మునుగోడుతో దిగజారుడే

ABN , First Publish Date - 2022-10-23T04:40:57+05:30 IST

జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు పట్టరానంత కోపం వచ్చింది. తన గురించి వైసీపీ నాయకులు అదేపనిగా చేస్తున్న...

మునుగోడుతో దిగజారుడే

జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు పట్టరానంత కోపం వచ్చింది. తన గురించి వైసీపీ నాయకులు అదేపనిగా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు భరించలేని స్థాయిలో ఉన్నాయన్న భావనతో ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. పవన్‌ కల్యాణ్‌ది ఆగ్రహమా? ధర్మాగ్రహామా? అన్నది తేల్చడం కష్టం. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్‌ కల్యాణ్‌ చెప్పు చూపించి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో సమంజసం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు కొంతమంది గత మూడున్నరేళ్లుగా వాడుతున్న ముతక భాష, చేస్తున్న వ్యాఖ్యలకు అలవాటు పడిపోయిన ప్రజలకు పవన్‌ భాష అభ్యంతరకరంగా అనిపించడం లేదు. పవన్‌ కల్యాణ్‌ చెప్పు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ, పవన్‌ కల్యాణ్‌ను తప్పుబట్టే అర్హత జగన్మోహన్‌ రెడ్డికి ఉందా? అన్నదే ప్రస్తుతం ప్రశ్నగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలని, కాల్చిచంపినా తప్పులేదని అన్న విషయం ఎలా మరచిపోగలం? అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు, ఇతర అధికార పార్టీ ముఖ్యులు వాడిన.. వాడుతున్న భాషను జగన్‌రెడ్డి ఒక్కరోజు కూడా తప్పు పట్టకపోవడం గమనార్హం. శాసనసభను సైతం ముతక భాషకు వేదికగా మార్చుకున్నారు. చంద్రబాబును అత్యంత అభ్యంతరకరమైన భాషలో తిట్టడాన్ని ముఖ్యమంత్రి ఆస్వాదించడాన్ని చూశాం. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అయితే చంద్రబాబును ఏకంగా లం.. అంటూ ప్రచురించలేని భాషలో దారుణంగా తిట్టినా జగన్‌కు అభ్యంతరకరంగా అనిపించలేదు. కొడకా, సన్నాసి, వెధవ వంటి పదాలు కొంతమంది మంత్రుల నోటి నుంచి అలవోకగా దొర్లాయి. రాజకీయాలలో ఇలాంటి అథమస్థాయి భాష వాడడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొంతమంది అధికార పార్టీ నాయకులు సైతం ముఖ్యమంత్రి ఆనందించడాన్ని చూసి మౌనంగా ఉండిపోవడం ద్వారా ద్రౌపదీ వస్ర్తాపహరణ నాటి కౌరవ సభలో చోటుచేసుకున్న సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడాన్ని ముఖ్యమంత్రి సైతం ప్రోత్సహించడంతో ఇళ్లలోని ఆడవాళ్లను కూడా అన్యాయంగా వివాదంలోకి తీసుకువచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు, అధికార పార్టీ నాయకుల పోకడలు రోత పుట్టించే స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్ల గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ పార్టీ సోషల్‌ మీడియాలో ఆయనను కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ఫలితంగా సహనం నశించిన పవన్‌ కల్యాణ్‌ కూడా భాష విషయంలో సహనం కోల్పోయినట్టున్నారు. రాజకీయాలలో ఇటువంటి ధోరణులు సమర్థనీయం కాకపోయినా ఇప్పటికే వైసీపీ వాళ్ల భాషకు అలవాటు పడిపోయినవారికి పవన్‌ కల్యాణ్‌ రూపంలో సరైనవాడు ఇంతకాలానికి దొరికాడనే అభిప్రాయం కలిగింది. ఇంతకీ జనసేనానికి అంత కోపం రావడానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే కారణం. ఈ నెల 15వ తేదీన విశాఖపట్టణంలో ముందుగా నిర్ణయించుకున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. 24 గంటలపాటు హోటల్‌ గదికే ఆయనను పరిమితం చేసి, వెనక్కు పంపారు. తమను అడ్డుకోవడానికి అధికార పార్టీ నాయకులు అదేరోజు విశాఖలో గర్జన కార్యక్రమం పెట్టుకున్నారని జనసైనికుల అభిప్రాయం. ఎవరి కార్యక్రమాన్ని ముందుగా ప్రకటించారో గమనిస్తే తప్పు ఎవరిదో తేలిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. అదేమిటో గానీ ప్రతిపక్ష నాయకులు విశాఖపట్టణానికి వెళ్లాలనుకున్నప్పుడల్లా ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. గతంలో చంద్రబాబును కూడా ఇలానే అడ్డుకుని విమానాశ్రయం నుంచే వెనక్కు పంపారు. దీనిని హైకోర్టు కూడా అప్పట్లో తప్పుబట్టింది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వంతు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిది వింత మనస్తత్వం. ముఖ్యమంత్రిగా తానేదైనా చేయవచ్చని ఆయన భావిస్తారు. ప్రతినెలా ప్రజలకు డబ్బు పంచుతున్నందున తాను ఏది చేసినా వారి మద్దతు తనకే ఉంటుందని ఆయన భ్రమలో ఉన్నారు. ప్రతి గ్రామంలో మెజారిటీ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నందున, వచ్చే ఎన్నికలలో తన విజయానికి ఢోకా ఉండదని ఆయన నమ్ముతున్నారు. దీంతో ఆత్మవిశ్వాసం కాస్తా అతి విశ్వాసంగా మారింది. ఫలితంగా ముఖ్యమంత్రిలో లెక్కలేనితనం ఏర్పడింది. ఈ కారణంగానే చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ను రెచ్చగొట్టి మరీ ఒక్కటి చేశారు.

