Jagan : గుజరాత్ ఫలితాల తర్వాత ముప్పుతిప్పలు!

ABN , First Publish Date - 2022-12-04T00:08:26+05:30 IST

‘నన్నుమాత్రమే నమ్మండి.. ఫలానా మీడియాను, నాయకుల మాటలను నమ్మకండి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ మధ్య ప్రజలకు విజ్ఞప్తి చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఎంతమంది కలిసికట్టుగా..

Jagan : గుజరాత్ ఫలితాల తర్వాత ముప్పుతిప్పలు!

‘నన్నుమాత్రమే నమ్మండి.. ఫలానా మీడియాను, నాయకుల మాటలను నమ్మకండి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ మధ్య ప్రజలకు విజ్ఞప్తి చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు అని ఘీంకరించిన జగన్‌లో ఈ బేలతనం ఏమిటి? ప్రజలు తనను నమ్మడం లేదని ఆయనకు ఎందుకు అనిపించిందో? గత ఎన్నికల సందర్భంగా ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని వేడుకున్నందువల్లే కదా ఆ మాట నమ్మి ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ ‘నన్ను నమ్మండి’ అనడంలో జగన్‌కు ఏదో అపశకునం గోచరిస్తోంది. తన మాటలను నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా? అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పి, ఆ తర్వాత ఎవరిని నమ్మాలో ఆయన చెబితే బాగుంటుంది. మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది అని చెబితే ప్రజలు నమ్మేశారు. పులివెందుల పులి అంటే నిజమే కాబోలు అనుకున్నారు. మద్య నిషేధం అమలుచేస్తాను, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను, పోలవరం పూర్తిచేస్తాను, అమరావతే రాజధానిగా ఉంటుంది,

అధికారంలోకి వచ్చిన వారానికే సీపీఎస్‌ రద్దు చేస్తాను, పెన్షన్ల మొత్తం మూడు వేలకు పెంచుతాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ అమ్మ ఒడి ఇస్తాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, టిడ్కో ఇళ్లను రూపాయికే ఇస్తాను, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తాను, ముస్లింలకు పెళ్లి కానుకగా లక్ష ఇస్తాను, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, చంద్రబాబు అవినీతిని బయటపెడతాను, కోడికత్తి కేసు వెనుక ఉన్న వ్యక్తులను బయటకు ఈడుస్తాను, బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకుంటాను.. వగైరా వగైరా అంటూ ఆయన చెప్పిన మాటలను జనం నమ్మారు. మాట తప్పడు అనుకున్నారు. మూడున్నరేళ్లు గడిచేసరికి ప్రజలకు తత్వం బోధపడింది. నిన్ను నమ్ముకున్నందుకు నట్టేట ముంచావు అని ఇప్పుడు ప్రజలు