‘వైర్’ మీద ఫైర్‌

ABN , First Publish Date - 2022-11-02T05:15:12+05:30 IST

సుప్రసిద్ధ న్యూస్ వెబ్ సైట్ ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, ఎం.కె.వేణు, సిద్ధార్థ్ భాటియా, డిప్యూటీ ఎడిటర్ జాహ్నవి సేన్, ప్రోడక్ట్ హెడ్ మిథున్ కిడాంబి...

‘వైర్’ మీద ఫైర్‌

సుప్రసిద్ధ న్యూస్ వెబ్ సైట్ ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, ఎం.కె.వేణు, సిద్ధార్థ్ భాటియా, డిప్యూటీ ఎడిటర్ జాహ్నవి సేన్, ప్రోడక్ట్ హెడ్ మిథున్ కిడాంబి నివాసాల్లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం సోదాలు జరిపారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఫిర్యాదుమేరకు ఆ సంస్థమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు వారి ఇళ్ళూ కార్యాలయాల్లో సోదాలు జరిపి, పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సందర్భంగా వైర్ తరఫు న్యాయవాదిని అక్కడ ఉండనీయకుండా పోలీసులు బలవంతంగా బయటకు నెట్టివేశారని అంటున్నారు. పోలీసులు పద్ధతి ప్రకారం స్వాధీనం చేసుకున్న పరికరాలు, డాక్యుమెంట్ల వివరాలతో కూడిన జాబితాను తమకు ఇవ్వనందున, పోలీసులు ఆ సాక్ష్యాలను తారుమారు చేసే, దుర్వినియోగపరచే అవకాశాలున్నాయని వైర్ యాజమాన్యం ఆరోపిస్తున్నది. జర్నలిస్టులను భయపెట్టేదిగా ఉన్న ఈ చర్యను వివిధ పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

నా ప్రతిష్ఠకు భంగం కలిగించే దురుద్దేశంతో, నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా తప్పుడు కథనాలు వండివార్చారని మూడురోజుల క్రితం బీజేపీ ఐటీ సెల్ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఫిర్యాదు చేయడంతోనే, వైర్ మీద పోలీసులు విరుచుకుపడతారని అందరూ ఊహించారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు నిర్వహిస్తున్న ‘మెటా’ సంస్థ ఈ బీజేపీ నేతకు ప్రత్యేక అధికారాలు, సాంకేతికపరమైన అవకాశాలు కల్పించిందనీ, వాటిద్వారా ఈ బీజేపీ నేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులను తొలగించగలుగుతున్నారన్నది ఆ వరుస కథనాల సారాంశం. అభ్యంతరకరమైన పోస్టులను తొలగించే కంటెంట్ మోడరేటర్ల అధికారాన్ని మెటా కంపెనీ ఈయన చేతిలో పెట్టిందని ఈ కథనాలు చెబుతున్నాయి. తన వాదనకు ఆధారంగా సదరు సంస్థలో సింగపూర్ లో పనిచేస్తున్న వారితో సహా వివిధ విభాగాల మధ్య అంతర్గతంగా సాగిన ఈమెయిల్స్, చాట్స్ వంటివి కూడా వైర్ ప్రచురించింది.

ఇదంతా అవాస్తవమనీ, ఈ కల్పిత కథనానానికి వైర్ బాధ్యత వహించక తప్పదనీ మెటా ఖండించింది. ఆ తరువాత కూడా వైర్ మరిన్ని ఆధారాలతో తన కథనాలను కొనసాగించినా, సాంకేతిక నిపుణులనుంచి కూడా విమర్శలు ఎక్కువకావడంతో వెనక్కుతగ్గింది. తాత్కాలికంగా కథనాలు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించి, అంతర్గత విచారణ అనంతరం వాటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఆ తరువాత తన వెబ్ సైట్లోనే బహిరంగ క్షమాపణలు కోరుతూ, ఒక సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది.

