RK: జగన్ అండ్ కో అస్త్రం కేసీఆర్ కోసమేనా?

ABN , First Publish Date - 2022-12-11T00:21:33+05:30 IST

ఒకప్రకటన – ఎన్నో అర్థాలు – మరెన్నో ప్రయోజనాలు! సుప్రీంకోర్టు సూచిస్తే రెండు తెలుగు రాష్ర్టాలు మళ్లీ కలసిపోవాలన్నదే తమ పార్టీ విధానమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు...

RK: జగన్ అండ్ కో అస్త్రం కేసీఆర్ కోసమేనా?

ఒకప్రకటన – ఎన్నో అర్థాలు – మరెన్నో ప్రయోజనాలు! సుప్రీంకోర్టు సూచిస్తే రెండు తెలుగు రాష్ర్టాలు మళ్లీ కలసిపోవాలన్నదే తమ పార్టీ విధానమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రకటనపై తెలంగాణలో వివిధ పార్టీల నాయకులు విమర్శలు గుప్పించగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇదో డైవర్షన్‌ పాలి‘ట్రిక్‌’ అని సరిపెట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయ్యాక ఇప్పుడు సజ్జల మళ్లీ కలసిపోవడానికి సిద్ధమని ప్రకటించడం వింతగా అనిపించినప్పటికీ అందులో పరమార్థం లేకపోలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు, ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తప్పుపట్టారు. రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదన్న పిటిషనర్ల అభిప్రాయంపై మాట్లాడకుండా రెండు రాష్ర్టాలూ మళ్లీ కలసిపోతే మంచిదే అని సజ్జల మాట్లాడటం ఏమిటని పలువురు భావించారు. ఉండవల్లి చెప్పిందేమిటి? సజ్జల అన్నదేమిటి? అంటే అందులోని పరమార్థం వైసీపీ నాయకులకు మాత్రమే తెలుసు. సజ్జల ప్రకటన తర్వాత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు అందుకున్నారు. ఆంధ్రా వాళ్ల కుట్రలు మళ్లీ మొదలయ్యాయని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిలించే ప్రయత్నం మొదలుపెట్టారు. సజ్జల ప్రకటనకు మూలకారకుడైన ఉండవల్లి మాత్రం నేను చెప్పిందేమిటి? మీ స్పందన ఏమిటి? అని సజ్జలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయారు. తాను ఏర్పాటు చేయబోతున్న జాతీయ పార్టీ గురించి ఉండవల్లితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ మధ్య సుదీర్ఘంగా మంతనాలు జరపడం, కేసీఆర్‌ తన పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించవచ్చునని ఉండవల్లి స్వాగతించడం గమనార్హం. గత ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయడంతో... తెలంగాణ సెంటిమెంటును రగిలించి ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌ ఇప్పుడు సజ్జల చేసిన ప్రకటనను తనకు అనుకూలంగా మలచుకోకుండా ఉంటారా? అదే సమయంలో గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి విజయం సాధించడానికి కేసీఆర్‌ పూర్తి సహాయ సహకారాలు అందించారు. బహుశా ఇప్పుడు అందుకు ప్రతిగా మరో పది నెలల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు మళ్లీ ‘తెలంగాణ సెంటిమెంటు’ అనే అస్ర్తాన్ని అందించడానికై సజ్జలతో వైసీపీ ఈ ప్రకటన చేయించి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో నిజం లేకపోతే విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత అర్థంపర్థం లేకుండా మళ్లీ కలసిపోదామని ప్రకటిస్తారా? తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ విజయం సాధిస్తే ఆ తర్వాత తమకు మళ్లీ ఉపయోగపడతారన్నది జగన్‌ అండ్‌ కో అభిప్రాయం అయివుండవచ్చు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని తెలిసి కూడా వైసీపీ నాయకులు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చునని జగన్‌ అండ్‌ కో భావించినట్టున్నారు. కానీ, మిగతా విషయాలలో వలె ఈ విషయంపైనా ప్రజల్లో స్పందన కనిపించడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ సమాజం ప్రత్యేకత! రాజధాని అంశాన్ని మొదటికి తెచ్చినట్టు రాష్ట్ర విభజనను కూడా మళ్లీ మొదటికి తేవచ్చునని ఎవరైనా భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు.

