దిగివచ్చినట్టేనా?

ABN , First Publish Date - 2022-12-07T00:22:19+05:30 IST

ఇరాన్ లో అత్యంత వివాదాస్పద నైతిక పోలీసు వ్యవస్థ రద్దుకు నిర్ణయించినట్లుగా ఆ దేశ అటార్నీ జనరల్ చేసిన ప్రకటన అంత స్పష్టంగా లేదుగానీ...

దిగివచ్చినట్టేనా?

ఇరాన్ లో అత్యంత వివాదాస్పద నైతిక పోలీసు వ్యవస్థ రద్దుకు నిర్ణయించినట్లుగా ఆ దేశ అటార్నీ జనరల్ చేసిన ప్రకటన అంత స్పష్టంగా లేదుగానీ, ఆయన అటువంటి భావనే వ్యక్తంచేయడం, రద్దు చేస్తున్నట్లుగా ఆ దేశ మీడియాలో వచ్చినవార్తలను ఎవరూ ఖండించకపోవడం చూసినప్పుడు ఇరాన్ ప్రభుత్వం వెనక్కుతగ్గిందనే నమ్మాలి. హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా మూడునెలలుగా ఇరాన్ మహిళలు చేస్తున్న పోరాటం అద్వితీయమైనది. దేశాన్ని కుదిపేయడంతో పాటు అది యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ లోతైన చర్చలు, విశ్లేషణలు సాగాయి. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయడంతో పాటు, హిజాబ్ నియమనిబంధనల పునఃపరిశీలన కూడా జరుగుతున్నట్టు అటార్నీ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, తమకు ఆమోదయోగ్యమైన విధానప్రకటన వెలువడేవరకూ ఉద్యమాన్ని నిలిపివేయకూడదని ఇరాన్ మహిళలు నిర్ణయించడం మెచ్చుకోదగ్గది.

ఈ ప్రకటన అటార్నీ జనరల్ నోట మాత్రమే వచ్చినందున, నైతికపోలీసు వ్యవస్థను నిర్వహించే మంత్రిత్వశాఖ కానీ, అధికారులు కానీ ఇంకా ఏమీ చెప్పనందున మహిళోద్యమాన్ని బలహీనపరచడానికి పాలకులు తాత్కాలికంగా ఈ అస్త్రాన్ని ప్రయోగించారన్న అనుమానాలు లేకపోలేదు. నైతిక పోలీసు వ్యవస్థకు న్యాయమంత్రిత్వశాఖతో సంబంధం లేదనీ, దానిని సృష్టించినవారే దానిని ఇప్పుడు మూసివేశారని అటార్నీ అంటున్నారు. అయితే, అసలు దేశంలో నైతిక పోలీసు వ్యవస్థ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదనీ, ప్రజాభద్రతా విభాగం మాత్రమే ఉన్నదనీ, అది ఎప్పటిలాగానే తనపని తాను చేసుకుపోతుందని కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే, ఉద్యమ తీవ్రతను చల్లార్చేందుకు అటార్నీ ద్వారా ఓ కుట్ర జరిగిందని ఇరాన్ మహిళలు అనుమానిస్తున్నారు. ఇదేకనుక నిజమైతే, ఉద్యమాన్ని ఇంత తీవ్రస్థాయికి తీసుకుపోయి, సుదీర్ఘకాలం కొనసాగించగలిగినవారికి దానిని మరింత ఉధృతం చేయడం తెలియకపోదు. తిరుగుబాటును అణచివేసేందుకు ఇరాన్ పాలకులు ఇంతకుమించిన దౌష్ట్యాలు అనేకం చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే మూడునెలల ఉద్యమకాలంలో మూడువందల యాభైమంది మరణించారంటే అణిచివేత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఖ్య ఐదువందలకుపైగానే ఉందని అనధికారిక అంచనా. ఉద్యమంలో కుర్దిష్ శక్తులు చొరబడ్డాయనీ, విదేశీ ఆర్థికసాయం అందుతోందనీ అంటూ ఇరాన్ మహిళలపై మతపాలకులు దమనకాండ సాగించారు. ఉద్యమంలో భాగంగా అరెస్టయిన వేలాదిమందిలో నటీనటులతో సహా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులూ ఉండటం విశేషం. కానీ, మహ్సా అమినీ అనే ఓ ఇరవైరెండేళ్ళ యువతి సెప్టెంబరు 16న నైతిక పోలీసుల దాష్టీకానికి బలైనక్షణం నుంచి రేగిన ఈ ప్రజాగ్రహాన్ని చల్లార్చడం వారివల్ల కాలేదు.

ఇరాన్ మహిళలు స్వేచ్ఛకోసం, హక్కుల కోసం పోరాడటం అనాదిగా ఉన్నప్పటికీ, సామాజిక మాధ్యమాల సౌజన్యంతో ఈ తిరుగుబాటులోని ప్రతీ ఘట్టం ప్రపంచానికి తెలియవచ్చింది. తమ అసమ్మతికి సూచనగా జుత్తుకత్తిరించుకోవడం, నెత్తిపై ఉన్న వస్త్రాన్ని బహిరంగస్థలాల్లో తీసివేయడం, తగులబెట్టడం, హిజాబ్ లేకుండానే బయటకు రావడం వంటి దృశ్యాలు ప్రపంచవ్యాప్తమై మద్దతు కూడగట్టుకున్నాయి. ఫుట్ బాల్ ప్రపంచకప్ వేడుకల ఆరంభ కార్యక్రమంలో తమ జాతీయగీతం ఆలపించకుండా ఇరాన్ బృందం సంఘీభావం ప్రకటించడం మరో విశేషమైన ఘట్టం. ఎప్పటిలాగానే ఇరాన్ పాలకులు దీనిని అమెరికా కుట్ర అని ఆరోపిస్తున్నప్పటికీ, ఇది నాయకుడంటూ లేని పూర్తి ప్రజాఉద్యమం అన్నది వాస్తవం. మితవాద ప్రధాని ఇబ్రాహీం రైసీ ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీకి సన్నిహితుడే కాక, త్వరలోనే ఈయన కూడా సుప్రీం లీడర్ అవుతాడనీ, మహిళల వస్త్రధారణ విషయంలో వెసులుబాట్లకు వీరు సిద్ధంగా లేరనీ వార్తలు వస్తున్నాయి. నైతిక పోలీసులు బహిరంగంగా తిరిగే మొబైల్ యూనిట్లను ప్రస్తుతానికి రద్దుచేసి, మరోవ్యవస్థ ద్వారా మహిళల వస్త్రధారణను నియంత్రించే ఆలోచన పాలకులకు ఉన్నదని అంటున్నారు. ఇరాన్ మతపాలనా వ్యవస్థ ఎంతకఠినమైనదైనా, ఉదారవాదులైన మహ్మద్ ఖతామీ, హసన్ రౌహానీ ఏలుబడిలో మహిళలు కొంతమేరకు స్వేచ్ఛను అనుభవించారు. ప్రస్తుత మితవాద పాలకులు ఈ మహిళా చైతన్యాన్ని, మతనియంతృత్వంమీద వారి ఆగ్రహాన్ని తక్కువగా అంచనావేసి, మోసపూరిత చర్యలతో వంచించవచ్చునని భ్రమపడితే మరింత తీవ్రమైన ప్రతిఘటన చవిచూడక తప్పదు.

Updated Date - 2022-12-07T00:22:28+05:30 IST