బీజేపీ నిజంగా విభిన్న పార్టీయేనా?
ABN , First Publish Date - 2022-11-02T05:13:13+05:30 IST
భారత ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా దిగజారిపోయింది! ఇటీవల తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునేందుకు కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలు...
భారత ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా దిగజారిపోయింది! ఇటీవల తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునేందుకు కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలు ఆ శోచనీయ స్థితికి అద్దం పట్టడం లేదూ? ఆ వ్యక్తుల వెనుక బిజెపి ఉన్నదా లేదా అన్న చర్చ కన్నా ముఖ్యం అసలు ఒక పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టే వాతావరణం మన దేశంలో ఎందుకు నెలకొన్నదా అని చర్చ జరగడం అవసరం.
భారతీయ జనతా పార్టీ ఒక విశిష్ట రాజకీయ పక్షమని, దేశంలోని ఇతర పార్టీల కంటే విభిన్నమైన పార్టీ అని బీజేపీ నేతలు తరుచూ అభివర్ణిస్తుంటారు. అయితే గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఉన్న విశిష్టత కూడా ఆ పార్టీ కోల్పోతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను సంతల్లో పశువుల్లా కొనుక్కోవడం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని (క్రోనీ క్యాపిటలిజం) ప్రోత్సహించి భారీ అవినీతికి తావివ్వడం రెండూ మన ప్రజాస్వామ్యానికి చీడపురుగుల్లా దాపురించాయి.
ఎన్నికల వ్యవస్థను పట్టి పీడిస్తున్న రెండు రుగ్మతలపై లాల్ కృష్ణ ఆడ్వాణీ 1967లోనే ఆందోళన వ్యక్తం చేశారు. అవి: పార్టీ ఫిరాయింపులు, ఎన్నికల్లో ధన ప్రభావం పెరిగిపోవడం. ‘ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టడం అనేది దేశ రాజకీయ జీవితాన్నే కలుషితం చేస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి’ అని ఆడ్వాణీ ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన వెంటనే తొలి ప్రసంగంలో అన్నారు. పార్లమెంట్‌లో నాడు అటల్ బిహారీ వాజపేయి కూడా ఈ రుగ్మతలపై పోరాడారు. పార్లమెంట్ లేదా శాసనసభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం, అది ఆర్థిక అవినీతికి దారితీయడంపై ఆయన లోక్‌సభలో తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంస్కరణలను సమగ్రంగా పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. 1970లో వాజపేయి లోక్‌సభ నుంచి, అడ్వాణీ రాజ్యసభ నుంచి ఈ కమిటీకి ఎన్నికయ్యారు. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఇరువురూ డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అటల్, ఆడ్వాణీ తీవ్రంగా నిరసన తెలుపుతూ అసమ్మతి నోట్‌ను కూడా సమర్పించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని జనసంఘ్ 1972లోనే తీర్మానించింది. సమగ్ర ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టడంలో మన రాజకీయ వ్యవస్థ విఫలమైందని జనసంఘ్, బిజెపి అనేక సందర్భాల్లో విమర్శించాయి.
జెపిసితో పాటు తార్కుండే కమిటీ (1974), దినేష్ గోస్వామీ కమిటీ(1990), విఆర్ కృష్ణయ్యర్ కమిటీ(1994), ఇంద్రజిత్ గుప్తా కమిటీ(1998) కూడా ఎన్నికల సంస్కరణలకు సంబంధించి అనేక మార్పులను సూచించాయి. 15వ లా కమిషన్ కూడా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. అయితే ఇప్పటి వరకూ మన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్న అనేక రుగ్మతలను నివారించేందుకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్దితో చర్యలు తీసుకోలేకపోయింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అటల్ బిహారీ వాజపేయి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల సంస్కరణల విషయంలో గణనీయమైన చర్యలు ఏవీ తీసుకోలేకపోయారు. సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఎంత మంచి నాయకుడైనా సమగ్ర మార్పులు చేయలేకపోవచ్చు. కాని 2014లో మొట్టమొదటిసారి పూర్తి మెజారిటీతో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అద్భుతమైన మార్పులు వస్తాయని, ముఖ్యంగా చరిత్రాత్మకమైన ఎన్నికల సంస్కరణలు జరుగుతాయని అనేకమంది భావించారు. చాలాకాలంగా బిజెపి చెప్పుకుంటున్న విశిష్టత ఏమిటో తెలుసుకునే రోజులు వచ్చాయని అనుకున్నారు. ‘నేను తినను, ఇతరులను తిననివ్వను’ (నా ఖావుంగా, నా ఖానే దూంగా) అని మోదీ ఇచ్చిన నినాదాలు అలాంటివి మరి. కాని గడచిన 8 సంవత్సరాల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా పరిస్థితి మరింత ఘోరంగా మారిందనడంలో సందేహం లేదు.
