రామగుండం: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2022-11-10T01:56:03+05:30 IST
మునుగోడు ముగిసిపోలేదు. బహుశా, అది సాల్వడార్ డాలీ గడియారంలా కరిగిపోతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రవహిస్తూ ఉంటుంది. పులిమీద స్వారీ ఆపలేనట్టే, యుద్ధం కూడా ఆపలేము...
మునుగోడు ముగిసిపోలేదు. బహుశా, అది సాల్వడార్ డాలీ గడియారంలా కరిగిపోతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రవహిస్తూ ఉంటుంది. పులిమీద స్వారీ ఆపలేనట్టే, యుద్ధం కూడా ఆపలేము. అబద్ధపు యుద్ధమైనా, శుద్ధమైన యుద్ధమైనా.
ప్రతి ఫలితానికి పర్యవసానాలు చాలా ఉంటాయి, గుణపాఠాలూ ఉంటాయి. ఎవరూ ఒప్పుకోరు, వెనక్కి తిరిగి చూసుకోరు, తమలోకి తాము కూడా చూసుకోరు. నిజాన్ని ఎదుర్కోవాలంటే భయం. సత్యాన్ని దాచిపెట్టి ఇతరులను, తమను కూడా మభ్యపెట్టుకుంటారు. అంకెలు అడ్డుపెట్టుకుని అడ్డగోలు వాదనలు చేస్తారు. ధైర్యాన్ని అభినయిస్తారు. అరచేతుల్లో రేపటి అద్భుత విజయాలను ప్రదర్శిస్తారు. ఉన్నమాట చెబితే ఉలికి పడతారు.
ఈ విన్యాసాలు అవసరం కాబట్టే, అతి సులభ సూత్రీకరణలూ, అతి గంభీర వాదనలూ రంగం మీదకు వస్తున్నాయి. ఇది ఐదువేలకూ, నాలుగువేలకూ నడుమ జరిగిన పోటీ అని, అంతకు మించి మరేమీ లేదని ఒకరు అంటారు. ఇది మతతత్వ నిరంకుశ కేంద్రప్రభుత్వానికి, ప్రజాస్వామిక సెక్యులర్ రాష్ట్రప్రభుత్వానికి జరిగిన యుద్ధమని మరొకరు అంటారు. సత్యం ఈ రెంటి మధ్య ఉన్నదా, ఈ రెంటికి దూరంగా మరెక్కడో ఉన్నదా? సత్యానంతర కాలంలో ఈ ప్రశ్నలకు అర్థమే లేదా? గెలిచినవారు గెలిచిన మాట నిజమే కానీ, అదేమంత గెలుపు కాదని, ఓడినవారి ఓటమి ఏమంత ఓటమి కాదని సాధారణ జనం కూడా అనుకుంటున్నప్పుడు, ఆత్మవిమర్శలు చేసుకోవడం కష్టమే. వాస్తవం చెప్పి పలచన కాలేరు, చేజిక్కిన గెలుపును చూపి, రేపు ఎల్లుండి కూడా ఇదే గెలుపు సాధి స్తామని చెప్పుకోవడం, ఓడినవారిని ఓడినందుకు గేలిచేయడం మనుగడకు అవసరం.
ఓడిపోయినవారి పరిస్థితి ఇంకా క్లిష్టం. తుది ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకపోతే, వారి అడుగు ముందుకుపడినట్టే లెక్క. కానీ, ఆ సారాంశపు గెలుపును దిగమింగుకోవాలి, నైతికవిజయమని పేలవపు మాటలు మాట్లాడాలి. సాధారణంగా, ఏ కుస్తీలో అయినా, గోదాలో గెలుపోటములు జరిగిపోయి, కాసేపు ఆనందాలు అవమానాలు కొనసాగిన తరువాత, మరొక పోటీ దాకా అహంకారాలు విశ్రమిస్తాయి. తెలంగాణలో అట్లా జరగడంలేదు. మునుగోడు యుద్ధం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. దాని నుంచి తార్కిక ఫలితం ఏమీ రాలేదు. అందుకని, ఆ పోరాటం కొత్త పిలకలు వేస్తూ ఉంటుంది. అటువంటి కొత్త పిలక పేరు రామగుండం. అడుగడుగున వెలుస్తున్న అగడ్తలలో అదొకటి.