అటూ... ఇటూ...

విభజన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుణ్యమా అని మరింత అధ్వానంగా తయారైంది. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవడం ఆంధ్రులకు చేతకాదు అని జగన్రెడ్డి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ మేం కలసిపోవడానికి సిద్ధమని ఒక దిక్కుమాలిన ప్రకటనను జనంలోకి వదిలారు. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతూ అదివరకే ప్రారంభించిన రాజధానిని కూడా లేకుండా చేసిన జగన్‌ అండ్‌ కో... ఇప్పుడు హైదరాబాద్‌ రాజధానిగా ఉంటేనే బాగుంటుందని వాదిస్తారేమో తెలియదు. హైదరాబాద్‌ ఉండగా మూడు రాజధానులు ఎందుకు అనే తర్కం లేవదీయవచ్చు. జగన్‌ ప్రభుత్వం చెబుతున్న మాటలను సీరియస్‌గా తీసుకునే పరిస్థితులు కూడా కనిపించడంలేదు. ప్రతి విషయంలోనూ కపటత్వం ప్రదర్శిస్తున్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాయలసీమ ప్రజలకు చెప్పి రెచ్చగొడతారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని బల్లగుద్ది మరీ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఇంతకంటే వంచన మరొకటి ఉంటుందా? ఇప్పుడు రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కూడా జగన్‌ ప్రభుత్వం ద్వంద్వ వైఖరినే అవలంబిస్తోంది. హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది ముగిసిన అధ్యాయమని సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత కర్నూలులో మళ్లీ గర్జన నిర్వహించడం ‘జగన్‌ అండ్‌ కో’కే చెల్లుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు మళ్లీ కలసిపోతాయని చెప్పడం కూడా ఈ కోవలోకే వస్తుంది. మనకు మళ్లీ హైదరాబాద్‌ రాజధానిగా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసినా చేస్తారు. తాము ఏం చేసినా, ఏం చెప్పినా జనం గొర్రెల మాదిరిగా తలలు ఊపుతారని జగన్‌ అండ్‌ కో నమ్ముతుండవచ్చు. కానీ అది ఎల్లవేళలా సాధ్యం కాదు.

