ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను తప్పించి, పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల మీద తీవ్రమైన ఆంక్షలు విధించారు. మొన్న అక్టోబరులో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో ఆయన జీరో కొవిడ్ విధానాన్ని సరళతరం చేస్తారని ప్రజలు ఆశించారనీ, అందుకు భిన్నంగా ఆయన మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్టు చెప్పడంతో ప్రజలు తట్టుకోలేకపోయారని అంటారు. చైనా అధ్యక్షుడు ఈ విధానాన్ని వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా చూస్తున్నారనీ, వియత్నాం, న్యూజిలాండ్ వంటి చాలా దేశాలు ఇదేవిధానాన్ని ఆరంభంలో అనుసరించి, ఆ తరువాత దానిని వదిలేశాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటికీ అవకాశం ఇవ్వని రీతిలో చైనా విధానం ఉన్నందునే అక్కడ ఇంకా కేసులు పుట్టుకొస్తున్నాయన్న వాదన కూడా ఉన్నది. నిరసనలు మరింత విస్తరించకుండా జిన్ పింగ్ ఏమి చేయబోతున్నారోనని మిగతా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.