మొండి బాకీల మాయ
ABN , First Publish Date - 2022-11-24T02:34:34+05:30 IST
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాలబాటపడుతున్న మంచిరోజులు వచ్చాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు....
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాలబాటపడుతున్న మంచిరోజులు వచ్చాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. 2022–23 ఆర్థికసంవత్సరం రెండో త్రైమాసికంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు సుమారు పాతికవేల కోట్ల నికర లాభాన్ని సాధించాయని ప్రకటిస్తూ, మొండిబాకీలను తగ్గిస్తూ, బ్యాంకులను ఆర్థిక ఆరోగ్యంతో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం నిరంతరాయంగా చేస్తున్న కృషి ఫలితమే బ్యాంకుల లాభార్జన అని వ్యాఖ్యానించారు ఆమె. కేవలం ఏడాదిలో ఈ లాభం యాభైశాతానికి పైగా హెచ్చినందుకు కచ్చితంగా సంతోషించాల్సిందే. అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సుమారు పదిహేనువేల కోట్ల లాభంతో, గత ఏడాదితో పోల్చితే లాభార్జన విషయంలో ఏకంగా డెబ్బైశాతం మెరుగుదల సాధించింది. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు నూటయాభైశాతం మెరుగుపడ్డాయి.
బ్యాంకులు బాగుపడ్డాయి, లాభాలు గడిస్తున్నాయి అని ఆర్థికమంత్రి చెప్పి, తన దగ్గరున్న డేటా విడుదల చేసి ఊరుకోనుంటే సరిపోయేది. మొండిబాకీలను తగ్గించే విషయంలో తమ ప్రభుత్వం అపరిమిత కృషి ఫలితమే ఇది అనడంవల్ల, బ్యాంకుల లాభార్జన అంశాన్ని మెచ్చుకుంటూనే మొండిబాకీల విషయంలో ప్రభుత్వం చాలా మాయలు చేస్తున్నదన్న విమర్శలు ఆరంభించారు. బ్యాంకులతో పాటుగా, బ్యాడ్ బ్యాంక్ అని స్థూలంగా చెప్పుకొనే ఎన్ ఏఆర్ సిఎల్, ఐడీఆర్ సిఎల్ లతో ఆర్థికమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మొండిబాకీలను సంగతి వేగంగా పరిష్కరించడంపై ప్రత్యేకశ్రద్ధపెడుతున్న మాట నిజం. బ్యాంకుల బాకీలను ఒక సంస్థ తన ఖాతాలో వేసుకుంటే, మరొకటి వాటిని పరిష్కరించే బాధ్యత నిర్వహిస్తుంది. అయితే, బకాయీలు అత్యధికంగా ఉన్న సంస్థల అమ్మకాలు, కొనుగోళ్ళు అనుకున్నంత వేగంగా సాగవు కనుక, ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదని నిపుణులు అంటున్నారు. ఇక, ఎన్ పిఎ నిబంధనలను 180 రోజులనుంచి సగానికి తగ్గించడం కూడా బ్యాంకులు లాభాలు చూపించుకోవడానికి మరోకారణమని అంటున్నారు.
గత ఏడుసంవత్సరాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు సుమారు పదిలక్షల కోట్ల కార్పొరేట్ సంస్థల రుణాన్ని రద్దుచేశాయి. నష్టాల్లోకి జారిపోతున్న బ్యాంకులను ఆర్థికంగా నిలబెట్టే పేరిట ప్రభుత్వం వాటికి మూలధనం సమకూర్చడం, అవి తిరిగి కార్పొరేట్లకు భారీ రుణాలు సమకూర్చడానికేనన్న విమర్శ తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం ఈ మధ్యన బ్యాంకులకు మూడులక్షల కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది కూడా. ఇప్పుడు లాభాలు మూటగట్టుకున్నదని అంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దాదాపు రెండులక్షలకోట్ల మొండిబాకీలున్నాయని ఇటీవలే ఒక ఆర్టీఐ సమాచారం తేల్చింది.
ఐదేళ్ళలో పదిలక్షలకోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ రుణాలు బ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వుబ్యాంకు ఈ మధ్యనే ప్రకటించింది. ఇక, ఎన్ పిఎలుగా ప్రకటించిన మొత్తంలో కూడా పదిహేనుశాతంలోపే వసూలైందని నిపుణుల అంచనా. మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేళ్ళ కాలంలో పన్నెండులక్షలకోట్ల రుణాలు మాఫీ చేయడంతో పాటు, దీని లబ్ధిదారుల వివరాలు బయటపెట్టడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో న్యాయస్థానాల ఆదేశాలు, సమాచార హక్కు చట్టాలు కూడా ఏమీ చేయలేకపోయాయి.
నిరర్థక ఆస్తులను గాడినపెట్టే పేరిట మరిన్ని అప్పులు ఇవ్వడం అవి కూడా వెనక్కురాకపోవడం జరుగుతున్నదే. భారీ బాకీలను రద్దుచేయడం, మళ్ళీ రుణాలు ఇవ్వడం, వాటిని ఖాతాపుస్తకాల్లో వేరుపేర్లతో పరిగణించడం వంటివి సామాన్యుడికి అర్థంకాని ఆర్థిక విన్యాసాలు. పారుబాకీలున్న సంస్థను మరో సంస్థకు కట్టబెడుతున్న ప్రక్రియలో కూడా అంతిమంగా బ్యాంకులే నష్టపోతున్నాయి. బ్యాంకులు క్లెయిమ్ చేస్తున్న మొత్తాన్ని ఎన్ సిఎల్ టి వంటివి ముందే కుదించడమే కాక, అంతిమంగా వాటికి అందుతున్నది మరింత తక్కువ. పాత బాకీలు ఎంత ఉన్నప్పటికీ కొత్తగా టేకోవర్ చేసిన సంస్థలు విదల్చుతున్న మొత్తాలతోనే బ్యాంకులు సరిపెట్టుకోక తప్పడం లేదు. పద్దుపుస్తకాలను శుభ్రపరిచేపేరిట లక్షలకోట్లు రద్దుచేయడం, లేదా నిలబెట్టే పేరిట కొత్తగా మరిన్ని కేటాయింపులు చేయడం, చిన్నచిన్న రికవరీలను కూడా లాభాలుగా చూపడం ఒక విన్యాసం. గత పదేళ్ళలో అపరకుబేరులకు బ్యాంకులు ఎన్ని లక్షలకోట్లు రుణాలుగా ఇచ్చాయో, వాటిలో ఎంతమొత్తం వెనక్కువచ్చిందో ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పుడే బ్యాంకుల లాభాలబాటకు సంబంధించిన అసలు రహస్యం బోధపడుతుంది.