నేపాల్ లో కొత్త సర్కార్

ABN , First Publish Date - 2022-11-29T02:17:13+05:30 IST

నేపాల్ లో ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు ఆరంభమైన వారం తరువాత ఫలితాల్లో స్పష్టత వచ్చింది. ప్రస్తుత ప్రధాని, పాలకపక్ష నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన షేర్ బహదూర్ దేవ్ బా మరోమారు...

నేపాల్ లో కొత్త సర్కార్

నేపాల్ లో ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు ఆరంభమైన వారం తరువాత ఫలితాల్లో స్పష్టత వచ్చింది. ప్రస్తుత ప్రధాని, పాలకపక్ష నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన షేర్ బహదూర్ దేవ్ బా మరోమారు ప్రధాని అవుతున్నారు. నేపాలీ కాంగ్రెస్ అత్యధిక స్థానాలతో అతిపెద్దపార్టీగా అవతరించడమే కాక, ఆ పార్టీ నాయకత్వంలోని ఐదు పార్టీల సంకీర్ణం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. గత ఐదుసంవత్సరాలుగా తీవ్ర రాజకీయ అనిశ్చితిని చవిచూసిన నేపాల్ లో, దేవ్ బా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం పొరుగుదేశమైన భారత్ కు పెద్ద ఉపశమనం.

పార్లమెంటుకు, ఏడు అసెంబ్లీలకు ఒకేమారు ఎన్నికలు జరిగిన నేపాల్ లో ఇంకా ఎనిమిది పార్లమెంటరీ స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎన్నికలు జరిగిన 165 సీట్లలో ఇప్పటివరకూ, ఐదుపార్టీల అధికార కూటమి 87 స్థానాలు గెలుచుకుంటే, నేపాలీ కాంగ్రెస్ 53 స్థానాలతో అగ్రస్థానంలో ఉంది. కూటమిలో ప్రధాన భాగస్వామి, పుష్పకుమార్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ మావోయిస్టు 17 స్థానాలు గెలుచుకుంది. మాధవ్ నేపాల్ నేతృత్వంలోని సీపీఎన్ యూనిఫైడ్ సోషలిస్టు 10స్థానాలు, మరో రెండు పార్టీలు మిగతా స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు- లెనినిస్టు) నేతృత్వంలోని విపక్ష కూటమి 56 స్థానాలు సాధించింది. నేపాల్ పార్లమెంటులోని దిగువసభలో మొత్తం 275 స్థానాలు ఉంటే, 165మందిని ప్రజలు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటే, ఆయా పార్టీలు సంపాదించిన ఓట్ల సంఖ్య ఆధారంగా నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో మరో 110 స్థానాల్లో సీట్ల భర్తీ జరుగుతుంది. తదనుగుణంగా, ఈ స్థానాల్లో కూడా కనీసం సగం దక్కుతాయి కనుక, దేవ్ బా కూటమి 138 స్థానాల కనీస మెజారిటీ గీత సునాయసంగా దాటగలదు. కేపీ శర్మ ఓలీ కూటమినుంచి ఒక పక్షం ఇటువైపు మళ్ళే అవకాశాలున్నందున అధికారపక్ష కూటమి మరింత బలపడే అవకాశం ఉంది.

ఐదేళ్ళక్రితం నేపాల్ ప్రజలు పట్టంకడితే, ఓలి, ప్రచండ వర్గాలు పరస్పరం కత్తులు దూసుకొని ఓ మంచి అవకాశాన్ని కోల్పోయాయి. అంతర్యుద్ధం ముగిసి, రాజరికం పోయి, ప్రజాస్వామ్యవ్యవస్థ ఏర్పడి సుదీర్ఘకాలమైనా, ఇప్పటివరకూ ఒక్క ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో ఉండలేదు. ప్రచండను పక్కనబెట్టి తానే సర్వాధికారాలూ అనుభవించాలన్న కేపీ శర్మ ఓలీ అధికారదాహం వారి మధ్య ఎడబాటుకు కారణమై నేపాలీ కాంగ్రెస్ పునరాగమనానికి కారణమైంది. ఇక, ఈ ఎన్నికల్లో కొన్ని చిన్నచితకా పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. టెలివిజన్ రంగానికి చెందిన రబి లామిచనీ నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. ఫెడరల్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, అసెంబ్లీలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్న ఈ పార్టీకి అన్ని స్థానాలు రావడం ప్రధాన పార్టీలు ఆదరణ కోల్పోతున్నాయనడానికి సూచన. కమ్యూనిస్టులకు, మధేశీలకు కూడా ఈ ఎన్నికలు గుణపాఠమే. రాజ్యాంగరూపకల్పనలో కీలకభూమిక నిర్వహించి, అన్ని వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడిన శక్తులు ఈ ఎన్నికల్లో బలహీనపడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఉన్నత స్థాయిలో అధికారంకోసం కుమ్ములాడుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో అధికార వికేంద్రీకరణకు తగిన కృషిజరగలేదని ఈ ఫలితాలు తెలియచెబుతున్నాయి. నేపాలీ యువతరం కొత్త పార్టీలవైపు మొగ్గుచూపుతున్న విషయాన్ని అధికారంలోకి వచ్చిన కూటమి గుర్తుపెట్టుకొని, నిరుద్యోగం సహా యువతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేయవలసి ఉంటుంది. నేపాలీ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం భారతదేశానికి కాస్తంత ఉపశమనం కలిగించే అంశమే అయినప్పటికీ, అధికార కూటమిలో ఉన్న ప్రచండ, బలమైన విపక్షం కాబోతున్న ఓలి వ్యవహారశైలి అంత సులువుగా కొరుకుడుపడేది కాదు. నేపాల్ ప్రజలు కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు, వారు కోరుకున్న మార్పును, అభివృద్ధిని సాధించిపెట్టడం కొత్త ప్రభుత్వం బాధ్యత.

Updated Date - 2022-11-29T02:17:18+05:30 IST