RK: కొండంత రాగం తీసినా...!

ABN , First Publish Date - 2022-11-06T00:55:57+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వెలువడ్డాయి...

RK: కొండంత రాగం తీసినా...!

మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుస్తాడని దాదాపుగా అందరూ తేల్చి చెప్పారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల కమిషన్‌ అధికారులు ప్రకటించారు. ఎన్నిక ఏదైనా విజేతలు–పరాజితులు ఉంటారు. అయితే, మునుగోడు ఎన్నిక జరిగిన తీరు చూస్తే ఎన్నికల కమిషన్‌ ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతుంది. సాధారణ ఎన్నికలకు పట్టుమని పన్నెండు మాసాల వ్యవధి కూడా లేని తరుణంలో జరిగిన ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం పోటీపడిన ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌–బీజేపీ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాయి. దాదాపుగా రెండు నెలలుగా ఓటర్లను మత్తులో ముంచెత్తాయి. ఒక్కో ఓటుకు కనీసం మూడువేల వంతున పంచాయి. తమకు ఇంకా ఎక్కువ కావాలని కొన్నిచోట్ల ఓటర్లు ధర్నాలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు మాత్రం ఇవేమీ కనిపించలేదు. న్యాయస్థానాల్లో కేసు ఓడిపోయినవాడు అక్కడే ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వెళ్లి ఏడుస్తాడు అంటారు. ఎందుకంటే ఇద్దరి జేబులు ఖాళీ అవుతాయి. మునుగోడులో కూడా ఇదే జరగబోతోంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలై ఎవరో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఉప ఎన్నికలో విజయం కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం. ఏడాది బాగోతానికి వందల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినందుకు ఓడిన వాడితోపాటు గెలిచినవాడు కూడా ఏడవాల్సిన పరిస్థితి. మునుగోడు ఎన్నికను అత్యంత ఖరీదైనదిగా మార్చడానికి టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య నెలకొన్న రాజకీయ వైరమే కారణం. అధికారకాంక్షతో ఈ రెండు పార్టీలూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీఆర్‌ఎస్‌, తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కాంక్షతో బీజేపీ బరితెగించడంతో ఎన్నికల ప్రక్రియ నవ్వులపాలైంది. ఓటర్లను అవినీతిపరులుగా మార్చేశారు.

ఒరిగేదేమిటి?

ఇంతకీ మునుగోడు ఉప ఎన్నికవల్ల తెలంగాణలో వచ్చే మౌలిక మార్పు ఏమైనా ఉంటుందా అంటే, లేనే లేదు అని చెప్పాల్సి ఉంటుంది. అయినా మునుగోడు ఉప ఎన్నిక జరగడానికి ఆ రెండు పార్టీల మధ్య నెలకొన్న పంతమే కారణం. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీనే ప్రథమ దోషి. తమతో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో బీజేపీ కేంద్ర పెద్దలు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డితో రాజీనామా చేయించి, పార్టీలో చేర్చుకొని ఉప ఎన్నికకు తెరతీశారు. మునుగోడులో ఓడితే ఏమి జరుగుతుందో తెలుసు కనుక కేసీఆర్‌ తన విద్యలన్నీ ప్రదర్శించారు. అధికార యంత్రాంగాన్ని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించి బీజేపీ అభ్యర్థిని కట్టడి చేశారు. ప్రత్యర్థి అభ్యర్థికి నిధులు అందకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారు. బీజేపీకి చెందిన దాదాపు 25 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ కేంద్ర పెద్దలు ఆదాయపు పన్ను శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురి ఇళ్లలో సోదాలు చేయించారు. కేసీఆర్‌ అధికార వినియోగ దుర్వినియోగాల ముందు బీజేపీ కేంద్ర పెద్దలు సరితూగలేకపోయారు. ఫలితంగా పోలింగ్‌ ముందు ఓటర్లకు హామీ ఇచ్చిన విధంగా డబ్బు పంచలేక బీజేపీ నాయకులు చేతులెత్తేశారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా తనదే పైచేయి అని కేసీఆర్‌ రుజువు చేసుకున్నారు. మరోవైపు ఎనిమిదేళ్లుగా దూరం పెట్టిన కమ్యూనిస్టులను అక్కున చేర్చుకున్నారు. ఫలితంగా మునుగోడులో టీఆర్‌ఎస్‌దే పైచేయి అని ఎగ్టిట్‌ పోల్స్‌లో వెల్లడైంది.

