RK: కుమ్ములాటలతో తెలంగాణ కుదేలు!
ABN , First Publish Date - 2022-11-13T00:54:23+05:30 IST
మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రభాకరరెడ్డి విజయం సాధించారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. నికరంగా ఓడిపోయింది మాత్రం ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి..
మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రభాకరరెడ్డి విజయం సాధించారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. నికరంగా ఓడిపోయింది మాత్రం ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. అతి విశ్వాసంతో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను చేజార్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మునుగోడులో మాత్రం చతురంగ బలాలను మోహరింపజేసి గెలిచామనిపించుకున్నారు. మునుగోడులో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్న కేసీఆర్, ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా పదునైన వ్యూహాలతో గండం గట్టెక్కారు. మునుగోడులో ఏ పరిస్థితిలో విజయం సాధించారో తెలుసు కనుక కేసీఆర్ పొంగిపోకుండా వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలపై దృష్టిసారించారు. అయితే టీఆర్‌ఎస్ విజయానికి ప్రధాన కారణమైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం మునుగోడు విజయం తమదేనని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదిన్నరేళ్ల తర్వాత తమ అవసరం కేసీఆర్‌కు వచ్చినందుకు ఆనందంలో మునిగి తేలుతున్న ఆ పార్టీలు, ‘ఈ జన్మకిది చాలు’ అన్నట్టుగా సంతృప్తి చెందుతున్నాయి. గత ఎన్నికల్లో 6 శాతం మాత్రమే ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలో దాదాపు 40 శాతం ఓట్లు సాధించి తెలంగాణ రాజకీయాలలో తన పట్టు పెంచుకుంది.
సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా, ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీది మాత్రం అంతులేని విషాదం! కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి కూడా అనేక కారణాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన డజను మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌ను దెబ్బతీసినా, కాంగ్రెస్ నాయకులు కనీస స్పృహ లేకుండా ఆ తర్వాత కుమ్ములాటలతో తెలంగాణలో పార్టీకి పాడె కట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి ఉంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగయ్యాయన్న అభిప్రాయం నెలకొంది. దీంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమ నిజస్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ శల్య సారథ్యం చేశారు. బయటపడని మరికొందరు వెన్నుపోట్లకు పాల్పడ్డారు. అంతిమంగా తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ బతకకూడదని భావించిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకోవాలని కోరుకునే పరిస్థితి ఏర్పడింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు కూడా కేసీఆర్ పరోక్ష ప్రోత్సాహంతోనే అన్న అభిప్రాయం కూడా ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడితే నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ కోలుకోలేకపోతే భారతీయ జనతా పార్టీ మరింత బలపడటం ఖాయం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా జవసత్వాలను సమకూర్చుకొనే పని మొదలుపెట్టింది. 2014 తర్వాత ఆ పార్టీని వదిలి వెళ్లిన వారిలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరాలని యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కొందరు నాయకులు ఇప్పటికే ఈ దిశగా మంతనాలు జరిపారు. తెలంగాణలో పడిపోయిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టి, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయం అన్న అభిప్రాయంతో ఉన్న నాయకులు టీడీపీవైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం మునుగోడు ఉప ఎన్నికతో రుజువైంది. అయితే ఆ వ్యతిరేకతను బీజేపీ పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకోగలదా అన్నది ప్రశ్నార్థకం. నాయకత్వ లేమితో బీజేపీ ఇప్పటికీ సతమతం అవుతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించబోతున్నారో చూడాలి. టీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులు జత కట్టినందున తాము కూడా తెలుగుదేశం వంటి పార్టీని చేరదీయాలన్న ఆలోచనతో తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ ముఖ్యులు యోచిస్తున్నారు. సెటిలర్లను ఆకర్షించాలంటే తెలుగుదేశంను చేరదీయక తప్పదని ఆ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలలో రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయని బీజేపీ అధిష్ఠానం గుర్తించడం లేదట. ఉత్తరాది మోడల్‌నే దక్షిణాదిన కూడా అమలుచేయాలనుకోవడం వల్లనే తెలంగాణలో పార్టీ ఆశించిన మేర బలపడలేకపోతున్నదని తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు ఒకరు విశ్లేషించారు.