ఘొల్లుమంటున్నారు. అమరావతే రాజధాని అని చెప్పిన మనిషి ఇప్పుడు మూడు రాజధానుల పల్లవి అందుకున్నారు. తాడేపల్లిలో కోట కట్టుకున్నాను అని చెప్పి అమరావతే రాజధాని అని నమ్మబలికితే నిజమే కాబోలు అనుకున్నారు. కడుపులో విషం నింపుకొన్న విషయం తెలియక రాజధానికి భూములిచ్చిన గ్రామాల ప్రజలు కూడా జగన్‌కే మెజారిటీ కట్టబెట్టారు. రాష్ట్రం విడిపోయి ఇంతకాలం అవుతున్నా రాజధాని కూడా లేకుండా చేసినందుకు ఇప్పుడు నిన్ను నమ్మాలా? మూడు రాజధానులు అని చెబుతున్న పెద్ద మనిషి ఆ దిశగా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడం కోసం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతూ, మరోవైపు సుప్రీంకోర్టుకు మాత్రం హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతుందని చెప్పించిన జగన్‌ వంచన అనితర సాధ్యం. రాజధాని విషయమై హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్‌ ప్రభుత్వం, భూములిచ్చిన రైతులను దగా చేయలేదా? మూడు రాజధానుల చట్టం అంటూ హడావుడిగా శాసనసభలో బిల్లు పాస్‌ చేయించుకున్న జగన్‌ రెడ్డి, ఆ తర్వాత బిల్లును ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పగలరా? న్యాయ సమీక్షకు ఆ బిల్లు నిలబడదని దాన్ని ఆమోదించిన వారికి తెలియకపోవడం ఏమిటి? నిజంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే అందుకు ఏం చేయాలి? అన్నది పట్టించుకోకుండా పిచ్చి వాగుడు వాగడం మోసం కాదా? అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి గడువు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధిస్తే దాన్ని కూడా వక్రీకరించి ప్రచారం చేసుకోవడం దగా కాదా? నాకు టీవీ చానళ్లు, పేపర్ల అండ లేదని చెబుతున్న జగన్రెడ్డి, సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన రోజు తన అధీనంలోని కూలి మీడియాతో ఎన్ని విన్యాసాలు చేయించారో ప్రజలకు తెలియదా? మెరుగైన సమాజం, అనుక్షణం ప్రజాహితం అని చెప్పుకొనే చానళ్లలో ఆ రోజు చేసిన ప్రచారం జగన్‌ ఆదేశం ప్రకారం కాదా? సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తీర్పుగా ప్రచారం చేస్తూ మరో న్యాయమూర్తి వేసిన ప్రశ్నలను విస్మరించేలా సదరు చానళ్లను అదుపు చేయడం వంచన కాదా? సొంతంగా ఒక పత్రిక, ఒక టీవీ చానల్‌ పెట్టుకున్న జగన్రెడ్డి, అదుపులో ఇప్పుడు ఎన్ని చానళ్లు ఉన్నాయో ప్రజలకు తెలియదా? అయినా ‘నాకు టీవీలు, పేపర్ల అండ లేదు’ అని జగన్రెడ్డి చెప్పగలుగుతున్నారంటే ప్రజలను మళ్లీ నమ్మించి వంచించవచ్చునని ఆయన బలంగా నమ్ముతున్నట్టుగా ఉంది.

