విధ్వంసాలు, వీరంగాలు
ABN , First Publish Date - 2022-11-04T05:11:22+05:30 IST
రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడటంలో లబ్ధప్రతిష్ఠులైన ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద...
రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడటంలో లబ్ధప్రతిష్ఠులైన ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద వేధింపుల విధానాన్ని కొనసాగిస్తూనే ఉంది. గురువారం తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో కుటుంబీకులంతా నిదురిస్తున్న సమయంలో పోలీసులు గోడలు దూకి మరీ ఇంట్లోకి చొరబడి, ఆయననూ కుమారుడినీ అరెస్టు చేశారు. అయ్యన్న అరెస్టులో సీఐడీ విధానాన్ని న్యాయస్థానం ఆమోదించలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసినందుకు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అయ్యన్న రిమాండ్ తిరస్కరించింది.
ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి, దానిని సమర్థించుకోవడానికి తప్పుడు ఎన్ వోసీ సృష్టించారన్నది అయ్యన్న మీద ఉన్న అభియోగం. కుట్రచేసి భూమి ఆక్రమించారనీ, న్యాయస్థానంలో అన్నీ తేలుతాయని మూడుముక్కలు చెప్పి, పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మధ్యలోనే నిష్క్రమించిన సీఐడీ పెద్ద, ఈ కేసులో అర్థరాత్రి అరెస్టులతో అంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో కనీసం చెప్పివుంటే బాగుండేది. రాజకీయకక్షలు పాలకులకు ఉండవచ్చునేమో కానీ, పోలీసులు మాత్రం చట్టబద్ధంగా నడుచుకోవాల్సిందే. రహస్యసమాచారంతో ఒక ఉగ్రవాదినో, తీవ్రవాదినో పట్టుకున్నంత తీవ్రస్థాయిలో అయ్యన్నను కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా పోలీసులు లాక్కెళ్ళిన ఘట్టాన్ని చూసినప్పుడు ఇదంతా పాలకపెద్దల కళ్ళలో ఆనందాన్ని చూడటానికేనని అనిపించకమానదు. ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాక, విపక్షాలను అణచివేసే తాడేపల్లి రాజ్యాంగం అమలవుతున్నదన్న విమర్శలకు ఇటువంటి చర్యలు మరింత ఊతాన్నిస్తాయి.
ఈ ఏడాది జూన్ లో ఆక్రమణల తొలగింపు పేరిట రెవిన్యూ అధికారులు ఇలాగే ఓ అర్థరాత్రి జేసీబీలతో సహా వచ్చి అయ్యన్నపాత్రుడి ఇల్లు కూల్చివేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. వందలమంది పోలీసుల మద్దతుతో, ముందుగా పట్టణం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసి అధికారులు వీరంగం వేశారు. ఈ అర్థరాత్రి కూల్చివేతలేమిటంటూ ఈ చీకటిదాడిని రాష్ట్ర హైకోర్టు అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టి, అధికారులను మందలించింది. మాటకారితనంతో, విరుపులతో, అధికారపక్షంమీద ఘాటైన విమర్శలు చేసే అయ్యన్నపాత్రుడి మీద అధికారపక్ష పెద్దలు ప్రత్యేకంగా కక్షకట్టారనీ, ఆయనను ఎలాగైనా జైల్లోకి నెట్టాలని చూస్తున్నారనీ తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అయ్యన్నమీద జగన్ ప్రభుత్వం డజనుకు పైగా కేసులు పెట్టింది. ఆయనను మానసికంగా దెబ్బతీయడానికి ఓ రేప్ కేసు కూడా బనాయించింది. సభలో బలంగా అధికారపక్షాన్ని నిలదీసే మరో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కూడా ఇదే తరహాలో పోలీసులు ఓ అర్థరాత్రి గోడలు దూకిమరీ అరెస్టు చేసి, ఏకంగా ఆరువందల కిలోమీటర్లు రోడ్డుమార్గంలో తిప్పి, మందులు వేసుకోవడానికి కూడా అనుమతించకుండా చివరకు ఆస్పత్రి పాల్జేశారు. మరో బీసీ నేత, సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మీద కూడా అట్రాసిటీ సహా అనేక కేసులు పెట్టారు.
నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయవద్దంటూ న్యాయస్థానాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు చీవాట్లు పెట్టాయి. అయినా, అదే విధానం అమలవుతున్నది. నిందితులు సహకరించని పక్షంలో అరెస్టులు చేసే అధికారం తమకున్నదని అంటున్న పోలీసులు ఈ అర్థరాత్రి దాడుల తరువాత అయ్యన్న సహకరించలేదని ఎలా అనగలరు? హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ నకిలీదని వాదిస్తున్నప్పుడు ఆ విషయాన్ని నేరుగా న్యాయస్థానానికే నివేదించవచ్చు. న్యాయం కంటే రాజకీయ కక్షతీర్చుకోవడం ముఖ్యమైనందునే ఈ అడ్డదారులన్నీ. పాలకులే ఆరోపణలు చేయడం, వారే నేరనిర్థారణ చేయడం, శిక్షలు వేయడం ఎక్కడి విధానమో అర్థంకాదు. తెలుగుదేశం పార్టీ నాయకులనూ వారి వ్యాపారాలనే కాదు, వారితో బంధుత్వం ఉన్నవారి ఆస్తులపై కూడా అధికారపక్షం విరుచుకుపడుతూ భయభ్రాంతులకు లోను చేస్తున్నది. జేసీబీ, ఏసీబీ, పీసీబీ సహా సమస్త ఆయుధాలూ గిట్టనివారిపై ప్రయోగిస్తూ, ప్రజాస్వామ్యానికీ, న్యాయానికీ, చట్టానికీ ఏమాత్రం విలువలేని రీతిలో నియంతృత్వ తరహా పాలన సాగడం విషాదం.