మత ప్రాతిపదికన దక్షిణాది రాష్ర్టాలలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రంలో బలపడటం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వటవృక్షంలా ఎదిగారు. ఆయనకు దీటైన, బలమైన నాయకుడిని ప్రొజెక్ట్ చేయకుండా మత ఉద్రిక్తతలు రెచ్చగొడితే ప్రయోజనం ఉండదని మరో నాయకుడు చెప్పుకొచ్చారు. గతంలో మత కలహాలతో పాటు నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడికిన తెలంగాణలో ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ అసలు సిసలు కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో మతం కార్డు కాలం చెల్లిన ఆయుధం అన్నది బీజేపీలో చేరిన, చేరబోతున్న ఇతర పార్టీల నాయకుల అభిప్రాయంగా ఉంది. తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమ ఉజ్జీ ఎవరు అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో రాష్ట్రంలో గణనీయంగా ఉన్న బీసీలలో రాజ్యాధికార కాంక్ష బలపడుతోంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తమ అధిష్ఠానం ఆ దిశగా వ్యూహాలను రూపొందించుకోని పక్షంలో పార్టీ పరిస్థితి పాల పొంగులా మిగిలిపోయే ప్రమాదం ఉందని బీజేపీకి చెందిన మరో ముఖ్య నేత వ్యాఖ్యానించారు. నిజానికి మునుగోడులో ఉప ఎన్నిక జరిపించడం కూడా అవాంఛనీయం అని ఆయన విశ్లేషించారు. గుప్పిట మూసి ఉంచితేనే బాగుండేదని ఈ వర్గం అభిప్రాయపడుతోంది. అయితే బీజేపీ అధిష్ఠానం ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదట. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయగలిగామని, కేసీఆర్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించామని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ అభిప్రాయాన్నీ తోసిపుచ్చలేం.
మరి నాయకులెలా?
కాంగ్రెస్ పార్టీతో పోల్చితే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ నాయకుల కొరత ఉంది. దుబ్బాక, హుజూరాబాద్‌లలో బలమైన అభ్యర్థులు లభించడంతో మంచి ఫలితాలు సాధించగలిగిన బీజేపీకి కనీసం 60 నుంచి 70 స్థానాల్లో ఆ పరిస్థితి లేదు. పార్టీ అధిష్ఠానం కూడా ఈ సమస్యను గుర్తించి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే బీజేపీతో ఇమడగలమా? అన్న సందేహంతో పార్టీలు మారాలనుకుంటున్న పలువురు నాయకులు ఇప్పటికీ సందిగ్ధంలోనే ఉన్నారు. దక్షిణాది రాష్ర్టాలలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఈ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసి దెబ్బతిన్న మోడల్‌నే ఇప్పుడు తాము అధికారంలో లేని రాష్ర్టాలలో అమలుచేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కుముద్‌బెన్ జోషీ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును ఎన్ని తిప్పలు పెట్టారో అందరికీ తెలిసిందే. దీంతో గవర్నర్ వ్యవస్థపై ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాటం చేశాయి. మళ్లీ ఇంత కాలానికి నాటి పరిస్థితులే పొడచూపుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ రాష్ట్ర గవర్నర్ చికాకు పెట్టగా.. ఇప్పుడు కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడతారని భావించలేం. తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గవర్నర్ జిల్లా పర్యటనలకు వెళితే స్థానిక అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా ముఖం చాటేస్తున్నారు. రాజ్‌భవన్ ఛాయలకు వెళ్లడానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడటంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానిస్తోందని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తంచేశారు. వివాదం పరిష్కారం కాకపోగా నానాటికీ ముదురుతూ వచ్చింది.
ఇప్పుడు ఈ జాబితాలో కేరళ, తమిళనాడు గవర్నర్లు కూడా చేరారు. రాజ్‌భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంగా మారిపోయిందని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ ఫాంహౌజ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఎండగట్టే ప్రయత్నాలను కేసీఆర్ తీవ్రం చేశారు. దీంతో గవర్నర్ తమిళిసై హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. ఆ వెంటనే విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నట్టు అనుమానంగా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. అమిత్ షా అనుమతి లేకుండా ఆమె ఇంతటి తీవ్ర ఆరోపణ చేస్తారని భావించలేం. మామూలుగా అయితే గవర్నర్ ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాలి. కానీ అలా ఏమీ జరగలేదు. టీఆర్‌ఎస్–బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో భాగమే మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారం గానీ, గవర్నర్ ఆరోపణలు గానీ అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్టున్నారు. అందుకే ఈ రెండు అంశాలపై రావాల్సినంత స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రావడం, ఆయన పర్యటనను కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
ఆ వైరం వెనుక..!
