అనవసర రాద్ధాంతం
ABN , First Publish Date - 2022-12-01T01:24:17+05:30 IST
గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా, ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం చుట్టూ మరోసారి వివాదాలు, వాదప్రతివాదాలు మొదలైనాయి...
గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా, ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం చుట్టూ మరోసారి వివాదాలు, వాదప్రతివాదాలు మొదలైనాయి. న్యాయనిర్ణేతగా వచ్చిన ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత, దర్శకుడు నాదవ్ లాపిడ్ ఈ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసి, ప్రసార మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో వాటిని సమర్థిస్తున్నవారు, వ్యతిరేకిస్తున్నవారు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. బాలీవుడ్ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకూ నాదవ్ వ్యాఖ్యలకు మరిన్ని రంగులు అద్ది, మరింత వివాదాస్పదం చేస్తున్నారు.
ఒక సినిమా యోగ్యతల గురించి న్యాయనిర్ణేతలు వ్యాఖ్యానించడం కొత్తేమీ కాదు. ఆయా సినిమాల్లో ఏముందో, వాటిలో ఏ కళాత్మక విలువలున్నాయో, ఏవి లోపించాయో జరుగుతూనే ఉంది. వారున్నది కూడా సినిమా యోగ్యతల గురించి మాట్లాడటానికే. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడు, మిగతావారు దానిని ఆమోదించవచ్చు, వ్యతిరేకించవచ్చు. చాలామందికి ఈ సినిమా నచ్చింది అని అంగీకరిస్తూనే అది తనకు ఎందుకు నచ్చలేదో ఆయన కాస్త కఠినంగా చెప్పాడు. కానీ, ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ కొందరు దానికి జాతీయతను జోడించడం సరికాదు. ఇజ్రాయెల్ కు పాలస్తీనాతో ఉన్నవైరం తెలిసిందే. ఒక సాధారణ ఇజ్రాయెలీగా నాదవ్ ఆలోచించి ఉంటే, మెహబూబా ముఫ్తీ మాటల్లో చెప్పాలంటే, ముస్లింలను విలన్లుగా చూపించిన ఈ సినిమాను ఆయన మెచ్చుకోవాలి. కానీ, ఒక దర్శకుడిగా, చిత్ర విమర్శకుడిగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకూ, భారత ప్రభుత్వానికి సంబంధమేమీ లేదు. చాలా దేశాల్లో ప్రభుత్వాలను, పాలకులను చీల్చిచెండాడే చిత్రాలు రావడం, ఇటువంటి వేదికలపైన చర్చలు జరగడం ఉన్నదే. నాదవ్ వ్యాఖ్యలను కూడా విని వదిలేసి ఉంటే సరిపోయేది. కానీ, భారత ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏమీ వ్యాఖ్యానించకపోయినా, అధికార పక్షానికి చెందిన నాయకులు కొందరు ఇందులో ఏదో కుట్రకోణం ఉన్నదన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. నాదవ్ ను హిందూ వ్యతిరేకిగా, నాజీ మద్దతుదారుగా అభివర్ణిస్తున్నారు. జ్యూరీ పెద్దగా ఆయన మనదేశంలోకి ఎలా అడుగుపెట్టగలిగాడో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారపార్టీతో అనుబంధం ఉన్న సినీరంగ ప్రముఖులు మరిన్ని కొత్త రంగులు అద్దుతున్నారు. వీటన్నింటినీ అటుంచితే, భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలాన్ ఈ వ్యవహారంపై స్పందించిన తీరు మరింత ఆశ్చర్యకరం. ఆయన ఏకంగా నాదవ్ ను క్షమాపణలు కోరమని డిమాండ్ చేయడం ద్వారా ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంలాగా, దౌత్యబంధాలకు విఘాతం కలిగించే అంశంలాగా మార్చేశారు. నాదవ్ తప్పిదాన్ని పెద్దమనసుతో క్షమించాలంటూ భారతదేశాన్ని తానే క్షమాపణలు కోరారు. నువ్వు సిగ్గుతో తలదించుకోవాలంటూ నాదవ్ ను వరుస ట్వీట్లతో దుమ్మెత్తిపోశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించే నాదవ్, అక్కడి వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్మ్ ఫెస్టివల్ విషయాలు చెప్పడంలో భాగంగా, గిలాన్ అక్కడ మాట్లాడింది ఏమిటో కూడా చెప్పారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య సామీప్యతలున్నాయని అంటూ ‘మన రెండు దేశాలూ ఒకే రకమైన శత్రువును, దుష్టమైన పొరుగు’ను ఎదుర్కొంటున్నామని భారత సమాచార ప్రసారశాఖలమంత్రి అనురాగ్ ఠాకూర్ తో గిలాన్ అన్నట్టుగా నాదవ్ చెబుతూ త్వరలో మనదేశంలో కూడా కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. పైకి కనిపించకపోయినా, ప్రభుత్వ పెద్దలనుంచి వచ్చిన ఒత్తిడితోనే నాదవ్ పైన గిలాన్ ఇంతగా విరుచుకుపడ్డారని కొందరి అనుమానం.
ఈ చిత్రంలో ఏమున్నదో, దానిని ఏ లక్ష్యంతో తీశారో, దానిని అధికారపార్టీ పెద్దలు ఎంతగా ప్రోత్సహించారో అటుంచితే, సినిమాల్లో అవాస్తవాలు ఏమీ లేవని చిత్ర దర్శకుడు ఎలాగూ ఘాటుగా స్పందించారు. గత ఏడుదశాబ్దాలకాలంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్పీ) చక్కగా ఎదుగుతూ, ప్రపంచంలో ఓ గుర్తింపు పొందిన సినిమా పండుగగా అవతరించింది. ప్రభుత్వం నిర్వహణ అయినప్పటికీ, సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తూ, ప్రపంచవ్యాప్త చిత్రప్రముఖులను ఆహ్వానిస్తూ ఓ స్థాయికి చేరుకుంది. కళారంగానికి సంబంధించిన అటువంటి ఒక విస్తృతమైన వేదికమీద భిన్నమైన అభిప్రాయాలు వెల్లడికావడం సహజం. ఒక సినిమా మీద అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న మరో సినీరంగ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలకు కొత్త రంగులు అద్ది అనవసరపు రాద్ధాంతం చేయడం సరికాదు.