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం చంద్రబాబు వల్ల కాదు అని చెప్పిన మాటలను నమ్మిన జనం చెవిలో ఇప్పుడు పూలు పెట్టడం నిజం కాదా? పోలవరం ప్రాజెక్టును బ్యారేజీ స్థాయికి కుదించడమే కాకుండా అది కూడా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఏకంగా మంత్రి ప్రకటించారంటే జగన్‌ సామర్థ్యం ఏపాటిదో తెలియడం లేదా? అయినా మళ్లీ ‘నన్ను నమ్మండి’ అని అనడం తెంపరితనమే అవుతుంది. 25 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీనే గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెబితే ప్రజలు నమ్మారు కదా! ఉద్యోగాలు కావాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని యువతను నమ్మించడం నిజం కాదా? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? మాట వరసకు కూడా కేంద్రం వద్ద ప్రత్యేక హోదా ప్రస్తావన తేవడంలేదే! అయినా ‘నన్ను నమ్మండి’ అంటే నమ్మడం ఎలా? ప్రధానమంత్రితో తన బంధం రాజకీయాలకు అతీతం అని చెప్పుకొన్న జగన్రెడ్డి.. ఆ అద్వితీయ బంధాన్ని ఏ ప్రయోజనాలకు వాడుకుంటున్నారో చెప్పగలరా? విశాఖ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్‌ ఏర్పాటు జరిగి తీరాలని ఎన్నికలకు ముందు గొంతు చించుకున్న పెద్దమనుషులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కదా? ఇప్పుడు రైల్వేజోన్‌ను గాలికి వదిలేసి రాజధాని వస్తే విశాఖ అభివృద్ధి చెందుతుందని కొత్త పల్లవి అందుకోవడం వంచన కాదా? ఇక మద్య నిషేధం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాసిరకం మద్యం బ్రాండ్లను అనుమతించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మద్యం ద్వారా సొంత ఆదాయం పెంచుకుంటున్న జగన్రెడ్డిని ఎందుకు నమ్మాలి? ఎన్నికలకు ముందు సొంత చిన్నాన్న హత్యకు గురైనప్పుడు చేసిన హడావుడి మర్చిపోయి ఇప్పుడు నిందితులకు అండగా నిలబడిన జగన్మోహన్‌ రెడ్డి మాటలను ఇంకా నమ్మాలంటే ఎలా? వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని విపక్షంలో ఉండగా డిమాండ్‌ చేసిన పెద్దమనిషి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టుకు చెప్పడం దగా కాదా? వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారులను పట్టుకోకుండా సీబీఐని కట్టడి చేయిస్తున్నది ముఖ్యమంత్రి కాదా? తన సోదరుడి ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో జనం మాత్రం జగన్‌ను ఎలా, ఎందుకు నమ్మాలి? ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారులు ఎవరో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసినా వివేకా సొంత అల్లుడే హత్య చేయించాడని నమ్మించడానికి తెగబడటం కుత్సితం కాదా? సీబీఐ దర్యాప్తు వివరాలను ఏనాడూ ప్రచురించని జగన్‌ నీలి మీడియా ఒక నిందితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రం తాటికాయంత అక్షరాలతో ప్రచురించడాన్ని మించిన నయ వంచన ఏముంటుంది? వివేకానందరెడ్డికి ఉన్న వివాహేతర సంబంధం వల్ల ఆస్తుల కోసం సొంత అల్లుడే ఆయనను చంపించాడని ప్రచారం చేయడానికి జగన్‌కు మనసెలా వచ్చిందో? చివరకు సుప్రీంకోర్టు సైతం జగన్‌ ప్రభుత్వ నైజాన్ని అర్థం చేసుకొని వివేకా హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్‌కు చెంపపెట్టు లాంటివి. తోడబుట్టిన చెల్లి సైతం తమ చిన్నాన్నను ఎవరు ఎందుకు చంపారో సీబీఐకి చెప్పిన తర్వాత కూడా కేసును తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు జగన్‌ ఎటువంటి వాడో చెప్పకనే చెబుతున్నాయి. అయినా ‘నన్నే నమ్మండి’ అంటే ఎలా? కోడి కత్తి కేసు సందర్భంగా సృష్టించిన హైడ్రామా గుర్తు కూడా లేనట్టు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. అప్పుడు తనను చంపడం కోసమే కత్తిని వాడారని జగన్‌ జనాన్ని నమ్మించారు కదా! ఎవరిపైన అయినా హత్యాయత్నం జరిగితే ఇలాగే వదిలేస్తారా? ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ కేసులో దోషులను పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదో జగన్‌ చెప్పాలి.