జగన్‌.. అతి విశ్వాసం!

తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయంలో ప్రజలందరిదీ ఒకే అభిప్రాయం కాగా.. జగన్మోహన్‌ రెడ్డి మరో లోకంలో విహరిస్తున్నందున ‘నాకు ఢోకా ఉండదు’ అని అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబునాయుడు స్వయంగా పవన్‌ కల్యాణ్‌ వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేసే విషయమై వారు ప్రకటించకపోయినా వారి మధ్య జరిగిన చర్చలలో పొత్తు ప్రస్తావన కూడా వచ్చిందంటున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసిపోవడంపై ముఖ్యమంత్రి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ‘ఇక మన పని అయిపోయినట్టే’ అనే ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ నుంచి రోడ్‌ మ్యాప్‌ కోసం తాను ఇకపై వేచి ఉండనని ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ ఇంత అనూహ్యంగా ఈ ప్రకటన చేయడానికి ఆయన పట్ల జగన్‌ ప్రభుత్వం విశాఖలో వ్యవహరించిన తీరే కారణం. జనసేనానిని పనిగట్టుకుని రెచ్చగొట్టి ఉండకపోతే తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి ఆయన ఇప్పటికిప్పుడు ముందుకు వచ్చి ఉండేవారు కాదు. అయితే తాను నటించిన సినిమాల విడుదల సందర్భంగా ఇబ్బందులు సృష్టించడంతోపాటు కొంతకాలంగా తనను అవమానిస్తూ ఉండడాన్ని పవన్‌ కల్యాణ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల తర్వాత కూడా జగన్‌రెడ్డి అధికారంలో కొనసాగితే తన సినిమా జీవితంతో పాటు రాజకీయ మనుగడకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందన్న అభిప్రాయానికి పవన్‌ కల్యాణ్‌ వచ్చినట్టున్నారు. ఈ కారణంగానే జగన్మోహన్‌ రెడ్డిని గద్దె దించడానికి చంద్రబాబుతో చేతులు కలిపారు. దీనిపై ముసుగులు తొలగిపోయాయని జగన్‌ రోత మీడియాతో పాటు కూలి మీడియాలో ప్రచారం జరిగినా, దాని ప్రభావం ప్రజాభిప్రాయంపై ఉండదు. కాకపోతే ఈ పరిణామాలతో భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణలో పడింది. చంద్రబాబునాయుడుతో పొత్తుకు ఆ పార్టీ సిద్ధంగా లేనప్పటికీ తమ మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఆయనవైపు జరగడంతో ఎటూ పాలుపోని స్థితిలో బీజేపీ ఉంది. నిజానికి ఆంధ్రా ఎన్నికలలో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో బీజేపీ లేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఎన్నికలలో జగన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో తెలుగుదేశం గానీ, జనసేన గానీ బీజేపీ విషయంలో సానుకూలంగా ఉంటున్నాయి. తెలుగుదేశంతో చేతులు కలపాలని జనసేనాని నిర్ణయించుకోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్షంగా సహకరిస్తున్న బీజేపీకి చెందిన ‘ఆ నలుగురు’ నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఇదే అదనుగా భావించిన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనలో వేళ్లూనుకుపోయి ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ పరిస్థితులలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్నవారు ఎవరైనా ప్రతిపక్షాలు ఏకం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. జగన్‌రెడ్డి అరాచక పోకడల వల్ల సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి స్వీయ మనుగడ కోసం ఏకం కావాల్సిన పరిస్థితి ప్రతిపక్షాలకు ఇప్పుడు ఏర్పడింది. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అని ఇంతకాలం సందేహాలు ఉండేవి. ‘అటువంటి సందేహం మీకెందుకు? నేనున్నాను కదా! అవసరమైతే కమ్యూనిస్టులను కూడా కలుపుతాను’ అని అన్నట్టుగా జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తన ఒక్కడికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతున్నారని జగన్మోహన్‌ రెడ్డి రెండు రోజుల క్రితం వాపోయారు గానీ, అందరినీ ఏకం చేసిన ఘనత తనదేనని మరచిపోయారు. జగన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం చీకట్లోకి వెళుతుందని సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. రాష్ర్టాన్ని ఇప్పటికే చీకట్లోకి నెట్టేశారన్న సంగతి సజ్జలకు తెలియదా? ప్రతిపక్షాలు సంఘటితమైతే రాష్ట్రం చీకట్లోకి వెళ్లదు గానీ, జగన్‌ అండ్‌ కో రాజకీయ భవిష్యత్తు మాత్రం చీకట్లోకి వెళ్లడం ఖాయం. జగన్మోహన్‌ రెడ్డి వంటి వారు స్వీయ విధ్వంసానికి పాల్పడితే తప్ప వారిని గద్దె దించడం అంత సులువు కాదు. ఆయన ఎంచుకున్న పులివెందుల మోడల్‌ రాజకీయం వల్ల ఒక వర్గం ప్రజలు ఇప్పటికీ జగన్‌ను గుడ్డిగా సమర్థిస్తున్నారు. అయితే దిద్దుబాటు చర్యలకు విధి స్వయంగా రంగంలోకి దిగింది. దాని ఫలితమే పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రెచ్చగొట్టడం. