పాలకుల పాశుపతాస్త్రం ఈడీ

ABN , First Publish Date - 2022-11-30T00:56:49+05:30 IST

ఒకదేశం విజయవంతమవుతుందో, విఫలమవుతుందో ఆ దేశంలోని సంస్థల నాణ్యత నిర్ధారిస్తుందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు దరాన్ ఆసెమొగ్లు, జేమ్స్ రాబిన్సన్ తమ పుస్తకం...

పాలకుల పాశుపతాస్త్రం ఈడీ

ఒకదేశం విజయవంతమవుతుందో, విఫలమవుతుందో ఆ దేశంలోని సంస్థల నాణ్యత నిర్ధారిస్తుందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు దరాన్ ఆసెమొగ్లు, జేమ్స్ రాబిన్సన్ తమ పుస్తకం ‘దేశాలు ఎందుకు విఫలమవుతాయి?’ (వై నేషన్స్ ఫెయిల్)లో రాశారు. సంస్థలు, వ్యవస్థలు మాత్రమే ఒక దేశ అభివృద్ధి సూచికలని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియనిది కాదు. నీతి ఆయోగ్ను ఏర్పర్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు పెట్టుబడి, శ్రమశక్తిపై అభివృద్ధి ఆధారపడి ఉండేది, కాని ఇవాళ సంస్థల నాణ్యత, ఆలోచనలపై అభివృద్ధి ఆధారపడి ఉన్న’దని అన్నారు. ఎనిమిది సంవత్సరాల మోదీ పాలనను సమీక్షిస్తే నీతి ఆయోగ్ తో పాటు అనేక సంస్థల నాణ్యత పెరిగిందా, లేక దిగజారిందా, తన నాణ్యత, ఆలోచనల ద్వారా ఈ సంస్థలు దేశ అభివృద్ధికి దోహదం చేశాయా అన్న ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉన్నది. 2022 కల్లా దేశంలో పేదరికం, మురికి, అవినీతి, కులతత్వం, మతతత్వం మటుమాయమవుతాయని 2017లో పదవీ బాధ్యతలు చేపట్టిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తూ చెప్పారు. కాని ఒక రోజు ఆయన ఉన్నట్లుండి ఎలాంటి కారణాలు చెప్పకుండా రాజీనామా చేశారు. గత ఎనిమిదేళ్లలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్లు ముగ్గురు మారారు. కానీ నీతి ఆయోగ్ మూలంగా దేశానికి ఏ ప్రయోజనం కలిగిందో సంతృప్తికరంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. నీతి ఆయోగ్ తన లక్ష్యాల్లో ఒకటిగా చెప్పుకున్న సహకార సమాఖ్య విధానం ఏమాత్రం అమలు కావడం లేదని అనేక ప్రాంతీయ పార్టీల నేతలు తరుచూ విమర్శిస్తునే ఉన్నారు.

నీతి ఆయోగ్ మాత్రమే కాదు, దేశంలో అనేక సంస్థల పనితీరు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. ఇటీవల అరుణ్ గోయెల్ అనే అధికారిని ఆగమేఘాలపై ఒకే రోజు స్వచ్ఛంద పదవీవిరమణ చేయించి అదే రోజు ఆయనను ఎన్నికల కమిషనర్గా నియమించిన తీరును సుప్రీంకోర్టు గత వారం ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికపై ఆయనను మెరుపు వేగంతో ఎన్నికల కమిషనర్గా నియమించారని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ మిశ్రాను పదవీవిరమణ అనంతరం కూడా కొనసాగిస్తున్న తీరుపై కూడా సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది. తన లక్ష్యాలకు తగ్గట్లు పనిచేస్తున్న సంజయ్ కుమార్ మిశ్రాను ఈడీ డైరెక్టర్గా కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఏ నిబంధననైనా ప్రక్కన పెట్టేందుకు సిద్ధపడిందన్న విషయం స్పష్టం అయింది. నిజానికి గత ఏడాదే మిశ్రా పదవీకాలం పూర్తయింది. అయినప్పటికీ ఆర్డినెన్స్ చేసి మరీ ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నదని తెలిసీ ఆయన పదవీకాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుంచీ ఆర్థిక నేరాలు సహజంగానే పెరుగుతున్నాయి. వేల కోట్ల విలువైన మనీలాండరింగ్ కేసులు, సైబర్ నేరాలు, ఉగ్రవాదులు, వైట్ కాలర్ క్రిమినల్స్కు సంబంధించి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ఆర్థిక నేరాలకు సరిహద్దులు లేకుండా పోయాయి. ఆర్థిక నేరస్థులను కటకటాల వెనక్కి నెడతామన్న హామీతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ తరుచూ ఈ విషయంలో ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు కాని ఆచరణలో ఆర్థిక నేరాలకు పాల్పడి శిక్షపడ్డ వారి సంఖ్య తక్కువే. ఆర్థిక నేరాలను విచారించి, శిక్షించే సంస్థలను ప్రతిపక్షాలను, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలను మోదీ ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి ఈడీకి ఇచ్చినంత ప్రాధాన్యత మరే సంస్థకూ ఇవ్వడం లేదు. ఆగస్తా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల ముడుపుల కేసు నంచి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారి కేసుల వరకు ఈడీ వద్ద ఎన్నో కేసులు పేరుకుపోయాయి. అయితే వీటన్నిటికన్నా అత్యధిక ప్రాధాన్యత రాజకీయ కేసులకే ఈడీ ఇస్తున్నట్లు కనపడుతోంది.