పెడ ధోరణులకు దారి...

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పోకడలు తెలంగాణలోని ఇతర నియోజకవర్గాలపై ప్రభావం చూపకుండా ఉంటాయా? ఓటర్లతోపాటు కార్యకర్తలు, నాయకులను కూడా డబ్బు ఇచ్చి తమతో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మునుగోడులో ప్రచారంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రధాన పార్టీలు పోటీపడి మరీ డబ్బులు పంచుతున్నాయని వార్తలు రావడంతో మునుగోడు ఓటర్లను అదృష్టవంతులుగా ఇతరులు పరిగణించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉప ఎన్నిక కోసం డిమాండ్లు పెరిగాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం తెలంగాణ సమాజంపై ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ప్రశ్న? ఒక్క ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే సామాన్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనగలరా? సామాన్యుల సంగతి అటుంచితే ప్రతిపక్షాలు కూడా డబ్బు విషయంలో పోటీపడగలవా? అంటే లేదనే చెప్పాలి. మునుగోడులోనే ఇది రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ – రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో డబ్బు విషయంలో పోటీపడలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఏడాది వ్యవధి మాత్రమే ఉన్న ఈ ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీ అన్ని కట్టుబాట్లు తెంచేసుకుని విశృంఖలంగా వ్యవహరించాయి. పాలకుల మధ్య ఇగో సమస్య ఏర్పడితే విలువలు ఏ స్థాయిలో పతనమవుతాయో చెప్పడానికి ఈ ఎన్నికే నిదర్శనం.

మునుగోడులో గెలిస్తే తనకు తిరుగులేదని, తానే తెలంగాణ బాద్‌ షా అని కేసీఆర్‌, ఓడినా తామే టీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకొంటూ బీజేపీ నాయకులు సాధారణ ఎన్నికలకు వెళ్లవచ్చు. ఈ క్రమంలో తాము పతనమై, ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించినందుకు ఈ రెండు పార్టీలూ ఏదో ఒక రోజు విచారం వ్యక్తం చేయక తప్పదు. సాధారణ ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఇలాగే వందలకోట్లు ఖర్చు చేయగలరా? మునుగోడులో ఇచ్చినట్టు తమకు కూడా ఇవ్వాలని ఇతర నియోజకవర్గాల ఓటర్లు కోరరా? ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాల్సిన ఎన్నికల కమిషన్‌ అచేతనంగా మిగిలిపోతే ప్రతిపక్షాలకు దిక్కేదీ? సహేతుక కారణం లేకుండా సమాజానికి ఏవిధంగానూ ఉపయోగపడని మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చినట్టు?

కోట్లతో ఓట్లాట...

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను ధనిక రాష్ట్రంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలను కూడా ఖరీదైనవిగా మార్చుతారని ఎవరూ ఊహించలేదు. ఈ స్థాయిలో కాకపోయినా 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులతో పోటీపడటానికై తాను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో కేసీఆర్‌కు గుర్తు లేదా? అప్పు చేసి మరీ తన పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసిన కేసీఆర్‌ వద్ద ఇప్పుడు చేతి నిండా డబ్బు ఉండవచ్చు. అధికారం చేజారితే పరిస్థితి ఏమిటి? తెలంగాణలో ఎన్నికలను ఇంత ఖరీదైన వ్యవహారంగా మార్చిన ఘనత మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. నిజం చెప్పాలంటే కేసీఆర్‌కు కూడా ఈ పరిణామం సంతోషం కలిగించదు. అయితే, పులిపై స్వారీ మొదలెట్టిన ఆయన అలా ముందుకుపోతూనే ఉంటారు ప్రస్తుతానికి! ఏదో ఒకరోజు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ నేరానికి చింతించక తప్పని పరిస్థితి వస్తుంది. అధికారం కోసం ఒకరు, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి ఇంకొకరు ఎన్నికల సమయంలో వందలు, వేల కోట్లు ఖర్చు చేసుకుంటూ పోవడానికి రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి కూడా సహకరించదు.

