పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు...!

ABN , First Publish Date - 2022-11-03T03:49:35+05:30 IST

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు...

పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు...!

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి చర్యలు చేపట్టింది. సున్నాతో పరిపాలన ప్రారంభించి కూడా సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ఒప్పందాలతో మూడేళ్ల కిందటి వరకు ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగు వెలిగింది. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేశంలో మూడో స్థానంలో ఉండగా, మూడున్నరేళ్ల జగన్ పాలనలో అట్టడుగుకు దిగజారింది. జగన్ రెడ్డి వికృత పరిపాలనలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు. మరోవైపు పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసిన పాపాన పోలేదు. విద్యాధికులైన యువతకు సంపాదనా మార్గాలను పూర్తిగా మూసేశారు. మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల ఆర్థికస్థితిని చావుదెబ్బ తీశారు. వాళ్ల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టారు.

జగన్ దావోస్ పర్యటన కూడా వినోదాలకే తప్ప రాష్ట్రాభివృద్ధికి దోహదపడలేదు. పెట్టుబడులు రాబట్టేందుకు చేసింది శూన్యం. దావోస్ టూర్ ఖర్చులకు సరిపడా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా తేని ముఖ్యమంత్రిగా జగన్‌దే రికార్డు. గత మూడున్నరేళ్లలో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు వచ్చిన పెట్టుబడులెన్ని, నెలకొల్పిన పరిశ్రమలెన్ని, కల్పించిన ఉద్యోగాలెన్ని? వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏమైంది? స్కీమ్‌లకు తన పేరు, తండ్రి పేరు పెట్టుకోడంలో ఉన్న శ్రద్ధ, తపన, వాటిని ఫలవంతం చేయడంలో లేకపోవడమే జగన్ స్టైల్. పేర్లు చూసుకుని పొందే ఆనందాన్ని ఏమంటారో తెలియదు. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు విడుదల చేసిన ప్రోత్సాహకాలు రూ.24.40కోట్లు. బీసీ పారిశ్రామిక వేత్తలకిచ్చిన ప్రోత్సాహకాలు రూ.101కోట్లు, జనరల్ కేటగిరీ వారికిచ్చింది రూ.191కోట్లు మాత్రమే. బడుగు బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలను ఎదగనీయకుండా చేసేందుకే ఈ స్కెచ్ అని అర్థం అవుతుంది. స్వయం ఉపాధిని పూర్తిగా అటకెక్కించారు. టిడిపి హయాంలో ఇచ్చిన రుణాల బలవంతపు వసూళ్లపైనే జగన్ ప్రభుత్వం దృష్టి. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక, సేవా రంగాలు జెట్ స్పీడ్‌తో పరుగులు తీస్తే, జగన్ రెడ్డి వచ్చాక తిరోగమనమే(నెగటివ్ గ్రోత్).

