సర్వ సన్నద్ధం

ABN , First Publish Date - 2022-12-29T01:05:41+05:30 IST

కరోనా కొత్తరాకడ విషయంలో భారతదేశానికి రాబోయే నలభైరోజులు అత్యంత కీలకమైనవని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అంటోంది....

సర్వ సన్నద్ధం

కరోనా కొత్తరాకడ విషయంలో భారతదేశానికి రాబోయే నలభైరోజులు అత్యంత కీలకమైనవని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అంటోంది. గతంలో దేశంలో స‍ంభవించిన వ్యాప్తి ధోరణులను లోతుగా విశ్లేషించుకున్న తరువాత కేంద్రం ఈ అంచనాకు వచ్చిందంటున్నారు. దేశం మరోమారు వేవ్‌ ఎదుర్కోబోతున్నదా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేకున్నా, ఒకవేళ వేవ్‌ చుట్టుముట్టినా, ఈ మారు అది ఆస్పత్రుల్లో వేలాదిగా చేరికలు, అనేక మరణాల స్థాయిలో ఉండబోదని ఇప్పటికే నిపుణులు హామీ ఇస్తున్నారు. వ్యాప్తి ఉన్నా, ఇప్పటికే అత్యధికులు వాక్సిన్‌ వేయించుకున్నందునా, గతంలో పలుమార్లు కరోనా సోకడంతో సంక్రమించిన సహజ రోగనిరోధకశక్తివల్లా ఉత్పాతం ఉండదని అందరూ నమ్ముతున్నారు. దేశం ఈ మారు కరోనావేవ్‌ ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా, సమర్థంగా ఉన్నదని పాలకులూ భరోసా ఇస్తున్నారు.‍‍

వచ్చేవారం నుంచి చైనా, జపాన్, దక్షిణకొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ ఇత్యాదిదేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు డెబ్బయ్‌రెండు గంటల ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ నివేదికను తప్పనిసరి చేయడం వంటి చర్యలను భారత్‌ అమలుచేయబోతున్నది. కేంద్ర ఆరోగ్యమంత్రి విమానాశ్రయాలను సందర్శించి ఏర్పాట్లను పరీక్షించబోతున్నారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపుగా అన్ని రాష్ట్రాలూ మంగళవారం ‘మాక్‌డ్రిల్‌’ నిర్వహించి సంసిద్ధతను పరీక్షించుకున్నాయి కూడా. ఆక్సిజన్‌ సహా అంతా సిద్ధం చేసుకోండి అన్న ఆదేశాలకు అనుగుణంగా, వైద్యపరికరాలు, వైద్యసిబ్బందిని సరిచూసుకున్నాయని వార్తలు వచ్చాయి. దేశంలో కొవిడ్‌ కేసుల రోజువారీ సగటు డిసెంబరు 22నాటికి నూటయాభైకి మించి లేవని కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వారంక్రితం చైనాతో పాటు ఓ నాలుగుదేశాల పేర్లను ప్రస్తావిస్తూ, అక్కడ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పెంచి నమూనాలను ఇన్సాకాగ్‌ లాబరేటరీలకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు లేఖరాయడం, మారునాడే కేంద్ర ఆరోగ్యమంత్రి ఓ సమీక్షాసమావేశం జరిపి ప్రజలు మాస్కులు ధరించాలనీ, భౌతికదూరం పాటించాలని, అర్హులైనవారంతా మూడో డోసు వేసుకోవాలని సూచించడంతో పరిణామాలు వేగంగా వేడెక్కిపోయాయి. రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించిన కొద్దిగంటల్లోనే చైనాను కుదిపేస్తున్న బిఎఫ్‌ 7వేరియంట్‌ కేసులు మనదేశంలోనూ ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. ఇవి మూడునెలల క్రితమే దేశంలో నమోదైనాయన్న విషయాన్ని అటుంచితే, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా కేంద్రపాలకులు కరోనా గురించి నోరువిప్పిన తరువాతే అదీ ప్రజలకు హితవులు చెప్పడం విశేషం.

మూడేళ్ళుగా చైనా అతికఠినంగా అమలుచేసిన ‘జీరోకొవిడ్‌’ విధానం అక్కడి ప్రజలను కష్టాలపాల్జేసినా మిగతా ప్రపంచాన్ని రక్షించింది. ప్రజావ్యతిరేకతవల్లనో, లాక్‌డౌన్‌లతో కుంటుపడిన ఆర్థికవ్యవస్థతోనో చిరాకెత్తిన చైనా అధినేతలు ఆ విధానాన్ని ఒక్కసారిగా ఎత్తివేయడంతో ఈనెల ఇరవైరోజుల్లోనే పాతికకోట్లమంది కరోనాబారిన పడ్డారు. ఆస్పత్రులూ స్మశానవాటికలూ కిటకిటలాడిపోతున్నాయి. ప్రధానంగా బిఎఫ్‌7, మరో నాలుగువేరియంట్లు ఈ స్థితి కారణమైనప్పటికీ, ఐదోవంతు జనాభాకు కరోనా సోకిన నేపథ్యంలో అక్కడ కొత్తవేరియంట్లు పుట్టుకురావచ్చున్న భయం ప్రపంచాన్ని పీడిస్తున్నది. ఈ కారణంగా పరీక్షల సంఖ్య కంటే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అధికం చేయడం ద్వారా కొత్త వేరియంట్లపై అధిక దృష్టిపెట్టాలన్నది భారతప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు చైనా అంతర్జాతీయ ప్రయాణాల విషయంలోనూ అన్ని నిబంధనలనూ, ఆంక్షలనూ ఎత్తివేయబోతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చు. భారతదేశానికి వస్తున్న విదేశీయులు విధిగా ‘ఎయిర్‌ సువిధ’లో తమ వాక్సినేషన్‌ వివరాలను, నెగటివ్‌ రిపోర్టులు నమోదుచేసుకోవాలన్న రెండేళ్ళుగా అమలవుతున్న నిబంధనను సరిగ్గా నెలక్రితమే భారతప్రభుత్వం ఎత్తివేసింది. పర్యాటకరంగం నుంచి వచ్చిన ఒత్తిడి ఇందుకు కారణమని అంటారు. ఇప్పుడు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ మొదలై, శాంపిల్‌ పరీక్షల్లోనే చాలా కేసులు నమోదవుతూండటంతో దానిని తిరిగి కొన్ని దేశాలకు వర్తింపచేయబోతున్నారట. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో తక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా కొంతకాలం పాటు ఉదాసీనత ప్రదర్శించినందువల్లనే దేశం గతంలో పెద్ద దెబ్బతిన్నది. ఇప్పుడు ఏడురకాల వాక్సిన్లతో దేశం గతంలో కంటే ఎంతో బలంగా ఉన్నా, వేరియంట్ల ప్రవేశమార్గాలమీద ఇప్పటికైనా మరింత నిఘా ఉంచడం, దేశీయంగా పరీక్షలను అత్యధికం చేసి ముప్పును ముందుగానే అంచనా వేసుకోవడం ముఖ్యం.

Updated Date - 2022-12-29T01:05:45+05:30 IST