ఇప్పటికే అనేక రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్థి కార్యక్రమాలకు నిధులు లభించవు. అదే జరిగితే అధికార పార్టీలకు కమీషన్లు రావు. అప్పుడు ఏం చేస్తారు? మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని ప్రజాస్వామ్యం మునిగిపోయింది. విజేత ఎవరైనా అది నిజమైన ప్రజాతీర్పు కాదు. ఏం చేస్తే విజయం వరించిందో సంబంధిత పార్టీకి తెలియదా? అధికారంలో ఉన్నవారికి అంతులేని అధికారం, ధనబలం సొంతం కావడంవల్ల ఎన్నికలు పూర్తిగా కలుషితమయ్యాయి. తమకు కష్టం వచ్చినప్పుడు విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకునే పార్టీలు అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను ఇంత ప్రహసనంగా మార్చినందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ తెలంగాణ సమాజానికి సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యవస్థలు పతనమైతే జరిగే అనర్థాలకు ఇదొక ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో అధికార పార్టీకి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా పనిచేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ అచేతనంగా ఉండిపోవడం క్షంతవ్యం కాదు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగా అధికారంలోకి వస్తున్న పార్టీలు వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో పోటీపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చింది. ఎన్నికల్లో డబ్బులు పంచడం, తీసుకోవడం, ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేయడం ఎవరికీ తప్పుగా కనిపించడం లేదు. బాధిత రాజకీయ పార్టీలు మాత్రం ఆక్రోశిస్తాయి అంతే!

ఆ ఆవేదనకు అర్థమేమిటి?

ఈ విషయం అలా ఉంచితే మునుగోడు ఎగ్టిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని బతకనీయండి అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ తరఫున కొందరు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపణ. ఆ వ్యవహారాన్ని ఆడియో, వీడియోల్లో రికార్డు చేసిన కేసీఆర్‌ దాదాపు మూడు గంటలపాటు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలపై దాడిని ఆపండి – దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్‌ షాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని ప్రధానమంత్రికి హితవు పలికారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాలని న్యాయ వ్యవస్థకు కూడా కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దీనిని ఒక హీనమైన నేరంగా చూడాలని కోరారు. కేసీఆర్‌ పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ రాజకీయాలలో ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించి ఉండాల్సింది. తాము విడుదల చేసిన వీడియోలతో భూకంపం పుడుతుందని కేసీఆర్‌ అంచనాలు వేశారు.

కానీ... కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా కూడా స్వల్ప స్థాయిలో కూడా కంపనాలు కలగలేదు. ఓటుకు నోటు కేసు స్థాయిలో కూడా ప్రకంపనలు ఏర్పడలేదు. ఫాంహౌస్‌ సంఘటన జరిగిన వారం తర్వాత కేసీఆర్‌ బయటకు వచ్చి ఈ విషయం మాట్లాడటం, అప్పటికే ఇందుకు సంబంధించిన ఆడియోలు విడుదల కావడం, తాజాగా విడుదల చేసిన వీడియోలలో విస్ఫోటనం కలిగించే అంశాలు లేకపోవడం వల్ల కేసీఆర్‌ ఆశించినట్టుగా రాజకీయాల్లో కుదుపు ఏర్పడలేదు. కేసీఆర్‌ కూడా నరేంద్ర మోదీ, అమిత్‌ షాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయకపోగా విజ్ఞప్తులకే పరిమితమైనట్టు కనిపించారు. ఇంకా చెప్పాలంటే ‘నా కొలువు నన్ను చేసుకోనివ్వండి’ అని కోరుతున్నట్టుగా విలేకరుల సమావేశం సాగింది. ‘మీరు అధికారంలో ఉన్నారు, నేనూ అధికారంలో ఉన్నాను. మనలో మనకు గొడవలెందుకు?’ అన్నట్టుగా విజ్ఞప్తులకే పరిమితమయ్యారు. ఫలితంగా తెలంగాణ సమాజం కూడా ఈ వ్యవహారంపై రియాక్ట్‌ కాలేదు. ఈ అచేతన స్థితికి ఎన్నో కారణాలు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిన ఉదంతాలు దేశ ప్రజలకు కొత్త కాదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీది ఒక మోడల్‌ కాగా బీజేపీది మరో మోడల్‌. ఎన్నికలలో హంగ్‌ ఏర్పడిన సందర్భాలలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు చెందిన శాసనసభ్యులను ఆకర్షించడం ద్వారా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడాన్ని చూసిన ప్రజలకు ఇదంతా మామూలే అన్న భావన ఏర్పడింది. కర్ణాటక, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాలను పడగొట్టినా ప్రజల్లో స్పందన రాలేదు. దీంతో బీజేపీ కేంద్ర పెద్దలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అది ఢిల్లీ కావచ్చు – తెలంగాణ కావచ్చు! నిజానికి ఈ రెండు రాష్ర్టాలలో అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉంది. అయినా, బీజేపీ నుంచి తమ శాసనసభ్యులను కాపాడుకోవాల్సిన అగత్యం ఆయా ప్రభుత్వాలకు తప్పడం లేదు. ఈ ధోరణి కచ్చితంగా అనైతికమే. అయినప్పటికీ ప్రజల్లో కనీస స్పందన ఉండకపోవడానికి కారణం లేకపోలేదు. తెలంగాణ విషయమే తీసుకుందాం! 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను రిటైల్‌ ప్రాతిపదికన కొనుగోలు చేస్తూ వచ్చారు.