ఏకకాలంలో అనేక రణరంగాలు సిద్ధం. ప్రధాని పర్యటనకు రాష్ట్రప్రభుత్వ విముఖతకు మధ్య ఒక రణరంగం. రాజభవన్‌కు ప్రగతి భవన్‌కు ఒక మధ్య మరొక రణరంగం. ఇట్లా నిరంతర రాజకీయ ఉద్రిక్తతలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. తెలంగాణలో అధికారం నిలుపుకోవడానికి, లేదా, అధికారం సాధించడానికి జరిగే పోరాటం ఏదో ఒక రూపంలో ఏడాది పాటు సుదీర్ఘంగా జరుగుతుంది, కానీ, ఈ పోరాటం ఫలితం సాధిస్తుందా? సత్పరిపాలనకు, ప్రజాస్వామ్యానికి ఈ సన్నివేశం ప్రత్యామ్నాయం అవుతుందా? ప్రధానమంత్రి పర్యటనపై రాష్ట్రప్రభుత్వ శిబిరం నుంచి వస్తున్న ప్రశ్నలు న్యాయమైనవే కావచ్చు. మా ఇలాకాలోకి ఎందుకు వస్తున్నావు అన్నట్టున్న ధోరణి ఏమంత సహేతుకం కాకపోవచ్చు. ఒక రాష్ట్రం, అందునా ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో నడచిన ఉద్యమం వల్ల ఏర్పడిన రాష్ట్రం, తన పరిధిలోకి ఇతరుల చొరబాటును, ముఖ్యంగా కేంద్రం చొరబాటును సహించడం కష్టమే కావచ్చు. కానీ, ఉద్యమ పార్టీ జాతీయపార్టీగా మారుతున్న క్రమంలో ఆశ్చర్యకరంగా ఈ ప్రాంతీయ గర్జనలేమిటి?
కేంద్రంతో యుద్ధం, జాతీయ స్థాయిలో చక్రం వంటి అంశాలు వచ్చే ఎన్నికలలో కోరుకుంటున్న విజయానికి పెద్దగా ఉపయోగపడవని, బిజెపి నిరంకుశ, మతతత్వ విధానాల మీద చేస్తున్నామని చెప్పే పోరాటానికి తగినంత విశ్వసనీయత సమకూరలేదని, టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ అగ్రనేతకు ఎవరైనా చెప్పగలిగితే బాగుండును. లేదా ఆయన వినగలిగితే బాగుండును. తన పరిపాలన మీద ప్రజలలో వ్యతిరేకత తీవ్రతరం అవుతున్నదని గుర్తించడమే మునుగోడు నుంచి ఆయన నేర్చుకోవలసిన, నేర్చుకోదగిన గుణపాఠం. గజకర్ణ గోకర్ణ విద్యలేవీ, ఆ వ్యతిరేకతను మాయం చేయలేవు, ప్రభావం చూపకుండా ఆపలేవు. ఇది మరొక పాఠం. జాతీయ పార్టీ అనగానే పాలాభిషేకాలు, హర్ష ప్రకటనలు చేసిన విధేయ అనుచరులు, సహచరులు ఎవరూ ఈ నిజాన్ని చెప్పడానికి ధైర్యం చేయరు, చెప్పవలసిన బాధ్యతను కూడా తీసుకోరు. అధికారం ఉంటే ఓలలాడతారు, జారిపోతుంటే తామూ జారిపోతారు. అధికార పీఠం మీద ఉన్నవారికి సత్యం అరుదుగా లభించే దినుసు. సర్వశక్తులు మోహరించినా, అందరి కంటె ఓటుకు నోటు అధికంగా ఇచ్చినా, ప్రభుత్వ పథకాల అమలును గురిపెట్టి మరీ నిర్వహించినా, పొత్తుపెట్టుకున్న పార్టీలు పదిపదిహేనువేల ఓట్లు తెచ్చినా, మెజారిటీ పదివేలు దాటలేదంటే, లోపం ఎక్కడున్నదో చూడలేకపోతే, అది చూపు లోపం.