మూడు పార్టీలు... మధ్యలో షర్మిల!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేలు చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే సజ్జల సదరు ప్రకటన చేసి ఉంటారు. అయితే, సజ్జల ప్రకటనను జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఖండించారు. తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమె ‘ముందు మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోండి’ అని పరోక్షంగా సోదరుడికి హితవు పలికారు. తెలంగాణలో షర్మిల పార్టీ–భారతీయ జనతా పార్టీ దగ్గరవుతున్నట్టుగా ఉన్నాయి. బహుశా ఈ విషయం పసిగట్టే కాబోలు షర్మిల పాదయాత్రకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ్రేకులు వేయిస్తున్నారు. షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేయడం, షర్మిల కూర్చున్న వాహనాన్ని టోయింగ్‌ చేసుకుంటూ పోలీసులు తీసుకువెళ్లడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా ‘మీ సోదరిని అలా లాక్కుంటూ వెళ్లినా మీకు బాధ కలగలేదా?’ అని జగన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఆషామాషీగా తీసుకోలేం. రాజకీయ ప్రయోజనం లేకపోతే ప్రధానమంత్రి ఈ అంశాన్ని అంత ముఖ్యమైన సమావేశం వద్ద ప్రస్తావిస్తారా? జగన్మోహన్‌ రెడ్డిని నిలదీసినట్టు ‘ఆంధ్రజ్యోతి’ కలగన్నదా? అని నోరు పారేసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెంప చెళ్లుమనిపించేలా... షర్మిలకు ఫోన్‌ చేసి మరీ ప్రధాని మోదీ పరామర్శించారు. ఇది కూడా సత్యదూరమని విజయసాయి రెడ్డి వదరుబోతులా మాట్లాడితే సదరు పరామర్శకు ఏర్పాట్లు చేయించిన అనుసంధానకర్త ఎవరో కూడా నేను ప్రకటిస్తాను. ఏది ఏమైనా తెలంగాణలో షర్మిలను దరిచేర్చుకోవాలన్న అభిప్రాయానికి కమలనాథులు వచ్చినట్టున్నారు. ఆమెను ప్రస్తుతానికి తెలంగాణలో ఉపయోగించుకున్నా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు. తెలంగాణలో కేసీఆర్‌కు నొప్పి కలిగితే జగన్మోహన్‌ రెడ్డి భరించలేరు. అయితే కేంద్రాన్ని ధిక్కరిస్తే తమకు కలిగే నొప్పి ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కనుక తన సోదరిని బీజేపీ పెద్దలు రాజకీయంగా ఎలా ఉపయోగించుకున్నా జగన్‌ నోరెత్తలేరు. ప్రస్తుతానికి జగన్‌కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కేంద్ర పెద్దలు రానున్న ఎన్నికల వరకు అదే వైఖరితో ఉంటారని చెప్పలేము. తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యం.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథులు చిన్నా చితకా పార్టీలను కలుపుకొనిపోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలను చేరదీస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు దూరం జరగడానికి కూడా వెనుకాడరని తాజా పరిణామాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు నమ్మదగ్గ వ్యక్తులు కాదని గత ఎన్నికల సందర్భంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని మళ్లీ చేరదీయడానికి కమలనాథులు వెనుకాడరని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. జిల్లాలలో పర్యటిస్తున్న చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం కూడా జగన్‌ అండ్‌ కోను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కారణంగానే రానున్న ఎన్నికలపై జగన్మోహన్‌ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. మూడు రాజధానులకు అనుకూలంగా కర్నూలులో నిర్వహించిన గర్జన విఫలం కావడం, జయహో బీసీ పేరిట విజయవాడలో నిర్వహించిన భేరీలో జగన్మోహన్‌ రెడ్డి ప్రసంగించడానికి ఉపక్రమించగానే జనం వెళ్లిపోవడం పట్ల కూడా జగన్‌ అండ్‌ కో కలవరం చెందుతున్నారు. ఈ పరిణామాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి కూడా తెలుగు రాష్ర్టాలు మళ్లీ కలసిపోతే బాగుంటుందని సజ్జలతో ప్రకటన చేయించి ఉంటారు. ఏ కారణం వల్లనైనా బీజేపీ పెద్దలు తమపై శీతకన్ను వేస్తే తెలంగాణలో కేసీఆర్‌కు ఉపయోగపడటం ద్వారా గత ఎన్నికలలో వలె వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సహకారం పొందవచ్చునని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నట్టు ఉంది.

