కొత్త బాధ్యతలు, పాత సమస్యలు
ABN , First Publish Date - 2022-11-17T03:18:30+05:30 IST
ఇండోనేషియా నుంచి భారతదేశం జి20 సారథ్యాన్ని స్వీకరించింది. బాలిలో రెండురోజులపాటు జరిగిన ఇరవై దేశాల సదస్సులో, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి...
ఇండోనేషియా నుంచి భారతదేశం జి20 సారథ్యాన్ని స్వీకరించింది. బాలిలో రెండురోజులపాటు జరిగిన ఇరవై దేశాల సదస్సులో, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ కొత్త బాధ్యత అందుకున్నారు. వచ్చే ఏడాది అధ్యక్షహోదాలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లతో పాటు దానికి సంబంధించిన లోగోను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లోగోలో అధికారపక్షానికి చెందిన కమలం కూడా ఉండటంమీద విమర్శలు రేగిన విషయం తెలిసిందే. ఒకపక్క ‘వసుధైవ కుటుంబకం’ అంటూ, మువ్వన్నెలూ వాడుతూ, మీ పువ్వు ఏకంగా భూగోళాన్నే మోస్తున్నట్టు లోగో తయారుచేసుకోవడమేమిటన్నది విపక్షాల ప్రశ్న. శాంతికీ, జ్ఞానానికీ, ఆరోగ్యానికీ, ఆధ్యాత్మికతకూ, ఆశాభావానికీ కమలం ప్రతీక అంటూ బీజేపీ వాదించింది. ఇది కేవలం లోగో కాదనీ, మన నరనరానా ప్రవహిస్తున్న భావోద్వేగానికి, సరికొత్త సంకల్పానికీ ప్రతీక అని మోదీ చెప్పారు.
కష్టకాలంలో వచ్చిపడిన ఈ కొత్త బాధ్యతలతో పుట్టుకొచ్చే సమస్యలు ఎలా ఉంటాయన్నది అటుంచితే, బాలిలో జరిగిన జి20 సదస్సునుంచి మిగతా ప్రపంచం పెద్దగా ఆశించింది ఏమీ లేదు. ఇరవై దేశాధినేతలంతా ఫోటోషూట్ కోసం ఒకచోట చేరతారనీ, ఒక కార్యాలయం, సిబ్బంది, నిర్ణయాల అమలు ఆయా దేశాల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడివున్న ఈ గ్రూప్ వల్ల పెద్ద ప్రయోజనం లేదని పెదవివిరిచేవారు ఎక్కువే. పైగా, ఈ మారు ఉక్రెయిన్ యుద్ధం సదస్సును రష్యా అనుకూల వ్యతిరేకశక్తుల మధ్య నిలువునా చీల్చినందున గతంలో ఉపరితలంలో కనిపించే సుహృద్భావం కూడా ఉండదని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, సదస్సు ముగింపు సందర్భంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేయగలగడం విశేషమే. ఇది యుద్ధాల యుగం కాదనీ, యుద్ధం యావత్ ప్రపంచానికి ఆర్థిక సమస్యలనూ, అభద్రతనూ తెచ్చిపెడుతున్నదనీ, అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన హెచ్చరికలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఓ సంయుక్త ప్రకటన వెలువడటం మానవాళికి మంచిదే. కానీ, ‘చాలా సభ్యదేశాలు’ అని ఈ ప్రకటన ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి యుద్ధాన్ని ఖండించే విషయంలో సభ్యదేశాలన్నీ ఏకమాటమీద లేవని అర్థమవుతూనే ఉంది. భారతదేశం ఈ సంయుక్త ప్రకటన రూపకల్పనలో కీలకపాత్ర పోషించిందని అంటున్నారు. సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్ లో జరిగిన షాంఘై సహకార సంఘం సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ నేరుగా రష్యా అధ్యక్షుడిని ఉద్దేశించి ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అన్నవ్యాఖ్య ఈ ప్రకటనలో చోటుచేసుకోవడం విశేషం. తమ ప్రసంగాల్లో ఎవరు ఎంత ఘాటుగా మాట్లాడినా, అంతిమంగా జాగ్రత్తగా, ఏర్చికూర్చిన మాటలతో ఈ సంయుక్త ప్రకటన తయారైన విషయం అర్థమవుతూనే ఉంది. రష్యా దూకుడు విషయంలో పాశ్చాత్యదేశాల ఆందోళనను తెలియచెప్పడంతో పాటు, మిగతా ప్రపంచం పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో, రష్యాను అష్టదిగ్బంధనం చేయడం సరికాదన్న ధ్వని కూడా ఈ ప్రకటనలో ఉన్నది. రష్యాకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలనడం ద్వారా కొంత సానుకూల వాతావరణాన్ని సృష్టించి, భవిష్యత్తులో చర్చలకు దారులు పరిచారని కూడా అంటున్నారు. కీలకమైన తైవాన్ విషయంలో ముందడుగు పడకపోయినా, అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య తొలిరోజునే జరిగిన సమావేశం వైరాన్ని కాస్తంత చల్లార్చేందుకు ఉపకరిస్తుంది. లద్దాఖ్ లో చైనా దురాక్రమణ తరువాత, ఉభయదేశాల మధ్యా వేడిపుంజుకున్న నేపథ్యంలో తొలిసారిగా చైనా అధ్యక్షుడితో మోదీ కరచాలనం చేయడం, నవ్వుతూ నాలుగుమాటలు చెప్పడం ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. బ్రిటన్ కొత్త ప్రధాని రిషీ సునాక్ ను మోదీ కలుసుకోవడం ఇదే ప్రథమం. అమెరికా అధ్యక్షుడితోనూ కరచాలనాలు, అప్యాయతతో కూడిన ఆలింగనాలు చూడముచ్చటగా ఉన్నాయి.
జీ20 బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, భారతదేశం గ్లోబల్ స్థాయిలో విశేషమైన మార్పులకు ఒక వాహకంగా పనిచేస్తుందని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మీ మధ్యనే ఓ ఉగ్రవాది ఉన్నాడు అంటూ రష్యాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు దులిపేసిన ఈ గ్రూప్ కు ఏడాదిపాటు సారథ్యం వహిస్తున్న భారత్ మీద యుద్ధాన్ని అంతం చేసే విషయంలో మిగతా ప్రపంచానికి కొన్ని ఆశలున్నాయి. మోదీ ప్రసంగంలోనూ ఇది పరోక్షంగా ధ్వనించింది. వచ్చే ఏడాది భారత్ లో జరిగే సదస్సుకు చైనా అధ్యక్షుడు కూడా వస్తారంటున్నందున ఉభయదేశాలమధ్యా అంతలోగా కాస్తంత సుహృద్భావానికి అవకాశం ఉన్నది. తీవ్ర ఆర్థికమాంద్యంలోకి యావత్ ప్రపంచమూ కుంగిపోతున్నదని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భారత్ తన మధ్యవర్తిత్వంలో యుద్ధాన్ని నివారించి, అంతర్జాతీయస్థాయిలో ఆర్థిక సహకారానికీ, పర్యావరణ పరిరక్షణకూ మేలుబాటలు వేయగలిగితే ఈ ఏడాది సారథ్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది.