పూలు–రాళ్లు

ABN , First Publish Date - 2022-12-03T00:56:10+05:30 IST

విద్యార్థి ఉద్యమాలు, మిలిటెంట్ ఆందోళనలు ఉన్నచోట పోలీసు అధికారులు తమ మీద గట్టి విమర్శలు రావాలని, బాధితులు తమను శాపనార్థాలు పెట్టాలని ఆశిస్తారట...

పూలు–రాళ్లు

విద్యార్థి ఉద్యమాలు, మిలిటెంట్ ఆందోళనలు ఉన్నచోట పోలీసు అధికారులు తమ మీద గట్టి విమర్శలు రావాలని, బాధితులు తమను శాపనార్థాలు పెట్టాలని ఆశిస్తారట. ఒక పోలీసు అధికారి సమర్థతకు గుర్తు, అతని మీద వచ్చే ఆరోపణలూ, దూషణలే. అసూయను పరోక్ష ప్రశంస అంటుంటారు, అట్లాగే, ఆందోళనకారుల నుంచి వచ్చే దూషణ, పై అధికారుల దృష్టిలో యోగ్యతాపత్రం. ప్రతిపక్షాల వారి చేత గట్టి విమర్శలు పొందేవాడే సమర్థుడైన నాయకుడు, పాలకుడు అని వారి వారి అస్మదీయులు అనుకుంటుంటారు. ప్రజలు కూడా ఎవరెవరి మధ్య విమర్శలు ఘాటుగా తీవ్రంగా ఉంటాయో వారినే పరస్పర విరోధులుగా, ప్రత్యర్థులుగా భావించి, తమ ఎంపికలు చేసుకుంటారు.

రాజకీయాల్లో ఉన్నవారికి తమ గురించి, తమ పని గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరుల గురించి చాడీలు చెప్పడం అంత అవసరం. నిరంతరం జరుగుతూ ఉండే ఈ సంవాదం భిన్న రాజకీయ శిబిరాల మీద ప్రజలలో అభిప్రాయాలను నిర్మిస్తూ ఉంటుంది. ప్రజల నుంచి సమ్మతి, ఆరాధన, సానుభూతి, ప్రశంస పొందడానికి రాజకీయ పార్టీలు, నేతలు చేయని విన్యాసం ఉండదు. ఒక మాట అంటే, నాలుగు మాటలు పడడానికి కూడా సిద్ధంగా ఉండకతప్పని రంగం రాజకీయం. ఎవరూ తమను తిట్టకపోతే, తాము అప్రధానులమూ అనామకులమూ అయిపోయామేమోనన్న బెంగ కూడా రాజకీయవాదులకు కలుగుతుంది.

