ఉపాధికి ఉపద్రవం
ABN , First Publish Date - 2022-11-18T01:14:44+05:30 IST
ఖర్చుతగ్గించుకొనే పేరిట రాత్రికి రాత్రి వేలాది ఉద్యోగాలు తీసిపారేస్తున్న పాడుకాలం ఆరంభమైంది. ముందుముందు మరింత భయానకమైన ‘టెక్ వింటర్’ ఉన్నదంటూ హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన రెండోరోజే తనను ఫైర్ చేశారంటూ...
ఖర్చుతగ్గించుకొనే పేరిట రాత్రికి రాత్రి వేలాది ఉద్యోగాలు తీసిపారేస్తున్న పాడుకాలం ఆరంభమైంది. ముందుముందు మరింత భయానకమైన ‘టెక్ వింటర్’ ఉన్నదంటూ హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన రెండోరోజే తనను ఫైర్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో యువకులు వాపోతున్నారు. ట్విట్టర్, మెటా వంటి దిగ్గజ సాంకేతిక సంస్థలు వేలాదిమందిని రోడ్డునపడేస్తూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సైతం పదివేలమందిని ఉపాధికి దూరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలకు తీసివేసే అధికారం కూడా ఉన్నదని వాదించగల రోజులు ఇవి. ఉన్నపళంగా పొమ్మనే అవకాశం వారికి ఏ మేరకు ఉన్నదన్నది అటుంచితే, కనీసం ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే వాతావరణం కానీ ఇప్పుడు మచ్చుకైనా లేకపోవడం విషాదం. ఈ సంస్థల నిర్ణయాలు వాటికి మాత్రమే పరిమితమని అనుకొనేందుకు వీలులేదు. అవి సమాజంమీద చూపే ప్రభావం తక్కువేమీ కాదు. అంతర్గత సర్దుబాట్లు, దిద్దుబాట్లలో భాగంగా పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోవడం వేరు, లాభాల్లో తరుగుదల నివారించే తెరవెనుక లక్ష్యంతో కాస్ట్ కటింగ్ పేరిట లక్షలాది ఉద్యోగాలు తీసివేయడం వేరు. ఇటువంటి దిగ్గజ కంపెనీలు వరుసపెట్టి ఉద్యోగాలు తీసివేస్తున్నప్పుడు ఒకదానిలో పోతే మరొకటి అన్న కనీస భరోసా కూడా కోల్పోయి యువతరం నైరాశ్యంలోకి జారుకుంటుంది. ఒక సంస్థ తన ఉద్యోగుల్లో ఏకంగా సగంమందినీ, మూడోవంతుమందినీ ఒకేమారు పొమ్మని చెప్పగలుగుతుండటం మరింత భయపెడుతున్నది. దీనికి ప్రధానకారణం అవి పరిమితులను మించి పెరిగిపోయి గుత్త సంస్థలుగా అవతరించడమే. ప్రశ్నించలేని, నిలదీయలేని స్థితిలోకి ప్రభుత్వాలు జారుకోవడం కూడా అందుకు తోడవుతున్నది.
లక్షల కోట్లతో ట్విటర్ కొనగానే ఎలాన్ మస్క్ ఉద్యోగాల పీకివేత ఆరంభించాడు. కొనుగోలు కోసం ఆయన ఏడు బ్యాంకులనుంచి లక్షకోట్లు అప్పుతెచ్చాడు. రోజుకు పన్నెండు గంటలు పనిచేయాలనీ, ప్రోత్సాహకాలు, రాయితీల ఊసు మరిచిపోవాలనీ, బ్లూటిక్ ఆదాయాన్ని పెంచాలనీ ఉద్యోగులకు తేల్చిచెప్పాడు. వచ్చిన రెండువారాల్లోనే సగంమందిని ఇంటికి పంపిచేసిన మస్క్, కంపెనీ నష్టాల్లో ఉన్నదని అంటూనే అంత ఎగబడి ఎందుకు కొన్నాడో, ఆయనకు బ్యాంకులు అంత భారీగా ఎలా రుణాలు ఇచ్చాయో అర్థంకాదు. అనేక దేశాల్లో భారీ వ్యాపార ప్రయోజనాలున్న మస్క్, 130 కోట్లకు పైగా ఖాతాలతో, సామాన్యుడినుంచి దేశాధినేతలవరకూ తమ అభిప్రాయాలను పంచుకోగలుగుతున్న ట్విటర్ కొనుగోలులో ఏ ప్రయో జనాలు చూశారో తెలియదు కానీ, ఆర్థికంగా దానిని నిలబెట్టే పేరిట సామాన్యుల ఉద్యోగాలకు మాత్రం గండికొడుతున్నాడు. తన కొత్త పిట్ట భావస్వేచ్ఛకు ప్రతిరూపమని అంటూనే ఏ మాత్రం జవాబుదారీతనం లేకుండా వ్యవహరించగలుగుతున్నాడు. ఆయన చర్యలతో అనుకున్నంత ఆదాయం రాక, వాణిజ్యప్రకటనలు కూడా కోల్పోతే అంతిమంగా మునిగేది బ్యాంకులూ, మిగిలిన ఉద్యోగులే.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో పోతున్న వేలాది ఉద్యోగాల్లో ఎక్కువ భారత్‌లోనే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి వ్యాపారాలను దెబ్బకొట్టి, ఏడాది పొడవునా భారీగా సంపాదిస్తూ, పండుగల సీజన్‌లో ఏకంగా వేలకోట్ల వ్యాపారం చేసే ఈ తరహా సంస్థలకు ఉద్యోగులు బరువైపోవడం విచిత్రం. వ్యాపార విస్తరణకోసమో, ఎదుటికంపెనీని చావుదెబ్బతీసి ఆయా రంగాల్లో గుత్తాధిపత్యం సాధించడం కోసమో వేలాదిమందిని నియమించుకోవడం, అవసరం తీరాక వారిని తరిమివేయడం కార్పొరేట్, గుత్త సంస్థలు అనుసరిస్తున్న విధానం. ఆర్థికమాంద్యం వంటి అనుమానాలు వాటికి ఆయుధాలుగా ఉపకరిస్తున్నాయి. కొత్తకొత్త సాంకేతికతలు సమాజానికి ఉపకరిస్తున్నా, ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తూ, సమాచార బదలాయింపులో వేగాన్ని పెంచి విప్లవాత్మకమార్పులు తెచ్చినా, నిరంతర పోటీ వల్ల అవి నిత్యమూ ప్రమాదంలోనే ఉంటాయని ఈ చర్యలు తెలియచెబుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదించుకోగలిగే అవకాశాలు పెరిగినమాట నిజమే కానీ, కార్పొరేట్ కంపెనీల వైఖరితో ఆ ఉపాధిలో అంతకుమించిన అనిశ్చితి ఏర్పడింది. కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు భారీ నజరానాలతో ఎర్రతివాచీలు పరిచే పాలకులు ఇలా వేలసంఖ్యలో ఉద్యోగాలు పోతున్న సందర్భాల్లో మాత్రం నోరువిప్పరు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం, చట్టాలను బలంగా అమలుచేయడం వంటివి జరిగితే కానీ, ఈ ఏకపక్ష ధోరణికి అడ్డుకట్టపడదు.