తెలంగాణపైనే కమలం కన్ను

బీజేపీ పెద్దలకు జగన్‌–చంద్రబాబు ముఖ్యం కాదు. భారత రాష్ట్ర సమితి అంటూ హడావిడి చేస్తున్న కేసీఆర్‌ను ఇంటికి పంపడం పైనే వారు దృష్టి కేంద్రీకరించారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఏర్పడకుండా సామ దాన భేద దండోపాయాల ద్వారా రాజకీయ లబ్ధి పొందుతూ వస్తున్న మోదీ–షా ద్వయానికి సవాలుగా నిలవాలని కేసీఆర్‌ తలపోస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతమవుతారో తెలియదుగానీ, కేసీఆర్‌ అడుగులు తెలంగాణ దాటి బయటకు పోకుండా కేంద్ర పెద్దలు వ్యూహ రచనతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఐటీ దాడులు ఊపందుకున్నాయి. ఇప్పుడు షర్మిలను అక్కున చేర్చుకున్న కమలనాథులు మున్ముందు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నాయకత్వంలో చురుగ్గా పనిచేస్తున్న బహుజన సమాజ్‌ పార్టీని కూడా చేరదీసే అవకాశముంది. తెలంగాణలో ప్రస్తుతం దళితులు బీజేపీకి దూరంగా ఉన్నారన్నది ఒక అంచనా! దళితబంధు ద్వారా ఆ వర్గం విశ్వాసం చూరగొనడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ లోటును అధిగమించడానికి దళిత యువతలో పట్టున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను కూడా చేరదీయడానికి ఢిల్లీ పెద్దలు స్కెచ్‌ వేసుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ద్వారా ప్రవీణ్‌ కుమార్‌ను తమవైపు తిప్పుకోవచ్చునని కేంద్ర పెద్దలు తలపోస్తున్నారు. ఆంధ్ర – తెలంగాణ ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పరస్పరం సహకరించుకుంటున్న విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తించారు. ఈ కారణంగానే రెండు రాష్ర్టాలూ కలసిపోవాలనుకుంటున్నామని సజ్జల చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించలేదు. ఈ అంశాన్ని పెద్దది చేయడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించే అవకాశాన్ని కేసీఆర్‌కు ఇవ్వకూడదని కమలదళం భావిస్తోంది. తెలంగాణలో జెండా పాతాలన్న విషయమై బీజేపీ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఈ క్రమంలో షర్మిలను అరెస్టు చేయడంపై సాక్షాత్తూ ప్రధానమంత్రి స్వయంగా జగన్మోహన్‌ రెడ్డిని నిలదీశారు. ఇలాంటి అరెస్టులు దేశంలో సర్వసాధారణం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేధించినా పట్టించుకోని ప్రధానమంత్రి షర్మిల విషయంలో మాత్రం ప్రత్యేకంగా స్పందించారంటే ఆయనకు తెలంగాణ ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తెలంగాణ చేజారి పోకుండా మిత్రుడు జగన్‌ అందించిన తెలంగాణ సెంటిమెంటు అస్ర్తాన్ని రగిలించి ప్రయోగిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.

మాయ మాటలకే ఓట్లు!?