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వాడిన భాష వివాదాస్పదం కాకపోవడానికి కారణం కూడా వైసీపీ నాయకులే! జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బూతు భాషే అధికార భాషగా మారిపోయింది. అందుకే జనసేనాని వ్యాఖ్యలు పూర్వపక్షమై తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తుల అంశం తెర మీదకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ నోటి వెంట కూడా పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్ల విషయం ప్రస్తావనకు వచ్చింది. ‘‘మూడు పెళ్లిళ్లతో కాదు, మూడు రాజధానుల’’తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్‌ రెడ్డి చలోక్తులు విసురుతున్నారు. మూడున్నరేళ్లు గడిచినా రాష్ర్టానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన మొహమేనా మూడు రాజధానులు నిర్మించేది అని జనం వ్యాఖ్యానించడానికి జగన్‌ మాత్రమే కారణం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారన్నది ముఖ్యం కాదు. అలా అయితే డజనుకు పైగా అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌ ముఖ్యమంత్రి కాగలరా? ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకేదో ఉద్ధరిస్తాడనుకున్న ప్రజలు అమాయకంగా అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు తత్వం బోధపడింది కనుక పవన్‌ కల్యాణ్‌ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారని చూడరు. పవన్‌ కల్యాణ్‌ అన్నట్టుగా ‘‘ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టెప్నీలను మెయిన్‌టెయిన్‌ చేసే’’ వారికంటే చట్టబద్ధంగా విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్న వ్యక్తి కచ్చితంగా మెరుగే. అరగంట, గంట అంటూ మహిళలతో సరసాలాడిన వారికి పదవులు కట్టబెట్టి ప్రోత్సహించిన జగన్‌రెడ్డికి పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్ల గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్‌ కల్యాణ్‌ పెళ్లి గురించి వ్యాఖ్యానించారో లేదో ‘‘మీ చెల్లి రెండు పెళ్లిళ్లు చేసుకోలేదా?’’ అని సోషల్‌ మీడియా వేదికగా జగన్‌పై విమర్శలొచ్చాయి. అయినా మూడు పెళ్లిళ్లకు–మూడు రాజధానులకు ముడిపెట్టి ముందుకు వెళ్లాలని జగన్‌ నిర్ణయించుకున్నట్టున్నారు. అవినీతి ఎన్నికల ఎజెండా కానప్పుడు మూడు పెళ్లిళ్లు ఎన్నికల ఎజెండా ఎలా అవుతుందో జగన్‌కే తెలియాలి. ‘తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట’ అని దివంగత రాజశేఖర్‌ రెడ్డి తరచుగా అనేవారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. తన తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా స్వయంగా తన సోదరుడైన జగన్మోహన్‌ రెడ్డే అడ్డుకుంటున్నారని డాక్టర్‌ సునీత సుప్రీంకోర్టులోనే స్పష్టంచేశారు. ఈ అభిప్రాయంతో సీబీఐ కూడా దాదాపుగా ఏకీభవించింది. తాజాగా జగన్‌రెడ్డి సొంత సోదరి షర్మిల కూడా నోరు విప్పారు. తన చిన్నాన్నను దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని, హంతకులను ఎవరూ కాపాడకూడదని ఆమె స్పష్టంచేశారు. అదే సమయంలో కడప ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఏర్పడిన వివాదం కారణంగానే వివేకా హత్య జరగడం కూడా వాస్తవమేనని షర్మిల కుండబద్దలు కొట్టారు. సొంత చెల్లి కూడా తనను వేలెత్తి చూపడంతో జగన్‌రెడ్డి ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయి ఉంటారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు, మీడియా వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరుతున్న జగన్‌, ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలను కూడా వినవద్దనీ, నమ్మవద్దనీ కోరతారా? సొంత బాబాయిని హత్య చేయించిన వారిని కాపాడుతున్నారన్న ఆరోపణలను సొంత చెల్లి నుంచే ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డి, ప్రజలకు మంచి చేస్తాడని ఎలా నమ్మడం? యథావిధిగా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆ విషయమై నోరు విప్పకపోవచ్చు గానీ వాస్తవం ఏమిటో ప్రజలకు బోధపడింది. సొంత కుటుంబ సభ్యులే తనను దోషిగా చూపించడంపై జగన్మోహన్‌ రెడ్డి ముందుగా సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో చెప్పుకోవచ్చు. వివేకా హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సాఫీగా జరగదని సుప్రీంకోర్టు సైతం అభిప్రాయపడిందంటే జగన్‌ ప్రభుత్వానికి అంతకంటే మచ్చ ఇంకేముంటుంది? తాను మీడియాను నమ్ముకోనని సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్న జగన్‌రెడ్డి అనడం కూడా విడ్డూరమే! దేవుణ్ని మాత్రమే నమ్ముతానని ఆయన చెబుతుంటారు. నిజమే, దేవుడున్నాడు! నిజాలు ఆలస్యంగానైనా బయటకు రాకుండా ఉండవు. అందుకే వివేకా హత్య కేసులో వాస్తవాలు జగన్‌ కుటుంబ సభ్యుల నోటి నుంచే బయటకు వస్తున్నాయి.