సంవత్సరమంతా పుస్తకం తెరచిచూడకుండా, రేపోమాపో పరీక్షలనగా రాత్రింబవళ్లు బట్టీయం పట్టి, చిట్టీలు రాసుకునే బాధ్యత లేని కుర్రవాడిలాగా కనిపిస్తారు కెసిఆర్ ఒక్కోసారి. పరిపాలనను సరిచూసుకుంటే, ప్రజాసమస్యలను పట్టించుకుంటే సరిపోయేదానికి, వ్యతిరేకతను పెంచుకుంటూ పోయి, పరీక్షాసమయం ఎదురయినప్పుడు సమస్త ప్రయత్నాలతో ప్రయాసపడడం ఎందుకు? ఇప్పుడు కూడా ఆయన ఆలోచిస్తున్న తీరు బహుశా అదే తీరులో ఉండి ఉంటుంది. తప్పుడు గుణపాఠాలు మాత్రమే తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. కమ్యూనిస్టుల కూడిక, కాంగ్రెస్ తీసివేత బిజెపిని ఓడించిందని, అదే ఫార్ములా రాష్ట్రం అంతా అమలు చేయాలని అనుకుంటారు. మునుగోడులో బిజెపి అభ్యర్థికి చాలా ఓట్లు వచ్చాయి. అభ్యర్థి రాజగోపాలరెడ్డి కావడం వల్లనే అన్ని ఓట్లు వచ్చాయని గత ఎన్నికల ఓట్ల వివరాలు చూస్తే తెలుస్తుంది. కానీ, రాజగోపాలరెడ్డి వంటి అభ్యర్థులను ఎంతమందిని బిజెపి తేగలదు? తెలంగాణలోని చాలా నియోజకవర్గాలలో బిజెపికి క్షేత్రస్థాయి బలం లేదు. మునుగోడులో కూడా కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ కొరత ఉన్నదని, ఇతర పార్టీల నుంచి వలసవచ్చినవారే అధికంగా ఎన్నికల అవసరాలు తీర్చారని చెబుతున్నారు. లెక్కప్రకారం, మునుగోడు కాంగ్రెస్ ప్రాబల్య స్థానం. రాజగోపాలరెడ్డి బిజెపికి వెళ్లి ఉండకపోతే, మునుగోడులో కాంగ్రెస్ ఒక బలమైన పక్షంగానే ఉండేది. బిజెపికి బలమైన అభ్యర్థి సమకూరిన చోట, కాంగ్రెస్ అభ్యర్థి తెచ్చుకునే ఓట్లు టిఆర్ఎస్‌ను రక్షిస్తాయి. అట్లాగే, కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల (ఇటువంటివి తెలంగాణలో అధికంగానే ఉంటాయి.) బిజెపి అభ్యర్థులు తెచ్చుకునే ఓట్లు టిఆర్ఎస్‌ను రక్షిస్తాయి. అటువంటి ప్రయోజనం సిద్ధించేవిధంగా, బిజెపిని పెంచడం, కాంగ్రెస్‌ను తగ్గించడం అనే వ్యూహాన్ని కేసీఆర్ ఆలోచించారు, అమలుచేస్తున్నారు. అయితే, బిజెపిని పెంచే ప్రయత్నం డోస్ పెరిగిపోయి, మునుగోడులో ప్రాణం మీదకు వచ్చింది. పట్టణ ప్రాంతాలలోనే కాదు, గ్రామాలలోనూ బిజెపికి ఓట్ల వర్షం కురిసింది. పొత్తులతో వచ్చిన పదివేలు రక్షించపోతే, ఈ పాటికి అనంతర పరిణామాలు ఉధృతంగా ఉండేవి. ఇప్పుడు కూడా అంతా సజావుగా ఉంది అనుకోలేము. రాష్ట్రంలో విస్తృతంగా ఈడీ సందర్శనలు జరుగుతున్నాయి, ఆర్థికమూలాలు అల్లాడిపోయే చర్యలు జరగనున్నాయి. ఇప్పుడయినా తన వ్యూహం మంచిచెడ్డలను ఆయన తరచిచూసుకుంటున్నారనుకోలేము. ప్రధాని పర్యటన మీద కాలుదువ్వుతూ, తానూ బిజెపీ మాత్రమే రాష్ట్రంలో పోటీదారులమన్న సంకేతాన్ని స్థిరపరుస్తున్నారు. ఈ వ్యూహాన్ని బద్దలు కొట్టే శక్తి, పాపం, కాంగ్రెస్‌కు ఏది?