గత వారం శివసేన నేత సంజయ్ రౌత్కు బెయిల్ మంజూరు చేసిన ముంబైలోని ‘మనీలాండరింగ్ నిరోధక చట్టం’ (పిఎంఎల్ఏ) క్రింద కేసులు విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంజి దేశ్ పాండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ రౌత్ను మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేయడం అక్రమమని, ఆయన హక్కుల్ని కాలరాశారని, అన్యాయంగా ఆయనను కక్ష సాధింపుతో వేటాడుతున్నారని ముంబై ప్రత్యేక కోర్టే వ్యాఖ్యానించింది, నిజానికి ఒక ప్రభుత్వ ఇళ్ల కాలనీ అభివృద్ధికి సంబంధించిన కేసులో వేయి కోట్లకు పైగా మోసాలు చేసిన ప్రధాన నిందితులైన రియల్ ఎస్టేట్ యజమానులు రాకేశ్, సారంగ్ వాధ్వాన్లను ఈడీ ఇప్పటివరకూ అరెస్టు చేయనే లేదని వారి నుంచి సంజయ్ రౌత్ సహచరుడు ప్రవీణ్ రౌత్ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణపై మాత్రం వేగంగా వ్యవహరించారని కోర్టు ఎత్తిచూపింది. ప్రవీణ్ రౌత్ను ఒక సివిల్ వివాదంలో అరెస్టు చేస్తే సంజయ్ రౌత్ను అకారణంగా అరెస్టు చేశారని కోర్టు స్పష్టం చేసింది. పిఎంఎల్ఏ సెక్షన్ 19 క్రింద వారిని అరెస్టు చేయడానికి కారణాలే లేవని, సివిల్ వివాదంలో ఈడీ ఎలా అరెస్టు చేస్తుందని కోర్టు ప్రశ్నించింది.

కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంలో చూపినంత ఉత్సాహం ఈడీ విచారణను పూర్తి చేయడంలో చూపడం లేదని ముంబై మనీలాండరింగ్ ప్రత్యేక కోర్టే వ్యాఖ్యానించడం గమనార్హం. 2008లో పిఎంఎల్ఏ క్రింద నమోదైన తొలి కేసుకు సంబంధించి ఇంతవరకూ ఆరోపణలనే ఖరారు చేయలేకపోయామని కోర్టు తెలిపింది. 2008 నుంచి 2022 వరకు ఈడీ పిఎంఎల్ఏ క్రింద ముంబై ప్రత్యేక కోర్టులో దాదాపు 80 కేసులు దాఖలుచేస్తే కేవలం మూడు కేసులే పరిష్కారమయ్యాయి. ఈ మూడు కేసుల్లో కూడా నిందితులపై ఎలాంటి సాక్ష్యాలు లేవని వదిలేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పర్చిననాటి నుంచీ ఒక్కకేసులో కూడా ఈడీ సాక్ష్యాలను నమోదు చేయలేకపోయిందని, అందువల్ల ఒక్క తీర్పు కూడా వెలువడలేదని కోర్టు తెలిపింది. డిశ్చార్జి పిటీషన్లకు సమాధానం ఇచ్చేందుకు కూడా ఈడీ ఏడాదిన్నర కాలం తీసుకున్న సందర్భాలున్నాయని డిఫెన్స్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కూడా ప్రజాప్రతినిధులపై ఈడీ, సిబిఐ దాఖలు చేసిన కేసుల దర్యాప్తు, విచారణల విషయంలో జరుగుతున్న జాప్యంపై తీవ్రఆందోళన వ్యక్తం చేశారు. ‘10, 15 సంవత్సరాలు దాటినా ఛార్జిషీట్లను దాఖలు చేయకపోవడానికి ఎలాంటి కారణాలు చూపడం లేదు, కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదు’ అని జస్టిస్ రమణ నాడు వ్యాఖ్యానించారు.