సీమకు నిజమైన ద్రోహం!

రాష్ర్టానికి పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయకపోగా గతంలో ముందుకు వచ్చిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చకుండా అడ్డుకున్నందుకు జగన్‌ను నమ్మాలా? అధికార పార్టీ ఎమ్మెల్యేల వేధింపులను భరించలేక లోదుస్తులు ఉత్పత్తి చేసే జాకీ కంపెనీ కూడా పారిపోయిందే! రాజకీయ కక్షతోపాటు కుల వివక్ష ప్రదర్శించి, రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమలలో ఒకటైన అమరరాజా బ్యాటరీస్‌ను మూయించడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా? కాలుష్యం పేరు చెప్పి పరిశ్రమను ఎంతగా వేధించారో చూశాం. దీంతో అమరరాజా బ్యాటరీస్‌ తమ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పగా, ‘మేమే దండం పెట్టి రాష్ట్రం నుంచి పొమ్మంటున్నాం’ అని ప్రభుత్వంలో ఉన్నవారు ప్రకటించడం జగన్‌ సర్కార్‌ నీచ మనస్తత్వాన్ని తెలియజేయడం లేదా? అమరరాజా విస్తరణ తెలంగాణకు తరలిపోవడం వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే. జగన్‌కు వ్యక్తిగతంగా కలిగిన నష్టం ఏమీ లేదు. అన్యులు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందని శోకాలు పెట్టినవారు ఇప్పుడు రాయలసీమ నుంచి అమరరాజా విస్తరణ ప్రాజెక్టు పోతున్నందుకు నిజంగా ఏడవాలి. రాయలసీమకు ఇదే నిజమైన నష్టం–అన్యాయం. ఇందుకు కారకుడైన జగన్‌ తరఫున గర్జనలు చేయడం సీమకు ద్రోహం చేయడమే అవుతుంది. పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో పోటీ పడుతున్నాయో చూస్తున్నాం. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రమే పెట్టుబడులను ఆకర్షించే పనులు చేయడం లేదు. ఇదివరకే వ్యాపార సంస్థలను నెలకొల్పుకున్న వారిని కప్పం కట్టండి లేదా వెళ్లిపొండి అని బెదిరిస్తున్న జగన్‌ అండ్‌ కోను ఇంకా నమ్మితే రాష్ట్రం ఏం కావాలి? ఎంపిక చేసుకున్న రంగాలకు చెందిన వారి నుంచి కప్పం కట్టించుకుంటున్న జగన్రెడ్డిని ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన మాటలన్నీ అబద్ధాలే, అయినా నన్ను నమ్మండి అని ఆయన అనగలుగుతున్నారంటే ప్రజల అమాయకత్వంపై అపారమైన విశ్వాసం ఉన్నట్టుగా ఉంది. సంక్షేమ పథకాల పేరిట ఇస్తున్న డబ్బును ఏం చేస్తున్నారో? ఎందుకు వాడుతున్నారో? తాను చూడటం లేదని, అందుచేత తనకే ఓటు వేయాలని జగన్రెడ్డి కోరుతున్నారు. ఎవడబ్బ సొమ్మని జగన్‌ రెడ్డి డబ్బు పంచుతున్నారు? రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బటన్లు నొక్కడమే ఘనకార్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి ధోరణి ఉంది. ‘నీవల్ల దేశానికి ఏమి ఉపయోగంరా బాలరాజు?’.. అని ఏదో సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం డైలాగ్‌ ఉంటుంది. జగన్‌ పాలన చూస్తున్న వారికి ఈ డైలాగే గుర్తుకొస్తుంది.

ముసుగు వీరుడు!