దేవేశ్ కుమార్ అనే ఒక పాత్రికేయుడినీ, అతను సేకరించిన ఆధారాలనూ నమ్మి ఈ కథనాలను ప్రచురించినట్టుగా వైర్ చెబుతున్నది. మెటా నుంచి రహస్యంగా సంపాదించిన డాక్యుమెంట్లు విశ్వసనీయమైనవేనంటూ తమను ఆదిలో నమ్మించిన ఈ పాత్రికేయుడు ఆ తరువాత అవి నకిలీవంటూ చేతులు ఎత్తేశాడనీ, తమ స‍ంస్థను అప్రదిష్ఠపాల్జేసే కుట్ర ఏదో దీనివెనుక ఉన్నందున నిజాలు నిగ్గుతేల్చమంటూ సదరు పాత్రికేయుడిపై వైర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మెటా నిష్పాక్షికతను, సాంకేతిక సమర్థతను అనుమానిస్తూ, అది అధికారపక్షంతో లాలూచీ పడినట్టుగా ఆరోపిస్తున్న ఈ కథనాలతో నిజానికి మెటాకే ఎక్కువ అప్రదిష్టనీ, ప్రభుత్వ అనుకూల ప్రచారంకోసం ఉన్నవ్యక్తికి ఏకంగా కేసుపెట్టేంత ఆగ్రహం మధ్యలో ఎందుకని కొందరి ప్రశ్న. తాము చెప్పిన కంటెంట్ తొలగించాలనో, కొందరు వ్యక్తుల లేదా గ్రూపుల ఖాతాలు రద్దుచేయాలనో ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థల మీద ఒత్తిడి తేవడం, ట్విటర్ వంటివి ఏకంగా కోర్టులకెక్కడం చూసిన తరువాత వైర్ కథనాన్ని కొందరు నమ్మివుండవచ్చు. కానీ, ఆ సంస్థే తరువాత వాటిని ఉపసంహరించుకొని, అవి తప్పుడువని ఒప్పుకొని క్షమాపణలు కూడా చెప్పింది. తద్వారా వచ్చే అప్రదిష్టకు కూడా ఆ సంస్థ వెరవలేదు. ఇది పాత్రికేయ విధానాలకు అనుగుణంగానే జరిగిందన్నది వాస్తవం. తమకు అందిన సమాచారాన్నీ, దానిని అందించినవారినీ విశ్వసించడం, వీలైనంతమేరకు ప్రామాణికతను ధ్రువపరచుకోవడం, ఎదుటిపక్షం వివరణలకు చోటివ్వడం, తప్పయినప్పుడు ఒప్పుకోవడం, క్షమాపణలు చెప్పడం జరుగుతున్నదే. వైర్ ఈ సంప్రదాయాన్ని పాటించినా, పాలకులు దానిపై ప్రత్యేకంగా కక్షకట్టారన్నది పాత్రికేయ సంఘాల ఆరోపణ.

దేశంలో కొన్ని ప్రధానమీడియా సంస్థలను పాలకులు పలువిధాలుగా తమ దారికితెచ్చుకుంటున్న తరుణంలో, 2015లో మొదలైనప్పటినుంచీ వైర్ సర్వస్వతంత్రంగా నిలబడుతూ వచ్చింది. రాఫెల్ ఒప్పందంలో తమ్ముడు అంబానీ భాగస్వామ్యం, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అదానీ సంస్థలో పెట్టుబడులు పెట్టడం, పెగాసస్ కుట్ర కోణాన్ని ఛేదించడం, అమిత్ షా కుమారుడి కంపెనీ విలువ ఏడేళ్ళకాలంలో పదహరువేల రెట్లు పెరిగిపోవడం వంటి అనేక కథనాలు వైర్ మీద పాలకుల ఆగ్రహానికి కారణం కావచ్చును. నోట్లరద్దు నిర్ణయం వెంటనే తెరవెనుక కథనాలను, దానివల్ల ఏ ప్రయోజనమూ లేదన్న ఆర్థికరంగ నిపుణుల విశ్లేషణలను అది అందించింది. సర్జికల్ దాడులు జరిగిన వెంటనే అవి గతంలో రహస్యంగా జరిగేవంటూ రక్షణరంగ నిపుణుల అభిప్రాయాలను ప్రచురించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో పరిశోధనాత్మక, విశ్లేషణాత్మక కథనాలు అందించడమే కాక, సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఏడేళ్ళుగా బెదిరింపులు, కేసులు ఎదుర్కొంటూనే నిర్భయంగా నిజాలను నివేదించినందుకు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న వైర్ మీద పాలకులకు ప్రత్యేక కోపం ఉండటం సహజం. తమను సవాలు చేసినవారినీ, వాస్తవాలు మాట్లాడినవారినీ బెదిరించి దారికితెచ్చుకొనే విధానం ఒకటి అమలవుతున్న ఈ కాలంలో ప్రజాస్వామిక స్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి సంఘటితంగా కృషిచేయక తప్పదు.

Updated Date - 2022-11-02T05:15:16+05:30 IST