2021–22లో అత్యధిక స్థాయిలో 1180 మనీలాండరింగ్, 5,313 విదేశీమారక ద్రవ్య ఉల్లంఘన కేసులను, గత మూడేళ్లలో 11,420 పైగా కేసుల్ని ఈడీ నమోదు చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు చెప్పారు. వీటిలో ఎన్ని విచారణ స్థాయికి చేరుకున్నాయి? తాము వేల సంఖ్యలో దాడులు చేసినా కేవలం 23 మందికే శిక్ష పడిందని ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా అంగీకరించింది. రాజకీయ జోక్యమే అందుకు కారణమా? లేక ఈడీని ప్రభుత్వం కేవలం బూచిగా వాడుకుంటోందా?

ఇవాళ దేశ రాజకీయాలను ఈడీయే శాసిస్తోందని ఆ సంస్థ జరుపుతున్న దాడులను బట్టి అర్థమవుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో చూసినా ఈడీ స్వైరవిహారం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని అబ్దుల్ కలామ్ మార్గ్లోని ప్రవర్తన్ భవన్లో అత్యంత ఆధునిక, సాంకేతిక సౌకర్యాలతో పనిచేస్తున్న ఈడీ చేతుల్లో ఇప్పటికే దేశంలో అనేకమంది చిట్టాలున్నాయి. దేశంలో 2100కి పైగా కార్యాలయాలు ఉన్నా, 1700 మందికి పైగా అధికారులు ఉన్నా తమకు సిబ్బంది చాలడం లేదని, తమ కార్యాలయాలను 6వేలకు పెంచాలని ఈడీ కేంద్ర ఆర్థిక శాఖకు ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ప్రతి రాష్ట్ర రాజధానిలో ఒక జోనల్ కార్యాలయం నెలకొల్పుతామని, పెద్ద రాష్ట్రాల్లో రెండు జోనల్ కార్యాలయాలను నెలకొల్పాల్సి ఉన్నదని ఈడీ దరఖాస్తు పెట్టుకుంది. ఈడీ దరఖాస్తును కనుక కేంద్రం అంగీకరిస్తే ఇది సిబిఐ కంటే పెద్ద సంస్థగా అవతరిస్తుంది. సంజయ్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ఆధునిక సిబిఐగా అవతరించిన ఈడీ దేశ నలుమూలల్లో విస్తరిస్తే అది రాజకీయాల్లో ఎంత కల్లోలం సృష్టిస్తుందో ఊహించాల్సిందే!

ఇప్పటికే పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ ప్రతి పక్షాలు ఈడీ దాడులపై గగ్గోలు పెడుతూ సభలను స్తంభింపచేస్తున్నాయి. తాను బిజెపిలో ఉన్నందుకు తనను ఎవరూ వేటాడలేరని సంగ్లి ఎంపి సంజయ్ పాటిల్ అంటే, బిజెపిలో చేరిన తర్వాత తాను బాగా నిద్రపోగలుగుతున్నానని మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన హర్షవర్ధన్ పాటిల్ చమత్కరించారు. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఈడీ రంగ ప్రవేశం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అటువంటప్పుడు దేశంలో ఎన్నికలు ఎందుకు జరుగుతున్నట్లు? సంస్థలు, వ్యవస్థల దుర్వినియోగం విషయంలో గతంలో కాంగ్రెస్ కూడా అనేక అక్రమాలకు పాల్పడిందనడాన్ని కాదనలేము. కాని ఇప్పుడు ఈ దుర్వి నియోగం పరాకాష్ఠకు చేరుకున్నది. అటువంటప్పుడు మన దేశంలో వ్యవస్థలు ఏ విధంగా బాగుపడాలి?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-11-30T00:57:01+05:30 IST