‘నన్ను నమ్ముతూనే ఉండండి. చివరకు అడుక్కు తినండి’ అన్నట్టుగా జగన్‌ ధోరణి ఉంది. పూట గడవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయక తప్పని పరిస్థితి తీసుకువచ్చారు. మరోవైపు డబ్బులు పంచుతూ ప్రజలను సోమరులుగా మారుస్తున్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని జగన్‌ అంటుంటారు. నిజమే.. చదువుకుని వాళ్లు ఏం చేయాలి? వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అదంతా నాకు తెలియదు– కాదు కాదు నాకు చేతకాదు.. అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. గతంలో దివంగత రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఇంజనీరింగ్‌ కాలేజీలను పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేయడం, అర్హత లేకపోయినా వాటిలో ఇంజనీరింగ్‌ చేసిన యువతీ యువకులు ఉపాధి లభించక బజారునపడటం చూశాం, చూస్తున్నాం. గ్రామాల్లో యువకులకు పెళ్లిళ్లు కూడా కావడంలేదు. ఓట్ల కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని అధికారంలోకి రాగలగడమే పులివెందుల మార్క్‌ రాజకీయం. ప్రజా ధనాన్ని పప్పుబెల్లాల్లా పంచుతూ దాని మాటున దోపిడీకి పాల్పడుతున్న ముసుగువీరుడే ఈ జగన్మోహన్‌ రెడ్డి. ఇప్పుడు తన ముసుగు తొలగిపోతుందేమో అన్న భయంతో ‘నన్ను నమ్మండి’ అని అమాయకత్వం నటించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో కొన్ని మీడియా సంస్థలతో పాటు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ దోచుకొని పంచుకున్నారని జగన్‌ తరచుగా విమర్శిస్తున్నారు. అదే నిజమైతే ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని సైతం వదలకుండా కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్న జగన్‌కు, మేం తప్పు చేసి ఉంటే మమ్మల్ని అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? రాష్ట్రం భ్రష్టుపట్టిపోతున్నప్పటికీ దోచుకొని దాచుకోవడం అనే కళను ఎవరైనా జగన్‌ను చూసే నేర్చుకోవాలి. కేంద్ర పెద్దల అండదండలు ఉన్నాయన్న భరోసాతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ కూడా నీతులు చెప్పగలుగుతున్న జగన్‌కు ప్రజలే గుణపాఠం చెప్పాలి. సొంత చెల్లి షర్మిలపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేసినా పట్టించుకోని జగన్మోహన్‌ రెడ్డిని అక్కచెల్లెమ్మలు ఎందుకు నమ్మాలి? రాక్షసులు, మారీచులు, చెడిపోయిన రాజకీయ వ్యవస్థలతో తాను ఒంటరి పోరాటం చేస్తున్నానంటూ ప్రజల సానుభూతి పొందడానికి జగన్‌ మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టారు. రాజశేఖర్‌ రెడ్డి మరణంతో ప్రజల్లో నెలకొన్న సానుభూతిని క్యాష్‌ చేసుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌ చేతిలో రాష్ట్రమే ఇప్పుడు దగా పడుతోంది. ఇప్పుడు మళ్లీ సానుభూతి చూపితే ఆ తర్వాత చింతించడానికి కూడా ఏమీ మిగలదు. ఒకసారి నమ్మినందుకే తాము నట్టేట మునిగామని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇంకొకసారి ఇంకా నమ్మితే ఏడవడానికి కూడా ఓపిక ఉండదు. తనకు వత్తాసు పలకని మీడియాను వేధిస్తూ కూడా బుడి బుడి ఏడుపులు ఏడ్వడం జగన్‌కే చెల్లుతుంది. జగన్‌ నైజం ప్రజలకు తెలియడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా జగన్‌ నిజ స్వరూపం తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన తండ్రి హత్య కేసు విషయంలో జగన్‌ ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారని అనుకోలేదని ఒక సందర్భంలో డాక్టర్‌ సునీత ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకే అంతుచిక్కని జగన్‌ నైజం అమాయక ప్రజలకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే ప్రజలను పదే పదే మోసం చేయవచ్చునని జగన్‌ భావిస్తున్నట్టు ఉంది. కేంద్ర పెద్దల చల్లని చూపు లేకపోతే తన పరిస్థితి ఏమిటో తెలుసు కనుకే రాష్ర్టానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై ముఖ్యమంత్రి నోరు విప్పడం లేదు.

గుజరాత్‌ తేలాక...