ఈ విషయం అలా ఉంచితే, బాగుపడండి అని చెప్పేవారి కంటే, బాగు చేస్తాను అని చెప్పే వారినే– ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ‘నేను మిమ్మల్ని బాగు చేస్తాను’ అని మాత్రమే అమాయక ప్రజలకు చెబుతున్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవితాలను బాగు చేయవచ్చు అని నమ్మిన చంద్రబాబు గత ఎన్నికల్లో దెబ్బతిన్నారు. బడుగు, బలహీన వర్గాల వారు స్వశక్తితో బాగుపడితే వారు తమకు అణగిమణిగి ఉండరన్నది జగన్‌ నమ్మే సిద్ధాంతం. అందుకే... వాళ్లను సొంతకాళ్లపై నిలబెట్టడం మాని, సంక్షేమం పేరిట డబ్బు పంచుతున్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిస్టు నాయకులుగా ఒక వెలుగు వెలిగిన వారందరూ ఈ సిద్ధాంతాన్నే అమలు చేసి పబ్బం గడుపుకొన్నారు. పులివెందులలో ఇప్పటికీ ఇదే విధానం అమల్లో ఉంది. బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికంగా బలపడితే స్వతంత్రులు అవుతారు. సొంతంగా ఆలోచిస్తారు. అలా జరిగితే తమ ఆటలు సాగవని ఫ్యాక్షనిస్టులకు తెలుసు. ఈ కారణంగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బటన్లు నొక్కడానికే జగన్‌ పరిమితం అయ్యారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఆయన ప్రాధాన్యాల్లో లేకుండా పోయింది. ‘ప్రతి నెలా నేను పంచిపెట్టే డబ్బుతో బతికేయండి, అంతకంటే ఇంకేం కావాలి’ అని జగన్‌ అంటున్నారు. ‘నా బీసీలు, నా దళితులు, నా మైనారిటీలు’ అని చెబుతున్న ముఖ్యమంత్రి వారిని మాత్రం కీలక పదవుల్లో ఎక్కడా నియమించరు. అప్రధాన పదవులు కట్టబెట్టడం ద్వారా సామాజిక న్యాయం చేశానని చెప్పుకొంటూ కాలం గడిపేస్తారు. అదేమంటే ఎంత మందికి పదవులు ఇచ్చిందీ లెక్కచెబుతారు. ఆ పదవుల్లో నియమితులైన వారికి అధికారం ఉండదు. నిధులు కూడా ఉండవు కదా! కొంతమందికి ఎందుకూ కొరగాని పదవులు కట్టబెట్టి లెక్క చూపించుకోవడం జగన్‌ విధానం. చంద్రబాబు ప్రభుత్వం బలహీనవర్గాల వారు స్వశక్తితో ఎదగడానికి దోహదపడే పథకాలను ప్రవేశపెడితే జగన్‌ వాటిని రద్దుచేశారు. ‘చంద్రబాబు వలె నేను పనిముట్లు ఇచ్చి సరిపెట్టను. డబ్బులు ఇస్తున్నాను’ అని గొప్పలు చెప్పుకొంటారు.

జగన్‌ అసలు లక్షణాలు...

ప్రభుత్వం తరఫున తాను పంచుతున్న డబ్బుపై బడుగు, బలహీన వర్గాల వారు శాశ్వతంగా ఆధారపడాలన్నదే జగన్మోహన్‌ రెడ్డి ఆచరిస్తున్న విధానం. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ భేరీలో కూడా ఆయన ఈ విషయమే చెప్పారు. ఈ సదస్సులో ప్రసంగించిన బీసీ మంత్రులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తారు. కృష్ణుడిలోని బుద్ధిబలం, అర్జునుడిలోని వీరత్వం, కర్ణుడిలోని కరుణ, భీముడిలోని ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణక్యుడిలోని రాజనీతి– అన్నీ కలబోసిన మా నేత జగన్‌ అని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కీర్తించారు. నిజానికి ఇక్కడ పేర్కొన్న ఏ ఒక్క లక్షణం కూడా జగన్‌లో కనిపించవు. అర్జునుడిలోని వీరత్వం, భీముడిలోని ధైర్యం జగన్‌కు ఉండివుంటే తన చెల్లి షర్మిల విషయమై ప్రధాని మోదీ ప్రశ్నించినప్పుడు ‘ఆ విషయం మీకెందుకు?’ అని గట్టిగా సమాధానం ఇచ్చివుండేవారు. అలా అనకపోగా ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నారు. చాణక్యుడిలోని రాజనీతి జగన్‌లో ఉండివుంటే కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి రాష్ర్టానికి రావాల్సినవి సాధించి ఉండేవారు. కర్ణుడిలోని కరుణ ఉండివుంటే రాజకీయ ప్రత్యర్ధులను కేసులలో ఇరికించి వేధించి ఉండేవారు కాదు. ధర్మరాజులోని ధర్మమైతే జగన్‌లో మచ్చుకైనా కనిపించదు. కృష్ణుడిలోని బుద్ధి బలం విషయానికి వస్తే, అది లేదు కానీ, కుత్సిత బుద్ధి మాత్రం పుష్కలంగా ఉంది. అయినప్పటికీ తనను అభినవ అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, జ్యోతీరావ్‌ ఫూలే వంటి మహానుభావులతో పోల్చి పొగిడేవారిని మాత్రం కావల్సినంత మందిని సమకూర్చుకున్నారు. సామూహిక ప్రయోజనాలను విస్మరించి వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం ద్వారా వంధిమాగధులను పోగేసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలందరినీ తనపై ఆధారపడేలా చేసుకోవడానికై ఉచితాలకు తెరతీశారు. ప్రజల సైకాలజీని అడ్డుపెట్టుకొని ఎవరైనా కొంత కాలమే పబ్బం గడుపుకోగలరు.