కెసిఆర్ సమాధానం వెదుక్కోవలసిన అసలు ప్రశ్న, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధికి తగిన స్థానమిస్తే, విద్యవైద్యరంగాల మీద దృష్టిపెడితే, అన్ని నిర్ణయాలూ తానే కాక, అందరి వివేకానికీ విచక్షణకీ పనిచెప్తే, ఏళ్ల తరబడి పనులు పడకవేయకుండా చూస్తే, ఇట్లా ఒకరిని తగ్గించి మరొకరిని పెంచే విన్యాసాలు అవసరం ఉండవు కదా? తెలంగాణలోని ప్రగతిశీల సమాజాన్ని తన పని తాను చేసుకోనిస్తే, మతతత్వంవంటి సమస్యలను వారు ఎదుర్కొని ఉండేవారు కదా? ప్రజా ఉద్యమాలలో ఉన్నవారిని, వ్యక్తిగత నైతికత ఉన్నవారిని ప్రజాప్రతినిధులుగా తీసుకుని ఉంటే, ఇట్లా యాభైకోట్లకో వందకోట్లకో బేరాలు వచ్చేవి కాదు కదా? బాధ్యతాయుత పరిపాలన అన్న కర్తవ్యాన్ని వదిలేసి, ఎన్ని చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం? కాంగ్రెస్‌ను మింగకుండా ఉంటే, మరొక భూతం తనను మింగడానికి రాగలిగేది కాదు కదా?
తెలంగాణ ప్రజలు అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వనరుల సద్వినియోగం, ప్రజాస్వామిక హక్కులు వంటి అంశాలే రాజకీయవేదిక మీద ఉండాలని సుదీర్ఘకాలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా వారు అదే తమ అజెండాగా భావిస్తారు. ప్రజలలో ఉద్రిక్తతలను, విభజనలను పెంచిపోషించే అంశాలు రాజకీయాలలో ప్రాబల్యం వహించడం వారు సహజంగానే ఇష్టపడరు. కానీ, అదే సమయంలో, ప్రజల ప్రమేయం, భాగస్వామ్యం లేని పరిపాలనను కూడా సహించలేరు. ఉద్యమం నుంచి సంక్రమించిన జనాకర్షణ, ఉద్యమ విలువలనుంచి దూరం జరిగినప్పుడు క్షీణించిపోతుంది. చైతన్యవంతమైన సమాజాన్ని మెప్పించాలంటే, ఒకటో రెండో మంచిపనులు చేసి ఊరుకుంటే సరిపోదు,
నిరంతరం దాని ఆకాంక్షలను ఆలకించగలగాలి, నెరవేర్చగలగాలి. కెసిఆర్ గుర్తించవలసింది అదే. పదివేల గెలుపు ఇస్తున్న పిలుపు అదే.
కె. శ్రీనివాస్