మత్స్యకారుల మహత్తర పోరాటం

ABN , First Publish Date - 2022-11-09T01:15:05+05:30 IST

కేరళలో తిరువనంతపురం సమీపంలో అదానీ సంస్థ చేపట్టిన అంతర్జాతీయస్థాయి పోర్టుకు వ్యతిరేకంగా నూటపదిరోజులుగా మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి...

మత్స్యకారుల మహత్తర పోరాటం

కేరళలో తిరువనంతపురం సమీపంలో అదానీ సంస్థ చేపట్టిన అంతర్జాతీయస్థాయి పోర్టుకు వ్యతిరేకంగా నూటపదిరోజులుగా మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ మంగళవారంనాడు నాలుగువందలమంది మేధావులు, సామాజిక ఉద్యమకారులు ఒక సంఘీభావ లేఖ రాశారు. మత్స్యకారుల ఉద్యమాన్ని అప్రదిష్టపాల్జేసేందుకు అన్ని రకాల కుట్రలూ జరుగుతున్నాయని, సర్వవ్యవస్థలూ అదానీ పోర్టుకు అండగా నిలుస్తూ పేదల జీవితాలను దెబ్బతీస్తున్నాయని వారు అందులో ఆరోపించారు. అదానీ పోర్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారిపైనా, ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నవారిపైనా అక్రమకేసులు బనాయించడం, అవినీతి ఆరోపణలు చేయడంవంటి చర్యలను ఈ లేఖలో వారు తీవ్రంగా నిరసించారు.

విళింజమ్–అదానీ పోర్టు వ్యతిరేక మత్స్యకార ఉద్యమాన్ని నిరసిస్తూ, దానికి పోటీగా పోర్టు నిర్మాణాన్ని సమర్థిస్తూ నవంబరు 1న ఒక భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. పాలకపక్ష సీపీఎం, బీజేపీ నాయకులు చేయీచేయీ కలిపి వీటిని నిర్వహించారు. ఈ రెండు పార్టీల మధ్యా రాజకీయ సైద్ధాతిక వైషమ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఆ వైరం తరచూ తీవ్ర హింసకు దారితీస్తున్న విషయమూ తెలుసు. అందుకే, ఎన్నడూ ఎక్కడా ఎప్పుడూ జరగని రీతిలో అదానీ పోర్టు విషయానికి వచ్చేసరికి ఈ రెండుపార్టీలూ ఒక్కటికావడం, పోర్టు పరిరక్షణ కమిటీ అంటూ ఒకటి ఏర్పడి, రెండు పార్టీలూ ఒకేవేదికను పంచుకోవడం, ఒకేరీతిలో మత్స్యకారుల ఉద్యమాన్ని నిరసించడం చూసి దేశం విస్తుపోయింది. ఇది స్థానిక స్థాయిలోనే జరిగివుండవచ్చు కానీ, ఆయా పార్టీల అధినాయకత్వాల ఆమోదం లేనిదే జరగదన్నది నిజం. ఒక సందర్భంలో చేతులు కలిపినంత మాత్రాన బీజేపీతో అంటకాగుతున్నామని ఎలా అంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ గోలపెడుతున్నా ఈ అపురూప దృశ్యానికి ఉన్న విలువ కాదనలేనిది.

ఎనిమిదివేల కోట్ల రూపాయలతో ఖర్చుతో అభివృద్ధి చేస్తున్న ఈ పోర్టును వచ్చే ఏడాది మేనెలలో ఆరంభించాలని అదానీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, మత్స్యకారుల ఉద్యమంతో ఆశించినంత వేగంగా పనిజరగడంలేదు. తాము రక్షణకోసం కేంద్రబలగాల సహాయాన్ని అర్థిస్తామని అదానీ సంస్థ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేసింది. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ పోర్టు నిర్మాణానికి రాచబాటలు వేయాల్సిందిగా న్యాయస్థానం పలుమార్లు చెప్పినా ఉద్యమాన్ని నిలువరించడం సాధ్యపడటంలేదు. ఉద్యమానికి నైతిక మద్దతునూ నాయకత్వాన్ని ఇస్తున్న లాటిన్ ఆర్చిడియోసిస్ చర్చిపైనా, కార్యక్షేత్రంలో పోరాటానికి సారథ్యం వహిస్తున్న కార్మికనాయకుడు ఎ.జె. విజయన్ పైనా, సఖి అనే ఎన్జీవో సంస్థ నిర్వహిస్తున్న ఆయన భార్యపైనా బురదజల్లే కార్యక్రమం మాత్రం ఉధృతంగా సాగుతున్నది. వారి బ్యాంకు ఖాతాల్లోకి కోట్లాదిరూపాయల విదేశీ నిధులు వచ్చిపడ్డాయనీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని కొన్ని చానెళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేశాయి. కూడాంకుళం దృశ్యమే పునరావృత్తమవుతోంది.

దేశ ఎగుమతులు దిగుమతుల్లో సింహభాగాన్ని ప్రపంచంలో ఏ దిక్కుకైనా సులువుగా జరపగలిగే కీలక ప్రదేశంలో ఉన్న ఈ పోర్టు విషయంలో అదానీ సంస్థ ఎంత పట్టుదలగా ఉన్నదో, కేరళ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉంది. కేరళ ప్రభుత్వం ఇందులో పేరుకు భాగస్వామి తప్ప, అంతిమంగా వేలకోట్ల లాభాలు దండుకొనేది అదానీయేనని ఉద్యమకారుల వాదన. అన్నింటికీ మించి, ఈ పోర్టు నిర్మాణం వందలాది మత్స్యకారులను నిరాశ్రయులను చేసింది. వేలమంది జీవనాన్నీ, జీవన విధానాన్ని విచ్ఛిన్నం చేసింది. జరుగుతున్న నిర్మాణాలు సముద్రతీరం స్వరూపస్వభావాలను మార్చివేయడంతో జీవవైవిధ్యం దెబ్బతిన్నది. సముద్రాన్ని నియంత్రించే కృత్రిమ నిర్మాణాలతో సముద్రం కోసుకుపోయి, అలలవేగంలో మార్పులు వచ్చి సుదూరప్రాంతాల్లోని మత్స్యకారులు కూడా జీవనోపాధి కోల్పోవలసి వస్తున్నది. పోర్టు నిర్మాణం ఆపాలని ఉద్యమకారులు కానీ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలు కానీ అనడంలేదు. కేవలం లాభార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా సాగుతున్న నిర్మాణాలకు అడ్డుకట్టవేసి, శాస్త్రీయబద్ధమైన వైఖరిని అనుసరిస్తే, విధ్వంసాన్ని పరిమితం చేయవచ్చునని అంటున్నారు. పోర్టుకు అనుకూలంగా ప్రబల శత్రువులతో సైతం చేతులు కలుపుతున్న కేరళ పాలకులు దీనిపై మరింత దృష్టిపెడితే సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది.

Updated Date - 2022-11-09T01:15:12+05:30 IST