ఉచితాల వల్ల తాము దీర్ఘకాలంలో ఎంత నష్టపోతామో ప్రజలు గ్రహించకపోరు. అప్పుడు జగన్‌ వంటి వారి నిజస్వరూపం బట్టబయలు అవుతుంది. ఉచితాల విషయంలో గుజరాతీలను అభినందించాల్సిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ఎన్నో ఉచితాలను ప్రకటించినా గుజరాతీలు వాటికి ఆకర్షితులు కాకుండా బీజేపీకే పట్టం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీని మినీ ఇండియా అంటారు. వివిధ రాష్ర్టాలు, ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వారు ఉపాధికోసం ఢిల్లీకి వలస వెళ్తారు. ఇలాంటి వలస కూలీలకు ఉచితాల ఆశ చూపి కేజ్రీవాల్‌ అధికారంలోకి వచ్చారు. అదే ఫార్ములాతో పంజాబ్‌లో అధికారంలోకి రాగలిగారు. గుజరాత్‌లో మాత్రం కేజ్రీవాల్‌ పప్పులు ఉడకలేదు. నిజానికి గుజరాతీలకూ ఆంధ్రావాళ్లకూ మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరిలోనూ ఎంటర్ప్రైజింగ్‌ నేచర్‌ ఉంది. తెలివితేటలతో పాటు కష్టపడే మనస్తత్వం ఉంది. అందుకే ఈ రెండు రాష్ర్టాలకు చెందిన వారు అవకాశాలను వెదుక్కుంటూ ఎక్కడికైనా వెళతారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదిగిపోతారు. ఈ రెండు రాష్ర్టాలకు చెందిన వారు ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా ఎదిగారు. బడా కంపెనీలకు అధిపతులుగా ఉండగలుగుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్‌ షా అధికారంలోకి వచ్చాక గుజరాతీల పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు కాగా, జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆంధ్రుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రాష్ర్టానికి చెందిన కాంట్రాక్టర్లు, ఇతర వ్యాపారులు వలస బాట పట్టారు. ప్రభుత్వ పోకడలవల్ల పరిశ్రమలు కూడా తరలిపోయే దుస్థితి ఏర్పడింది. ప్రజలను ఉచితాలకోసం ఎదురుచూసే స్థాయికి దిగజార్చారు. షర్మిల విషయంలో జరిగిన దానికి తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే నోటితో గుజరాత్‌తో పోటీ పడాల్సిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుస్థితి ఎందుకు తెచ్చావు? అని జగన్మోహన్‌ రెడ్డిని నిలదీసి ఉంటే మరింత బాగుండేది. అన్నీ తెలిసి కూడా జగన్‌ను సద్గుణ సంపన్నుడు అని పొగిడే వారిని ఏమీ చేయలేం. అది వారి స్వార్థం. జగన్మోహన్‌ రెడ్డి తన సొంత డబ్బుతో దానధర్మాలు చేస్తే పొగిడినా అర్థం ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి పంచిపెట్టడాన్ని కూడా కీర్తించాలంటే ఎలా? అలా చేయడం రాష్ర్టానికి ద్రోహం చేయడమే అవుతుంది. ‘‘జగన్ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏమి ప్రయోజనం?’’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. లేని పక్షంలో ఆషాఢభూతులదే పైచేయి అవుతుంది. అధికారం అటువంటి వారికే దక్కుతుంది.

ఆర్కే

Updated Date - 2022-12-11T06:49:33+05:30 IST