2014 తర్వాత పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను మింగేశారు. 2018 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఇద్దరిని కూడా కబళించారు. సీపీఐ తరఫున గెలిచిన ఒకే ఒక సభ్యుడిని కూడా కలిపేసుకున్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదు అన్నట్టుగా కేసీఆర్‌ రాజసూయ యాగం కొనసాగింది. ఇకపై కూడా కొనసాగుతుంది. ప్రతిపక్షాల ఉనికి కేసీఆర్‌కు గిట్టనట్టుగానే ప్రతిపక్ష ప్రభుత్వాల ఉనికి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు గిట్టడం లేదనుకోవాలి. ఇందులో ఎవరిది నైతికత? ఎవరిది అనైతికత?

తనదాకా వస్తేగానీ...

తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేయడం ఏమిటని ఆక్రోశిస్తున్న కేసీఆర్‌కు ఒకప్పుడు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు చేసిన ఆర్తనాదాలు వినిపించలేదా? ప్రతిపక్షమే ఉండకూడదు అన్నట్టుగా వ్యవహరించిన కేసీఆర్‌కు ఇప్పుడు బీజేపీని తప్పుపట్టే నైతికత ఉంటుందా? అందుకే మూడు గంటలపాటు ఆవేదన వెళ్లగక్కినా ఆయన ఆశించిన ప్రకంపనలు చోటుచేసుకోలేదు. మునుగోడు ఉప ఎన్నిక అయిపోయింది కదా! ఇంకెందుకు కేసులు? అని ఫాంహౌస్‌ విచారణ సందర్భంగా హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి ఫాంహౌస్‌ వ్యవహారాన్ని సామాన్య ప్రజలు కూడా అందుకు భిన్నంగా చూడాలని ఎలా భావించగలం? అవకాశం వచ్చిన సందర్భాలలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నందున కొనుగోళ్ల వ్యవహారాన్ని కూడా ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఫాంహౌస్‌ వీడియోలతో బీజేపీ కేంద్ర పెద్దల జుట్టు చేజిక్కించుకోవచ్చునని కేసీఆర్‌ భావించి ఉంటారుగానీ సదరు వీడియోలతో చేయగలిగిందేమీ లేదు.

