అంతా నీ యిష్టం!
ABN , First Publish Date - 2022-12-01T01:22:09+05:30 IST
తాతయ్యా! తాతయ్యా! చూశావా! చూశావా! నీ కీర్తి పునాది మీద మా జరుగుబాటు భవనాన్ని కట్టుతున్నాం...
తాతయ్యా! తాతయ్యా! చూశావా! చూశావా!
నీ కీర్తి పునాది మీద
మా జరుగుబాటు భవనాన్ని కట్టుతున్నాం.
నీ నీతులను మూటగట్టి
మా గోతులలో పాతిపెట్టాం.
నీ తలగుడ్డను జెండాగా చేసుకొని
మా ప్రచారరథం నడుపుతున్నాం.
నిన్ను పేలపిండిని చేసి
మేము కృష్ణార్పణం అంటున్నాం.
కవీ, ప్రవక్తా కాలం కన్నా ముందుంటారన్నావు
మా ప్రవచనాలు ఎన్ని యోజనాలు వెనకున్నాయో కనుక్కో చూద్దాం.
ఈ పురాణాలింకెంతకాలమయ్యా అన్నావు
మేము ఆ పురాణాలనే రీసైక్లింగ్ చేస్తున్నాం.
ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందన్నావు, ఆడామగా సమానమన్నావు
మేము ఆడాళ్ళను మొగోళ్ళ బట్టలుతికి పుణ్యవతులను కమ్మంటున్నాం.
నువ్వు వర్ణధర్మం అధర్మధర్మమన్నావు
మేము ఆ అధర్మాన్నే పరమధర్మంగా హోరెత్తిస్తున్నాం.
అంతా అన్నదమ్ముల్లాగా ఉండాలన్నావు
మేము దాయాదులై నిలబడ్డాం.
నీ మానవవాద జెండాను మేము అమానవవాద రథంపైన ఎగరేస్తున్నాం.
నూరేళ్ళ నాడే నువ్వు అన్నీ వేదాల్లో ఉన్నాయష అన్నావు
మేమిప్పుడు అన్నీ వాటిలోనే ఉన్నాయంటున్నాం.
టెస్ట్ ట్యూబ్ బేబీలు, రసాయన ఆయుధాలు
అన్నీ ఉన్నాయష.
నువ్వు ఒక్క గిరీశాన్నే సృష్టించావు
మేము వీధికొక్కగిరీశాలమయ్యాం.
నీకళ్ళముందే
నీ యింటి పెంకుల్ని పీక్కుపోయి
మా యింటిమీద కప్పేసుకుంటున్నాం.
పిలువ్! పిలవవయ్యా పిలువ్!
వెంకమ్మను పిలువ్!
బుచ్చమ్మను పిలువ్!
పూటకూళ్ళమ్మను పిలువ్!
మీనాక్షిని పిలువ్!
నాంచారమ్మను పిలువ్!
కమిలినిని పిలువ్!
వాళ్ళతో మొగాళ్ళగుడ్డలే ఉతికిస్తావో
మొగాళ్ళనే ఉతికి ఆరేయిస్తావో
అంతా నీ యిష్టం!
అంతా నీయిష్టం!
రాచపాళెం