జగన్‌పై దాఖలైన అవినీతి కేసులు విచారణకు నోచుకోవడం లేదు. తెలంగాణలో మాత్రం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు పెద్దఎత్తున హడావుడి చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితను విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో గ్రానైట్‌ వ్యాపారాలకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీలో సీబీఐ విచారించింది. మరో మంత్రి మల్లారెడ్డి ఐటీ విచారణను ఎదుర్కొంటున్నారు. కేంద్రంతో సంధి కోసం ఇటీవల కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ మధ్య కవితను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు మకాం వేసిన కేసీఆర్‌.. రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కేంద్రంపై పోరాటానికి దిగారు. ఈ దశలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో బీజేపీ పెద్దలను రెచ్చగొట్టినట్టు అయింది. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ఏజెన్సీల దూకుడు మరింత పెరగవచ్చు. గుజరాత్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టడానికి కేంద్ర పెద్దలు స్కెచ్‌ సిద్ధం చేసుకున్నారు. గతంలో దివంగత కరుణానిధి కుమార్తె, ప్రస్తుత ఎంపీ కనిమొళిని గతంలో వివిధ కేసుల్లో అరెస్టు చేసి తీహార్‌ జైలుకు పంపారు. ఇప్పుడు కేసీఆర్‌ కుమార్తె కవితను కూడా లిక్కర్‌ కుంభకోణంలో అరెస్టు చేయాలనుకుంటున్నారని సమాచారం. రాజకీయంగా వేధించడానికే తనపై కేసులు పెట్టారని కవిత చెబుతున్నప్పటికీ ఆ అవకాశం ఇచ్చింది ఆమే గనుక ఇబ్బందిపడక తప్పదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బి.ఎల్‌.సంతోష్‌ వంటి పెద్ద నాయకులను కేసీఆర్‌ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపగలదా అన్నది ప్రశ్నార్థకమే. అమాయకత్వంతో గానీ, అత్యాశతో గానీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో చిక్కుకున్నారు. వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నందున కవిత ముందూ వెనుకా ఆలోచించకుండా వారితో చేతులు కలిపినట్టున్నారు. విచిత్రమేమిటంటే, అవినీతి కేసులలో గతంలో జైలు జీవితం గడిపి వచ్చిన వారిలో సైతం పరివర్తన రాకపోవడం. జగన్‌ కేసులలో సహ నిందితులుగా ఉన్న పలువురు ఇప్పటికీ జగన్‌తో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందుతున్నారు. సహవాస దోషం వల్ల ఇప్పుడు కవిత కూడా చిక్కుకున్నారు. తమాషా ఏమిటంటే, డజనుకుపైగా ఈడీ, సీబీఐ కేసులు తనపై ఉన్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి చిద్విలాసంగా ఉంటుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం కొత్త చిక్కులు కాచుకొని ఉండటం. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. అయితే చట్టం కొందరి విషయంలో వేగంగా, మరికొందరి విషయంలో కుంభకర్ణ నిద్రపోవడమే అభ్యంతరకరంగా ఉంటోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపుగా పూర్తయింది. అసలు సూత్రధారులను కూడా గుర్తించారు. అయినా వారిని అరెస్టు చేయకుండా పై నుంచి ఆదేశాలు వచ్చాయట. దీన్నిబట్టి జగన్రెడ్డికి కేంద్రం వద్ద ఎంత పలుకుబడి ఉందో స్పష్టమవుతోంది. అయితే ఆయన తన పరపతిని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం వాడకపోవడం విచారకరం. అయినా అవన్నీ మరచిపోయి తనను మాత్రమే నమ్మాలని ఆయన కోరుతున్నారు. వినాశనాన్ని కళ్లారా చూస్తూ కూడా ఇంకా ఎవరైనా ఆయనను నమ్మితే అది వారి ఖర్మ! ప్రభుత్వాల ధోరణితో ప్రజలు కూడా నిజమేదో తెలుసుకోలేక అయోమయానికి గురవుతున్నారు. చట్టం తన పని తాను చేసి ఉంటే జగన్రెడ్డి ఈ పాటికి జైలుకు వెళ్లి ఉండేవారు. కేసుల నమోదు, దర్యాప్తు కూడా రాజకీయ కారణాలతో జరుగుతున్నందున అందరూ అందరే అన్న భావనకు ప్రజలు వచ్చారు. ఈ కారణంగానే జగన్‌ ఎన్ని మాటలైనా చెప్పగలుగుతున్నారు. తెలంగాణ విషయంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని, కవిత వ్యవహారాన్ని రెండు పార్టీల మధ్య వైరంగానే చూస్తున్నారు. ఫలితంగా తప్పు చేసినవారు దర్జాగా తిరగ్గలుగుతున్నారు. ఎన్నికల్లో గెలుస్తున్నారు. అధికారం చలాయిస్తున్నారు. మన వ్యవస్థను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇదేనేమో!

ఆర్కే

Updated Date - 2022-12-04T07:38:29+05:30 IST