ఇవాళ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం, మేఘాలయలో ప్రభుత్వాలు మారిపోయాయి. అనేక చోట్ల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, అమ్ముడుపోకుండా నివారించేందుకు ఇతర రాష్ట్రాలకు మళ్లించే రిసార్టు రాజకీయాలు జరిగాయి. ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం ప్రహసనానికి ఆపరేషన్ లోటస్ అనే ముద్దు పేరు కూడా వచ్చింది. విచిత్రమేమంటే ప్రభుత్వాలు పడగొట్టే ఈ కార్యకలాపాలను తమ ఘనకార్యంగా బిజెపి నేతలు చెప్పుకోవడం. ప్రభుత్వాలను పడగొడతాం, మాతో ఫలాన ప్రజాపతినిధులు టచ్‌లో ఉన్నారు అని బిజెపి నాయకులే బహిరంగ ప్రకటనలు చేయడం తరుచూ జరుగుతూ వస్తోంది. ప్రభుత్వాలు పడగొట్టేందుకు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు ముందు ఉపోద్ఘాతంగా కేంద్ర ఏజెన్సీల దాడులు జరుగుతాయన్న ఆరోపణలకు కూడా బలం చేకూరుతుంది. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగిన తర్వాతే ప్రజా ప్రతినిధులు పార్టీలు మారడం సహజ పరిణామంగా జరుగుతోంది. గత నాలుగేళ్లుగా లా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించకపోవడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టం చేస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికకు ముందు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు రంగంలోకి దిగడం ఒక నాటకీయ ఘట్టంగా అనిపించవచ్చు. ఈ ఘట్టానికి కర్త, కర్మ ఎవరు అన్నది వేరే విషయం. అయితే స్వామిజీ వేషధారులైనవారు ఈ కార్యకలాపాల్లో పాల్గొనడంతో అనుమానం బిజెపివైపే మళ్లుతుందనడంలో సందేహం లేదు. దేశంలో ఈ వాతావరణం నెలకొనేందుకు గడచిన 8 సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ అగ్రనేతలు అనుసరించిన విధానాలే కారణమని చెప్పక తప్పదు. స్వామీజీలతో పాటు కొందరు అనామక వ్యక్తులు మరో రాష్ట్రానికి వచ్చి ఢిల్లీతో తమకు కనెక్షన్లు ఉన్నట్లు చెప్పుకోవడానికి, పార్టీ అగ్రనేతల పేర్లను ప్రస్తావించడానికి, భారీ ఎత్తున డబ్బులిస్తామని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? ఎవరిచ్చిన ధైర్యంతో వారీ పనిచేశారు?
అందువల్ల నిజంగా బిజెపి ఈ ఘట్టం వెనుక ఉన్నా లేకపోయినా, వెనుకటికి నాయనా పులి వచ్చె కథలో జరిగినట్లు బిజెపి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ప్రధానమంత్రి కార్యాలయమో లేదా హోం మంత్రి కార్యాలయమో గురించి చెప్పుకుని కుంభకోణాలు చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి, వాస్తవాలను ప్రజలకు చెప్పే చర్యలు తీసుకుంటారు. అయితే టిఆర్‌ఎస్ ఎమ్మల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన సంభాషణల్లో కేంద్ర హోంమంత్రి పేరు, నంబర్ 2 గురించి, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి గురించి ప్రస్తావన వచ్చినట్లు ఆడియో రికార్డులు లీకయినప్పటికీ హోంమంత్రి నుంచి కానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఈ ఉదంతం గురించి మాట్లాడేందుకు ఎవరూ పెద్దగా సిద్ధపడడం లేదు. ఎందుకలా?
ఒక జాతీయ పార్టీయే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు పూనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా అలాంటి రాజకీయాలే అనుసరించడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఎవరూ మరొకరికి నీతులు చెప్పే పరిస్థితి దేశంలో లేకపోవడం ప్రజాస్వామ్యంలో మరో దౌర్భాగ్యం. అన్ని పార్టీలు భారీగా డబ్బులు ప్రవహింపచేస్తున్నాయి. భారీ ఎత్తున ఓట్ల కొనుగోలు జరుగుతోంది. పెద్ద ఎత్తున మద్యం ఏరులై పారుతోంది. ‘మా పార్టీ కార్యకర్తలు గతంలో బ్లెండర్ స్ప్రైడ్ సీసాలు పంచినా సంతృప్తిపడేవారు. అయితే ఇప్పుడు బ్లాక్ డాగ్ సీసాలు పంచిపెట్టాల్సి వస్తోంది’ అని ఒక బిజెపి నాయకుడు వాపోయారు, ఈ పరిణామాలు చూస్తుంటే ఎన్నికల కమిషన్ ఎంత నిర్వీర్యంగా మారిందో అర్థమవుతోంది.
ప్రజాస్వామ్యాన్ని తుప్పుపట్టేలా చేస్తున్న మరో దుర్మార్గం క్రోనీ క్యాపిటలిజం. దాని దుష్ఫలితం ఎలా ఉంటుందో రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని మోర్బీలో ఒక వంతెన కూలి దాదాపు 150 మంది మరణించిన ఉదంతం స్పష్టం చేసింది. గడియారాలు తయారు చేసే కంపెనీ నొకదానికి ఎలాంటి అనుభవం లేకపోయినా ఈ వంతెన మరమ్మతును అప్పగించారు. ఆ కంపెనీ అయిదు నెలల ముందే వంతెనకు మరమ్మతులు పూర్తి చేశానని చెప్పుకుని మునిసిపల్ అథారిటీ అనుమతులు లేకపోయినా దాన్ని ప్రారంభించి టిక్కెట్లు అమ్ముకోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఎన్నికల వ్యవస్థలో కూడా క్రోనీ క్యాపిటలిజం ప్రవేశించడానికి ఎన్నికల బాండ్లు మాత్రమే కాదు, తమ అభ్యర్థులకు బడా కాంట్రాక్టులు కేటాయించడం కూడా ఇందుకు మరో ఉదాహరణ. వ్యవస్థలో పేరుకుపోయిన ఈ దుర్లక్షణాలను ఏరి పారేసి బీజేపీ నిజంగా విశిష్టమైన పార్టీ అని నిరూపించేందుకు ప్రధాని మోదీకి ఇప్పటికీ అవకాశం లేకపోలేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)