ఈ విమర్శల ద్వారా భావోద్వేగాల రాజకీయాలు జరగడం కూడా చూడవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తనను తిట్టేవాళ్లు కావాలి. తనను తిడుతున్నారని ఓటర్లకు చెప్పుకోవాలి. ఈ తిట్లు తింటున్నందుకు ప్రతిగా తనకు ఓట్లు వేయమని అడగాలి. ఇందులో ఒక దీనమైన అభ్యర్థన ఉన్నది. అది ప్రజల మనసులను స్పృశించే అవకాశమున్న అస్త్రం. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ పార్టీ మొదట బాగా నిశ్శబ్దంగా కనిపిస్తూ గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుంటున్నది. ఎక్కడా నరేంద్రమోదీని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తపడింది. అప్పుడేమో, మోదీ దానిని కూడా తప్పుపట్టారు. ‘‘కాంగ్రెస్ ఇంత నిశ్శబ్దంగా ఉన్నదంటే చాపకింద నీరులాగా ఏదో చేస్తున్నది, బహుశా నన్ను తిట్టే పనిని ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పగించినట్టున్నది’’ అని విమర్శించారు. పోలింగ్ సమీపిస్తున్న దశలో, రాహుల్ గాంధీ పర్యటన కూడా జరిగాక, కాంగ్రెస్ స్వరంలో మార్పు వచ్చింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాస్త పదునుతోనే విమర్శలు సంధించడం మొదలుపెట్టారు. ‘‘ఎంత కాలం మోదీ తన నిరుపేద నేపథ్యం గురించి, చాయ్ వాలా బాల్యం గురించి చెప్పుకుంటారు? కనీసం, ఆయన చాయ్ అమ్మితే కొనుక్కుని తాగారు, నేను అంటరానివాడిని, నేను చేస్తే చాయ్ ను తాగను కూడా తాగరు’’ అని సామాజిక విమర్శ ఒకటి చేశారు. ఆ తరువాత, రాముడి పేరు చెప్పి రాజకీయం చేసే మోదీ నిజానికి వెయ్యితలల రావణాసురుడని దూషించారు. నిజానికి ఇది హద్దులు మీరిన దూషణే. కానీ, దేశంలో రాజకీయ సంభాషణ అంతా రామాయణం చుట్టూ నడుస్తున్నది కాబట్టి, అందులోని ప్రతినాయకుడితో మోదీని పోల్చారు. తాను ప్రతినాయకుడు అవునో కాదో కానీ, మోదీకి ఈ దెబ్బతో ప్రతినాయకుడు దొరికారు. గతంలో ప్రత్యక్ష సంవాదానికి కాంగ్రెస్, ఆప్ ఆస్కారం ఇవ్వకపోవడం వల్ల అసహనంగా ఉండిన ప్రధాని, ఇప్పుడు కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. రామభక్తుల నేలపై తనను రావణుడనడం మీద ఓటర్లకు ఫిర్యాదు చేశారు. రాముడి మీదే నమ్మకం లేని వారు రావణుడి పేరు తీయడం ఎందుకని, కాంగ్రెస్ ను నాస్తికుల కోవలోకి నెట్టారు. మొత్తానికి, తనను దూషిస్తే, అది రాజకీయంగా లాభమని భావించిన మోదీకి, ఆ సన్నివేశం సిద్ధించింది. ఫలితం ఏమిటో ఎన్నికల ఫలితాలలో చూడాలి.

ఎదుటివారు తనను బాధిస్తున్నారని, లేదా, తాను దీనస్థితిలో ఉన్నానని చెప్పుకోవడం అన్ని సందర్భాలలో పనిచేయకపోవచ్చు. గుజరాత్ పుత్రుడికి వచ్చిన కష్టం కింద నరేంద్రమోదీ విషయంలో అది పనిచేస్తుందేమో తెలియదు. కానీ, మరో సందర్భంలో మరో నాయకుడి విషయంలో ప్రజలకు సదభిప్రాయం కలగకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో యువనాయకుడు ఒక్క చాన్స్ ప్లీజ్ అన్నప్పుడు, అందులో బలహీనత ధ్వనించినా, ఇతర కారణాల రీత్యా ఆనాడు ప్రజలు సానుకూలంగా స్పందించి ఉండవచ్చు. చివరి అవకాశం అని ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకుడు అన్నప్పుడు కూడా అదే సానుకూలత వ్యక్తం అయ్యే అవకాశం ఉన్నదికానీ, దాన్ని బలహీనతగా, దయనీయతగా ప్రత్యర్థులు ప్రచారం చేయబోయారు. కానీ, ఇది తన చివరి అవకాశం కాదని, రాష్ట్రానికే చివరి అవకాశమని ఆయన ఇచ్చిన సవరణ, వివరణ అందులోని ప్రతికూలాంశాన్ని మరమ్మత్తు చేయగలిగింది. మద్యం కుంభకోణంలో ప్రమేయం గురించి ఆరోపణలు వచ్చిన కొత్తలో బెంబేలు పడినట్టు కనిపించిన ఒక తెలంగాణ నేత, తరువాత తరువాత నిబ్బరాన్ని, దూకుడును ప్రదర్శించి తన బలహీనతను అధిమించారు. పైగా, తన వెంట ప్రజలు ఉన్నందుకే తనకు ఈ వేధింపులు అంటూ ఎదురుదాడి కూడా చేయగలుగుతున్నారు. జనం ఒక్కోసారి సానుభూతి పవనాల మీద తేలియాడతారు, మరొకసారి బేలతనానికీ లొంగిపోతారు. ఎప్పుడూ ధీరులుగా వీరులుగా మాత్రమే ఉండాలని ఏమీ ఆశించరు. దేశంలో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న రాజకీయ నేత కూడా దీనంగా తానొక బాధితుడినని చెప్పుకోవడమే ఇందుకు రుజువు.

Updated Date - 2022-12-03T00:56:13+05:30 IST