టిడిపి హయాంలో ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లను గుర్తించి వాటిపైనే పూర్తిగా దృష్టిపెట్టి జిఎస్‌డిపి పెంపునకు కృషి చేసింది. దానివల్లే వరుసగా నాలుగేళ్లు డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైంది. కానీ జగన్ మూడేళ్ల పాలనలో ఆయా గ్రోత్ ఇంజన్లన్నీ రివర్స్ చేసి, నెగటివ్ ట్రెండ్ తెచ్చారు. హార్టీకల్చర్ (–8%), లైవ్ స్టాక్ (–6.5%), మత్స్య ఆక్వారంగం(–14%), మొత్తం అగ్రికల్చర్ సెక్టార్(–4.8%), తయారీరంగం(–5.4%), నిర్మాణరంగం (–2.6%), మొత్తం పారిశ్రామిక రంగం(–1.4%), ట్రేడ్ అండ్ రెస్టారెంట్ రంగం(–4%), మొత్తం సేవారంగం (– 1.7%) ఓవరాల్ జిఎస్‌డిపి గ్రోత్ (–1.8%) నమోదైంది. తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో రెండంకెల్లో ఉంటే, జగన్ మూడేళ్లలో సింగిల్ డిజిట్‌కు దిగజార్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారాయి. మైనస్ గ్రోత్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సున్నా పెట్టుబడులతో బడుగుల సంక్షేమం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్ళలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది. అదే 2018–19లో తెలుగుదేశం ప్రభుత్వం 19,671 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించి దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది. 2019 అక్టోబరు– 2021 జూన్‌ మధ్యలో తమిళనాడు 30 వేల కోట్లు, కర్ణాటక 1.49 లక్షల కోట్లు, తెలంగాణ 17,709 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగా, ఇదేకాలంలో జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ రూ.2,577 కోట్లు మాత్రమే ఆకర్షించింది. 2018–19లో జీవీఏ లెక్కల ప్రకారం పారిశ్రామిక వృద్ధి రేటు 10.24 శాతం కాగా, 2020–21లో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు మైనస్‌ 3.26 శాతం నమోదు అయింది. 2019 అక్టోబర్ నుంచి 2020 డిసెంబర్ మధ్య కాలంలో ఏపికి కేవలం 1975 కోట్ల రూపాయల మాత్రమే ఎఫ్‌డిఐలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా వచ్చిన ఎఫ్‌డిఐల్లో రాష్ట్రానికి వచ్చింది 0.32 శాతం మాత్రమే. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి భయానక వాతావరణం నెలకొనడం, ప్రతి పనిలో నీకది నాకిది అనే ఫార్ములాకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. గత మూడేళ్ళలో రూ.17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డిఐ రూ.13,500 కోట్ల పెట్టుబడితో 18వేల మందికి ఉద్యోగాల కల్పనతో అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నెలకొల్పితే వైసీపీ ఎంపీ, మంత్రుల బెదిరింపుల కారణంగా కియా ఆగ్జిలరీ యూనిట్లు (17) ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. కర్నూలులో సోలార్, విండ్ పవర్ ప్లాంట్లను తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే వాళ్ళను వైసీపీ నాయకులు తుపాకులతో బెదిరించి సోలార్ ప్యానళ్లను ధ్వంసం చేశారు. అమరావతిలో 139 సంస్థలకు భూములు కేటాయిస్తే రాజధాని పనులు ఆపేసి ఆయా సంస్థలు రాకుండా అడ్డుకొన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలతో పరిశ్రమలు రాష్ట్రం నుండి వెళ్లి పోగా, కొత్తగా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే వణికి పోతున్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? ఆశపడటం కూడా అత్యాశే అవుతుంది.

తెలుగుదేశం హయాంలో మూడు పారిశ్రామిక సదస్సుల ద్వారా రూ.15.45 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి 32లక్షల ఉద్యోగాల కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు జరిగితే, వైసిపి మూడున్నరేళ్ల పాలనలో ఒక్క సమ్మిట్ నిర్వహించకపోగా టిడిపి ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులను వెళ్లగొట్టి 32 లక్షల మంది యువతకు ఉద్యోగాలు రాకుండా చేసిన ఘనత జగన్ రెడ్డిది. గత ప్రభుత్వం 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి, 5,13,351 ఉద్యోగాలు కల్పించినట్లు అసెంబ్లీలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు పాలనలో చూపిన సమర్ధత, నిరంతర శ్రమ, సరళీకృత విధానాలు, పలు సంస్కరణలు సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి దోహదపడ్డాయి. రాష్ట్రంలో వనరులు, పరిశ్రమల ఏర్పాటులో కల్పించే సౌలభ్యాలను, ప్రోత్సాహకాలను, నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధతలను బట్టి పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు సుముఖత చూపిస్తారు. పెట్టుబడుల సాధనకు గత ప్రభుత్వంలో అన్ని విధాలా కృషి జరిగింది. ఆటోమొబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారతపోర్జ్, హీరో గ్రూపు వచ్చాయి. ఐటీ, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్ కాన్, ప్లెక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టిసియల్, ఓల్టాస్ వంటి సంస్థలు వచ్చాయి. ఎవరు ఏమన్నా రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే బయటి నుంచి పెట్టుబడులు రావాలి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు, లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు? అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతిని చంపేశారు. పీపీఏలను రద్దు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ కాంట్రాక్టు సంస్థలను వేధించారు. పెట్టుబడులు పెట్టాలంటే వైసిపి నాయకులకు ముడుపులే కాదు ఆయా పరిశ్రమల్లో వాటాలకోసం బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే పారిపోయే పరిస్థితి తెచ్చారు. ఏది ఏమైనా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ యువత భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టారు. భావితరాల భవిష్యత్తును కాలరాశారు. ఈ దుస్థితికి కారకుడైన జగన్ రెడ్డి పరిపాలనకు ముగింపు పలికేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.

యనమల రామకృష్ణుడు

(టిడిపి పోలిట్ బ్యూరో మెంబరు)

Updated Date - 2022-11-03T03:49:46+05:30 IST