కలహాలు, కారణాలు

ABN , First Publish Date - 2022-12-13T03:53:29+05:30 IST

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీకోర్టు అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ సరైనదా, కాదా అన్న విషయాన్ని అటుంచితే...

కలహాలు, కారణాలు

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీకోర్టు అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ సరైనదా, కాదా అన్న విషయాన్ని అటుంచితే, దీనిపేరిట రెండు వ్యవస్థల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరాటం నానాటికీ హెచ్చుతున్నది. పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీని గవర్నర్ హోదాలో ముప్పుతిప్పలు పెట్టి, బీజేపీ ఎదుగుదలకు బాటలు పరిచిన జగదీప్ ధన్ కర్ ఉపరాష్ట్రపతి కాగానే, రాజ్యసభ చైర్మన్ హోదాలో తన స్వభావానికి తగినట్టుగా వ్యవహరిస్తారని ఊహించిందే. కొలీజియం విధానం మీద అప్పటివరకూ పాలకులకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న గిల్లికజ్జాలకు ఆయన తన వ్యాఖ్యలతో ప్రత్యక్ష ఘర్షణ రూపాన్నిచ్చారు. ఇప్పటివరకు న్యాయమంత్రి కిరణ్ రిజిజు మాత్రమే ఈ విమర్శలు చేస్తుండగా, న్యాయశాస్త్ర కోవిదుడైన ఉపరాష్ట్రపతి నేరుగా బరిలోకి దిగడాన్ని బట్టి, ప్రభుత్వపరంగా ఒక పద్ధతిప్రకారం న్యాయవ్యవస్థమీద ఒక దాడి సాగుతున్నట్టు కనిపిస్తున్నది.

చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ కావడం, సుప్రీంకోర్టునుంచి వెలువడుతున్న తీర్పులు, పెద్దనోట్ల రద్దు వంటి వివాదాలు దాని చేతుల్లో ఉండటం ఈ పరిణామాలకు దోహదం చేస్తుండవచ్చునని కొంతమంది అనుమానం. రాజ్యసభ చైర్మన్ గా ధన్ కర్ తన తొలి ప్రసంగంలోనే కొలీజియం వ్యవస్థమీద విమర్శలు చేశారు. ఏడేళ్ళక్రితం సుప్రీంకోర్టు జాతీయ న్యాయనియామకాల కమిషన్ (ఎన్ జేఎసీ) చట్టాన్ని కొట్టివేయడం ద్వారా ప్రత్యక్షంగా పార్లమెంటు సర్వా్ధిపత్యాన్ని, పరోక్షంగా ప్రజాభీష్టాన్ని దెబ్బతీసిందన్నారు. చట్టాన్నికొట్టేస్తే పార్లమెంటు సభ్యులు ఒక్కరు కూడా కిక్కుమనలేదని, తన అధికారాలను పరిరక్షించుకోవడం పార్లమెంటు విధి అని చెప్పడం ద్వారా ఆయన అమీతుమీ తేల్చుకుందామని పిలుపునిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చేసే చట్టాలను న్యాయవ్యవస్థ కొట్టేస్తే అది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారాయన. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల నిర్ణయాలను, చర్యలను సమీక్షించే, రద్దుచేసే అంతిమ అధికారం రాజ్యాంగం ద్వారానే న్యాయవ్యవస్థకు సంక్రమించిందని ఈ న్యాయకోవిదుడికి తెలియదనుకోలేం.

నియామకాల్లో జాప్యానికి అటార్నీ జనరల్ ను ప్రశ్నిస్తున్న సందర్భంలో, తాను ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం, నియంత్రణ పాటించాలని హెచ్చరించడం వంటివి అటుంచితే, న్యాయమూర్తులు చేసిన మరొక వ్యాఖ్య సముచితమైనది. నియామకాలకు సంబంధించి ఒక కొత్తచట్టాన్ని చేసుకోవడానికి పార్లమెంటుకు తామేమీ అడ్డుపడటం లేదనీ, కానీ, ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ అమల్లో ఉన్నందున ప్రభుత్వం విధిగా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని వారు స్పష్టం చేశారు. అటువంటి ఒక కొత్త ప్రయత్నానికే పాలకులు ఇలా పునాదులు వేస్తున్నారన్న అనుమానాలను అటుంచితే, బంట్రోతు స్థాయి నుంచి అన్ని నియామకాలూ తామే చేయాలని పాలకులన్నవారంతా ఆశపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆయా సంస్థల్లోనూ, వ్యవస్థల్లోనూ అస్మదీయులను చొప్పిస్తున్న తరుణంలో, కీలకమైన న్యాయవ్యవస్థ పూర్తిగా తమ అధీనంలోకి రాకుండా చేజారిపోయినందుకు బాధగా ఉండటం సహజం. కేంద్రంలో అధికారంలోకి రాగానే 99వ రాజ్యాగ సవరణ ద్వారా న్యాయమూర్తుల నియామకకర్తలుగా తామే వ్యవహరించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తే, ఏడాది తిరగకుండానే దానిని తిప్పికొట్టినందుకు సర్వోన్నత న్యాయస్థానంమీద ఆగ్రహం సహజం. కొలీజియం పంపిన జాబితాలను తిప్పిపంపడం, సుప్రీంకోర్టు వాటినే మళ్ళీ పంపితే, ఒకరిద్దరి పేర్లకు మాత్రమే టిక్కుపెట్టి మిగతావారిని కాదనడం వంటి చర్యలతో కూడా ఆ ఆగ్రహం ఉపశమించడం లేదు. అయోధ్య, రాఫెల్, కశ్మీర్ స్వయంప్రతిపత్తి ఇత్యాది వివాదాలను దాటివచ్చిన సుప్రీంకోర్టులో ఇప్పుడు కొరకరానికొయ్యలు కొందరు పెద్దస్థానాల్లో ఉండటంతో పార్లమెంటు సార్వభౌమత్వం పేరిట న్యాయవ్యవస్థను హద్దుల్లో ఉంచే ప్రయత్నం ఒకటి విశేషంగా జరుగుతున్నట్టు కనిపిస్తున్నది.

Updated Date - 2022-12-13T03:53:37+05:30 IST