తెలంగాణలో మరింత ఘోరం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలే రోతగా తయారయ్యాయి అనుకుంటే తెలంగాణ రాజకీయాలు కూడా నైతికంగా దిగజారిపోతున్నాయి. సాధారణ ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయింపులు జరగడం సాధారణం. ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికల్లో కూడా జంప్‌ జిలానీలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. హుజూరాబాద్‌లో మొదలై ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ ఫిరాయింపులు పరాకాష్ఠకు చేరాయి. పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండదని హుజూరాబాద్‌లో స్పష్టమైనప్పటికీ మునుగోడులో టీఆర్‌ఎస్‌– బీజేపీ పోటీ పడి మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు పక్క చూపులు చూడకుండా డబ్బులు ఇచ్చి మరీ కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. కొంత మంది నాయకులు ఉదయం ఒక పార్టీ కండువా, సాయంత్రం మరో పార్టీ కండువా కప్పుకొని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ మునుగోడు టికెట్‌ తనకు ఇవ్వనందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. నాయకుల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో ఫిరాయింపులను ప్రోత్సహించాలని స్థానిక నాయకులను కేంద్ర నాయకత్వమే ఆదేశిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వారిపై బీజేపీ వల విసురుతోంది. ఈ వలలో బూర నర్సయ్య గౌడ్‌ చిక్కుకోవడంతో ఉలిక్కిపడ్డ టీఆర్‌ఎస్‌ నాయకత్వం, విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌కు నచ్చజెప్పి గులాబి కండువా కప్పారు. టీఆర్‌ఎస్‌లో ఉండిన స్వామిగౌడ్‌ శాసనమండలి చైర్మన్‌గా కూడా చేశారు. పదవీకాలం పూర్తయిన తర్వాత పార్టీ నాయకత్వం తనకు మళ్లీ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. ఇక శ్రవణ్‌ మొదట్లో ప్రజారాజ్యంలో ఉండేవారు. తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇపుడు మళ్లీ టీఆర్‌ఎస్‌ గూటికే చేరారు. ఇదీ పరిస్థితి. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ధన బలం ముందు కాంగ్రెస్‌ పార్టీ వెలవెలబోతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కోపంతో అనేక మంది కాంగ్రెస్‌ నాయకులు మునుగోడులో వెన్నుపోటుకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌ను చంపేయడానికి టీఆర్‌ఎస్‌–బీజేపీ సుపారీ ఇచ్చిపుచ్చుకున్నాయని రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారు గానీ, ఆ పార్టీని సొంత పార్టీ వాళ్లే నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండవచ్చు. రేపు ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో తాము ఎమ్మెల్యేలుగా గెలవాలన్నా కూడా పార్టీ నిలబడాలి కదా! పార్టీపై ప్రజల్లో విశ్వాసం కలిగించాలన్న కనీస స్పృహ కూడా లేకుండా పార్టీలో కొందరు సీనియర్లు శల్య సారథ్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మిగలదని తెలిసి కూడా తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో కూడా ఈ దుస్థితి రావడం విషాదం. కాంగ్రెస్‌ పార్టీ మిగులుతుందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే మునుగోడు ఎన్నిక పుణ్యమా అని తెలంగాణ రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఎన్నికల సందర్భంగా డబ్బు డిమాండ్‌ చేయడం తప్పు కాదు.. అది తమ హక్కు అని ప్రజలు భావించే పరిస్థితి కల్పించారు. దీని ప్రభావం సాధారణ ఎన్నికలపై కూడా ఉండబోతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ధన బలం లేనివాళ్లు, ధనం లేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి నిలబడలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన ధన ప్రభావం ఇప్పుడు తెలంగాణలో అంతకు మించి విస్తరించడం శోచనీయం. డబ్బుల కోసం గంటకో కండువా కప్పుకోవడానికి సిద్ధపడుతున్న నాయకులు తయారైన తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలను పీల్చి పిప్పిచేయడం తథ్యం.