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాజకీయాలు కనీసం కొంతకాలం పాటు చల్లబడతాయని జనం భావించారు. అయితే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కేసీఆర్ ఈ స్థాయిలో వ్యతిరేకిస్తారని భావించలేదు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి ప్రధానమంత్రి వచ్చారు. అంతకుమించి ప్రధానికి కార్యక్రమాలు ఏమీ లేవు. ప్రధానితో వేదిక పంచుకోవడం ఇష్టంలేకపోతే కేసీఆర్ దూరంగా ఉండిపోవచ్చు. అయితే తన ఏలుబడిలో ఉన్న తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడానికి వీలులేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణకు మోదీ అవసరం లేదనీ, ఆయనకు ప్రవేశం లేదనీ హైదరాబాద్‌లో హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు కేసీఆర్ సొంత మీడియాలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కథనాలు వండి వార్చడం మొదలెట్టారు. దీనికి కొత్త మిత్రులు కమ్యూనిస్టులు కూడా గొంతు కలిపారు. నిజానికి ప్రధాని పర్యటనను కేసీఆర్ ఇంతలా వ్యతిరేకించి ఉండకపోతే మోదీ పర్యటనకు చెప్పుకోదగిన ప్రాధాన్యం ఉండేది కాదు. కేసీఆర్ పుణ్యమా అని ఇప్పుడు మోదీ పర్యటనకు ప్రాధాన్యం లభించింది. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు ఏమిటో తెలియదుగానీ బీజేపీతో ఆయన తీవ్ర స్థాయిలో తలపడుతున్నారు. ఈ పరిణామం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధానికి దారితీస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ సిట్‌ను ఏర్పాటు చేయగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను రంగంలోకి దించింది. దీంతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం చెల్లా చెదురైంది.
కేంద్ర సంస్థలు ఎప్పుడు ఎవరిపై దాడులు చేస్తాయోనని వ్యాపార, పారిశ్రామిక సంస్థలు ఉలిక్కిపడుతున్నాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవికి చెందిన గ్రానైట్ వ్యాపార కార్యాలయాలు, ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రముఖ ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని ఢిల్లీలో అరెస్టు చేశారు. లిక్కర్ వ్యవహారంతో ముఖ్యమంత్రి కుమార్తె కవితకు సంబంధం ఉందని అంగీకరించాల్సిందిగా ఈడీ అధికారులు బలప్రయోగం చేస్తున్నారని ఈ కేసులోని నిందితులు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు కూడా ఫాంహౌజ్ వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రెండు పార్టీల మధ్య మొదలైన రాజకీయ పోరు కాస్తా కేసీఆర్– మోదీ, షా ద్వయం మధ్య పోరుగా మారిపోయింది. ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో తెలియదు గానీ తెలంగాణలో మాత్రం ఇప్పటిదాకా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో పెట్టుబడులకు సుహృద్భావ వాతావరణం ఉంది. ఇప్పుడు కేసీఆర్–నరేంద్ర మోదీ మధ్య రాజకీయ యుద్ధం కాస్తా వ్యక్తిగత పోరుగా రూపాంతరం చెందడంతో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నది. నిజానికి కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఈ స్థాయిలో ఎందుకు తలపడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఇంకా జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని రాష్ట్ర పర్యటనను ఈ స్థాయిలో వ్యతిరేకించడం వాంఛనీయమా? అన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుందన్న విషయంలో కూడా స్పష్టత లేదు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరాదిన చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కూడా బీజేపీతో ఆయన తలపడుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టా లలో కూడా ఆప్ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రత్యామ్నాయం అన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ ఉన్నారు.