ఊరూ పేరూ లేని వాళ్లు మాత్రమే వీడియోలో ఉన్నందున వాళ్లు ఎవరి పేర్లు ప్రస్తావించినా న్యాయ సమీక్షకు నిలబడవు. అంతేకాదు! వీడియోలలోని సంభాషణలను జాగ్రత్తగా ఆలకిస్తే ఆ నలుగురు ఎమ్మెల్యేల వైపు నుంచే ముందుగా ప్రతిపాదనలు వెళ్లాయన్న భావన కలుగుతుంది. అది కూడా కేసీఆర్‌ స్కెచ్‌లో భాగం కావచ్చునుగానీ వ్యవహారం కోర్టుకు వెళ్లినప్పుడు ఆ విషయం చెప్పలేరు కదా? ఆ నలుగురు శాసనసభ్యులు నిజంగా నిప్పు అయితే వాళ్లకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లతో ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఏమిటి? రేవంత్‌ రెడ్డి కేసులో ఫిర్యాదు చేసిన స్టీఫెన్‌సన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చలేదు కదా? ఫాంహౌస్‌ వ్యవహారంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే కేసీఆర్‌ ఎంతో ఆశించి ఉండవచ్చునుగానీ ఎక్కడా ఆయనకు అనుకూలంగా స్వరాలు వినిపించలేదు. వాస్తవానికి తన పర్యవేక్షణలో జరిగిన స్టింగ్‌ ఆపరేషన్‌లో లొసుగులు ఉన్నాయని కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే ఆయన ఈ వ్యవహారంతో రాజకీయంగా లబ్ధి పొందడానికే పరిమితమైనట్టు కనిపిస్తున్నది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వారిని జైలులో పెట్టించండని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంలోనే కేసీఆర్‌ బేలతనం కనిపిస్తోంది. ఫాంహౌస్‌ వ్యవహారంలో ఎమ్మెల్యేల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఫాంహౌస్‌ ఆపరేషన్‌ చేసినట్టు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. దీని ప్రకారం నిందితులపై కేసులు పెట్టి శిక్ష పడేలా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఆలాంటప్పుడు ప్రధానమంత్రిని వేడుకోవడం ఎందుకో అర్థం కాదు. ఏదేమైనా ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా తమ పార్టీలో చేరాలని ఏ పార్టీ కోరినా అది అనైతికమే. ఈ క్రమంలో ముందుగా కేసీఆర్‌ ప్రజల ముందు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఏకంగా మంత్రిని చేసిన కేసీఆర్‌ తన చర్యను సమర్థించుకోగలరా? తలసానిని మంత్రివర్గంలోకి తీసుకోవడం అనైతికమని నాటి గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడినా ఆయన రాజీనామా చేసినట్టుగా ఉత్తుత్తి లేఖను అందజేశారు. ఆ రాజీనామాను నాటి స్పీకర్‌ ఆమోదించలేదు. ఈ కిటుకు గ్రహించిన చంద్రబాబు కూడా ఆ తర్వాత అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకోవడానికై ఉత్తుత్తి రాజీనామా చేయించారు. చట్టానికి తూట్లు పొడవడంలో కేసీఆర్‌ మిగతా వారికంటే రెండు ఆకులు ఎక్కువే చదివారు. అదేమంటే తన ప్రభుత్వ పనితీరు చూసి మురిసిపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు కొందరిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోగా, ఇదెక్కడి న్యాయం? ఒక పార్టీ తరఫున గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారు? అని ఇదే కేసీఆర్‌ ఆక్రోశించారు. తనదాకా వస్తేగానీ అన్నట్టుగా ఇప్పుడు ఇదే కేసీఆర్‌ అన్యాయం, అరాచకం అని గొంతు చించుకుంటున్నా ఎక్కడా ప్రతిధ్వని వినిపించడం లేదు. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచవ్వ కొడుతుందని కేసీఆర్‌ తరచుగా అంటుంటారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఇదే! కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను కేసీఆర్‌ కబళించగా టీఆర్‌ఎస్‌ను మింగడానికి బీజేపీ రెడీ అయింది. ఈ రెండు పార్టీల మధ్య మొదలైన పోరులో మరెన్ని అనర్థాలు జరుగుతాయో చూడాలి. తన బలం, బలహీనత ఏమిటో కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ కేంద్ర పెద్దలను దూషించలేదు. విజ్ఞప్తులకే పరిమితమయ్యారు. మునుగోడు ఫలితం వెల్లడైన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలు ఎలా ఉంటాయన్న విషయం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఫాంహౌస్‌ వ్యవహారం నేపథ్యంలో కేంద్రం ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందా? ఉంటే, ప్రతీకార చర్యలు ఏ రూపంలో ఉండబోతున్నాయన్న అంశం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటివరకు బలహీన రాజకీయ పార్టీలపై పైచేయి సాధిస్తూ వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు బలమైన బీజేపీతో పెట్టుకున్నందున భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం! కాగా ‘అవినీతిపరులకు అందలాలా? వారితో కలసి ఫొటోలకు పోజులా? సిగ్గు కూడా అనిపించడంలేదా?’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని దత్తపుత్రుడిగా పరిగణించి రాజకీయ సౌలభ్యం కోసం అక్కున చేర్చుకున్న ప్రధానికి ఈ వ్యాఖ్యలు చేసే నైతికత ఉందా? దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయనే! ఇతరులకు చెప్పేందుకే నీతులు అని అందుకే అంటారు కాబోలు!

ఆర్కే

Updated Date - 2022-11-06T05:46:57+05:30 IST