తెలంగాణలో టీడీపీ–బీజేపీ దోస్తీ?

ఈ విషయం అలా ఉంచితే, తెలంగాణలో పునరుజ్జీవం పొందే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారతీయ రాష్ట్ర సమితిని కేసీఆర్‌ ఏర్పాటుచేసుకోవడంతో తెలుగుదేశంతో చేతులు కలపడానికి స్థానిక బీజేపీ నాయకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌–తెలుగుదేశం కలసి పోటీ చేయగా, మళ్లీ ఆంధ్రా వాళ్ల పెత్తనమా? అంటూ తెలంగాణ సెంటిమెంటును రగిలించి కేసీఆర్‌ లబ్ధి పొందారు. ఇప్పుడు ఆయన జాతీయ పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేయాలని అనుకుంటున్నందున తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా విమర్శించే అవకాశాన్ని కేసీఆర్‌ కోల్పోయారు. ఈ పరిణామంతో బీజేపీ– తెలుగుదేశం పార్టీలు జతకట్టే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. 2014 తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న తెలుగుదేశం మాజీ నాయకులు మళ్లీ టీడీపీలో చేరి బీజేపీతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొద్ది మంది తాజా ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే నష్టపోయేది టీఆర్‌ఎస్‌ మాత్రమే. ఆంధ్రా మూలాలు కలిగి ఉండి తెలంగాణలో నివసిస్తున్న అత్యధికులు తెలుగుదేశం పార్టీకి దూరమై ప్రస్తుతం టీఆర్‌ఎస్‌తో ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పార్టీ జతకడితే ఆ వర్గాలన్నీ తిరిగి తెలుగుదేశానికి చేరువవుతాయని అంచనా వేస్తున్నారు. గవర్నమెంటు ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంలో ఆంధ్రా మూలాలు కలిగిన వారికి ఒక్కరికి కూడా కేసీఆర్‌ ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడం సెటిలర్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునరుజ్జీవింపజేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. ముదిరాజ్‌లలో అంతో ఇంతో పట్టు ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ ఇటీవల చంద్రబాబునాయుడిని కలసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తంచేశారు. త్వరలోనే మరికొందరు ఈ బాటలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ధన బలంపై ఆధారపడటంతో పాటు ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక తెచ్చి అధికారం నిలబెట్టుకోవచ్చునని భావిస్తున్న కేసీఆర్‌కు ఈ పరిణామం మింగుడు పడకపోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మరింత బలహీనపడితే బీజేపీ–తెలుగుదేశం కలయిక కేసీఆర్‌కు ముప్పుగా మారుతుంది. బీజేపీలో నేరుగా చేరడానికి సుముఖంగా లేని కొంత మంది ఇతర నాయకులు కూడా బీసీలలో ఇప్పటికీ ఆదరణ కలిగివున్న తెలుగుదేశం పార్టీలో చేరే విషయం ఆలోచిస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాలను ఎటు మలుపు తిప్పుతుందో వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - 2022-10-23T04:41:00+05:30 IST