ఈ పరిస్థితులలో భారత రాష్ట్ర సమితి పాత్రపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి కేసీఆర్ మొండిగా, మూర్ఖంగా కేంద్ర ప్రభుత్వంతో తలపడుతున్నట్టుగా అనిపించవచ్చును గానీ ఆయన రాజకీయ వ్యూహాలను తేలికగా తీసిపారేయలేం. తెలంగాణలో ఈ స్థాయిలో పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదుగుతుందని కేసీఆర్ ఊహించారో లేదో తెలియదు. ఒకవైపు బీజేపీ బలపడుతూ రావడం, మరోవైపు ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెరుగుతుండటం కేసీఆర్‌కు తెలియదనుకోలేం. అయినా ఆయన ప్రధాని మోదీతో కయ్యానికి కాలు దువ్వడం వెనుక ఏదో ఒక వ్యూహం ఉండి ఉండవచ్చు. అయితే అన్ని రోజులూ మనవి కావని కేసీఆర్ గుర్తించడం అవసరం. రెండు ప్రభుత్వాల మధ్య పోరులో తెలంగాణ నలిగిపోయే పరిస్థితి ఏర్పడితే అందుకు మాత్రం కేసీఆర్ బాధ్యతవహించవలసి ఉంటుంది. ప్రధానమంత్రి రామగుండం పర్యటనను అడ్డుకోవడం వాంఛనీయం కాదని, ఘర్షణ వైఖరితో రాష్ర్టానికి నష్టం చేయవద్దని విశ్రాంత ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో అనేక మంది ఏకీభవిస్తున్నారు. కేసీఆర్‌తో తలపడటం వల్ల ప్రధానమంత్రి మోదీకి పోయేది ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం అనే కొండను ఢీకొట్టడం వల్ల కేసీఆర్ రాజకీయంగా నష్టపోతారో లేదో తెలియదు గానీ రాష్ట్రం మాత్రం నష్టపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొదలైన పోరులో కొందరు అధికారులు కూడా బలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఫోన్ ట్యాపింగ్ గురించి గవర్నర్ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏడాపెడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్న విషయం బహిరంగ రహస్యమే. కేంద్రం దర్యాప్తు జరిపితే ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులు బలైపోతారు. మరోవైపు ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వచ్చిన పలు వ్యాపార, పారిశ్రామిక సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేసి కేసుల్లో ఇరికించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కేసీఆర్ ప్రభుత్వం ఇరికించగలదో లేదో తెలియదు గానీ, కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న పలువురు ఉక్కపోతకు గురవుతున్నారు. వారిపై ఇప్పటికే కేసులు పెట్టించారు. త్వరలో మరికొందరు ఈ జాబితాలో చేరబోతున్నారు. నిజానికి కొందరు మంత్రులు, శాసన సభ్యులు కూడా కేంద్రంతో ఈ స్థాయిలో ఘర్షణ అవసరమా? అన్న అభిప్రాయంతో ఉన్నారు. కేసీఆర్ మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు. గిట్టనివారి విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడంలో కేసీఆర్ కంటే ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆకు ఎక్కువే చదివారు. రాజకీయ ప్రత్యర్థులకు ఊపిరాడకుండా చేయడంలో మోదీ దిట్ట. నిన్నమొన్నటి వరకు కేంద్ర పెద్దలపై రంకెలు వేసిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన స్వరాన్ని సవరించుకోవడం గమనార్హం.
వికృత రూపం దాల్చకుంటే చాలు!
రాజకీయ పోరాటాలు, వైరాలు ఇప్పుడు ఎన్నికల వరకే పరిమితం కావడం లేదు. పగలు, ప్రతీకారాలు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. తెలుగు రాష్ర్టాల్లో ఈ ధోరణి అందరికీ సుపరిచితమే. కేంద్రం సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోసం కేసీఆర్, బీజేపీ మధ్య మొదలైన యుద్ధం వికృత రూపం సంతరించుకోకూడదని కోరుకుందాం. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వారే అధికారంలోకి వస్తారు. ఈ క్రమంలో పగలు, ప్రతీకారాలకు తావు ఉండకూడదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే జీవితాలు బాగుపడకపోయినా ఫర్వాలేదు మా మానాన మమ్మల్ని బతకనీయండి అని వేడుకొనే పరిస్థితులు వచ్చాయి. ఇద్దరో ముగ్గురో వ్యక్తుల మధ్య నెలకొన్న అహం తెలంగాణకు శాపంగా మారకూడదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎనిమిదేళ్లు ఉన్నారు, ఆయనకు ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కూడా ఎనిమిదిన్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు మాత్రం ఇంకేం కావాలి? తాను ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కోరుకుంటూ ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. పరిమితులు తెలుసుకున్నవాడు పది కాలాలపాటు మనగలడు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారిని చూసైనా నేర్చుకోవాలి. జాతీయ రాజకీయాల సంగతి అటుంచితే తెలంగాణ తన చేజారకుండా చూసుకొనే దిశగా కేసీఆర్ ఆలోచనలు సాగితే ఆయనకే కాదు రాష్ర్టానికి కూడా మంచిది!
ఆర్కే