తవాంగ్ లో కొత్త తంటా!

ABN , First Publish Date - 2022-12-14T01:14:06+05:30 IST

మొదట డోక్లామ్, తరువాత గాల్వాన్, ఇప్పుడు తవాంగ్. భారత్ చైనా సైనికుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో స్థాయీ భేదాలు ఉండవచ్చును కానీ, సందేశం ఒక్కటే...

తవాంగ్ లో కొత్త తంటా!

మొదట డోక్లామ్, తరువాత గాల్వాన్, ఇప్పుడు తవాంగ్. భారత్ చైనా సైనికుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో స్థాయీ భేదాలు ఉండవచ్చును కానీ, సందేశం ఒక్కటే. ముప్పైనెలలుగా లద్దాఖ్ లో కొనసాగుతున్నదానిని ఇప్పుడు చైనా మరొకదిక్కుకు విస్తరించింది. ఐదారువందలమంది చైనా చైనికులు గీత దాటి, సరిహద్దులుచెరిపేసే ప్రయత్నాన్ని భారత సైనికులు వమ్ముచేసినందుకు వారిని అభినందించాల్సిందే. గాల్వాన్ మాదిరిగా తీవ్రమైన హింసాకాండ జరగకుండా తోపులాటలతో, స్వల్పగాయాలతో ఘర్షణ ముగిసినందుకూ సంతోషించాల్సిందే. ఈ ఘటనమీద పార్లమెంటులో విస్తృతమైన చర్చ జరిగివుంటే, ఇప్పుడు చైనా కన్ను తవాంగ్ మీదకు ఎందుకు మళ్ళిందో, మొత్తంగా భారత్ చైనా సరిహద్దుల గుండా రేగుతున్న, సాగుతున్న ఉద్రిక్తతల నివారణకు ప్రభుత్వం ఏమి చేయబోతున్నదో ప్రజలకు కాస్తంత తెలిసేది.

ఇదేమీ, 1962 కాదు, దీటైన జవాబు ఇస్తామని అరుణాచల్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్నది మోదీ ప్రభుత్వమనీ, భారత భూభాగంలోని ఒక్క అంగుళం కూడా చైనాకు పోనవ్వబోమనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. జాకీర్ నాయక్ సంస్థకు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూ చైనా నుంచి అందిన విరాళాల ఊసు చర్చకు రాకుండా నిరోధించడానికే హిమాచల్ లో చైనా చొరబాట్లమీద చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబట్టిందంటున్నారు అమిత్ షా. పనిలోపనిగా నెహ్రూను కూడా మరోమారు స్మరించుకుంటూ, చైనామీద నెహ్రూకున్న అమిత ప్రేమవల్లనే భారతదేశం భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వాన్ని పొందే అవకాశం కోల్పోయిందన్నారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ ఇచ్చిన వివరణ విని ఊరుకోవాలే తప్ప, ఎదురు ప్రశ్నలు వేయకూడదనీ, సున్నితమైన విషయం కనుక చర్చకూడదని రాజ్యసభాధిపతి ప్రకటించినందుకు విపక్షం అలిగి సభనుంచి వెళ్లిపోయింది.

1962లో పార్లమెంటు ఏకంగా యుద్ధం మీదే అద్భుత చర్చ చేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్న విషయాన్ని అటుంచితే, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏమి చేయబోతున్నామన్నకంటే, విషయాన్ని రాజకీయం చేయడం మన నాయకులకు ప్రధానం.

సరిహద్దుల్ని చెరిపేసే చైనా ప్రయత్నాలు వెస్ట్రన్ సెక్టార్ కు మాత్రమే పరిమితం కాబోవనీ, ఈస్ట్రన్ సెక్టార్ మీద కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం భారత్ కు ఉన్నదని రక్షణరంగ నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. రోడ్లు, రైళ్ళు ఇత్యాది మౌలిక సదుపాయాల విస్తరణతో, మానవ ఆవాసాలతో, సైనిక వ్యవస్థల ఏర్పాటుతో చైనా ఈ దిక్కున కూడా వేగంగా విస్తరిస్తున్నది. ఉభయదేశాల మధ్య ఉన్న ఒప్పందాలు, అవగాహనల వల్ల ఈ ప్రాంతాల్లో సాయుధ పహారా లేకపోవచ్చును కానీ, తుపాకులు లేకుండా కూడా ఎంతటి తీవ్ర ఘర్షణ జరగవచ్చునో, ఎంతమంది సైనికులు మరణించవచ్చునో గాల్వాన్ ఘటన చెబుతున్నది. ఉద్రిక్తతలు పెరుగుతున్నకొద్దీ పరస్పరం నెట్టుకోవడం స్థానంలో రాళ్ళు, కర్రలు, పదునైన వస్తువులతో కొట్టుకోవడం వరకూ పరిస్థితి వస్తుందని గాల్వాన్ నిరూపించింది. భవిష్యత్తులో తవాంగ్ లోనూ ఇది జరగవచ్చును. ఆయుధాలు లేకుండా కూడా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నప్పుడు, ఒప్పందాలకు మాటమాత్రంగా కట్టుబడినట్టే తప్ప వాటి అసలు స్ఫూర్తి దెబ్బతిన్నట్టే. ఉభయదేశాల మధ్య సత్సంబంధాలకు సరిహద్దు తగాదాలు కీలకమని మనదేశం అంటుంది. వాటి ఊసెత్తకుండా, ఉభయుల మధ్యా మరింత సానుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవాలని చైనా చెబుతూ ఉంటుంది.

దశాబ్దాలనాటి అవగాహనలు, ఒప్పందాలు క్రమంగా వీగిపోతూ, రెండుదేశాల మధ్యా ఒక్క బుల్లెట్ కూడా పేలని కాలం వేగంగా గతించిపోతున్నది. మోదీ రాక తరువాత అమెరికాతో ఆలింగనాల వరకూ హెచ్చిన మన సాన్నిహిత్యం, క్వాడ్ కూటములు, సంయుక్త యుద్ధవిన్యాసాలతో అమెరికా పక్షాన చైనా దూకుడుకు కళ్ళెం వేయాల్సిన బాధ్యతలు, స్వదేశంలో ప్రశ్నించేవారినీ, ప్రత్యర్థులను మట్టుబెట్టి ఒక నియంతగా అవతరించిన చైనా అధ్యక్షుడి ప్రపంచాధిపత్య కాంక్షలు కలసికట్టుగా ఈ పరిస్థితులను తెచ్చిపెట్టాయి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా పాలకులకు సైనికుల త్యాగాలు గుర్తుకొస్తాయి, విపక్షాల ప్రశ్నలు వారిని అవమానించడంగా కనిపిస్తాయి. సామాజిక మాధ్యమాల్లో దేశభక్తి ఉప్పొంగి చైనా వస్తు బహిష్కరణ సందేశాలు వెల్లువెత్తుతాయి. కానీ, వరుస దురాక్రమణలతో అక్రమంగా వేలాది చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని దోచేస్తూనే, ఎగుమతులను కూడా అది ద్విగుళం బహుళం చేయగలుగుతున్నది.

Updated Date - 2022-12-14T01:14:11+05:30 IST