నేరానికి వీరతిలకం

ABN , First Publish Date - 2022-12-16T01:38:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్ లో, దళితుడైన తన కారు డ్రైవర్ ని హత్యచేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అధికారపక్ష వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం...

నేరానికి వీరతిలకం

ఆంధ్రప్రదేశ్ లో, దళితుడైన తన కారు డ్రైవర్ ని హత్యచేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అధికారపక్ష వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలునుంచి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, షరతులకు లోబడి, యాభైవేల పూచీకత్తుతో జైలుబయటకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అనుచరులు ఘనస్వాగతం పలికారు. వందలమంది ఆయన కారు మీద పూలవర్షం కురిపిస్తూ, జేజేలతో స్వాగతించారు. కారులోనుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తున్న ఆయన మీద పూలు విసిరారు, కంఠాన్ని మాలలతో అలంకరించారు. ఈ దృశ్యం చూడగానే చాలామందికి బిల్కిస్ బానో నిందితులకు అందిన సత్కారం గుర్తుకొచ్చింది. వారంతా పదిహేనేళ్ళు జైల్లో ఉండి విడుదలైనా, వారి ఘాతుకాన్ని గుర్తుచేసుకొని, సత్కారం అందినందుకు దేశం ఆగ్రహించింది. ఇప్పుడు, ఆర్నెల్ల క్రితం ఒక దళిత కారుడ్రైవర్ ను పాశవికంగా హత్యచేసి, శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన నాయకుడిని ఘనంగా ఊరేగించిన దృశ్యం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం.

సాంకేతికంగా ఆయన ఇప్పుడు అధికారపక్షం మనిషి కాకపోవచ్చునుగానీ, ఆయనను రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదినుంచీ ప్రయత్నిస్తున్నదని మూడురోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే తెలియచెబుతున్నాయి. హైకోర్టు బెయిల్ నిరాకరిస్తే ఆయన సర్వోన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వాదనల సందర్భంగా న్యాయస్థానం జగన్ ప్రభుత్వాన్ని తప్పులతడక చార్జిషీట్లు దాఖలు చేస్తున్నందుకు తప్పుబట్టింది. డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న మర్నాడే ప్రభుత్వం వ్యూహాత్మకంగా చార్జిషీటు ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తించింది. 90రోజులు పూర్తయ్యాయి కాబట్టి ఓ తప్పులతడక చార్జిషీటు వేయడం, దానిని ఉపసంహరించుకోవడం, మళ్ళీ కొత్తది దాఖలు చేయడం, ఉపసంహరించుకోవడం...ఏమిటిది?’ అని ఘాటుగా ప్రశ్నించింది. సకాలంలో చార్జిషీటు దాఖలు చేయకపోడం, చేసినది సక్రమంగా లేకపోవడం, ఉపసంహరించుకోవడం వంటి పలు విన్యాసాలు, పోలీసులే నిందితుడికి మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునని చెప్పడం చూసినప్పుడు కేవలం సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చిన విషయం తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ సహకారం ఈ స్థాయిలో ఉన్నది కనుకనే, ఆ దళిత డ్రైవర్ తల్లిదండ్రులు కేసును సీబీఐకి అప్పగించవలసిందిగా హైకోర్టును ఆశ్రయించారు.

మే నెలలో సుబ్రహ్మణ్యాన్ని అతని ఇంటికి వచ్చి స్వయంగా తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ అనంతబాబు ఆ తర్వాత తెల్లవారుజామున డ్రైవర్ కు యాక్సిడెంట్ అయిందంటూ భౌతికకాయాన్ని కుటుంబీకుల వద్ద వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో కారులో ఎమ్మెల్సీ భార్య కూడా ఉన్నది. ఈ దళిత డ్రైవర్ శరీరంమీద ముప్పైరెండు గాయాలున్నందున అతడిని హింసించడంలో ఎమ్మెల్సీ భార్య సహా చాలామంది పాత్ర ఉన్నదనీ, పోలీసులు వారిని ప్రశ్నించలేదనీ, ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించలేదనీ, గడువులోగా కస్టడీ పిటిషన్ వేయడంలోనూ పోలీసులు ఉద్దేశపూర్వకమైన జాప్యం చేసినందున వారి దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నది బాధితుల వాదన. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి తరఫున వాదిస్తున్న ఓ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అనంతబాబుకు బెయిల్ సాధించిపెట్టడం కూడా ప్రభుత్వం అనంతబాబు పక్షాన ఉన్నదనడానికి ప్రత్యక్ష నిదర్శనమని దళిత సంఘాల ఆరోపణ.

హత్యజరిగి ఎనిమిది నెలలైనా, సదరు ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను ఎందుకు చంపాడో పోలీసులు తేల్చలేదు. పైగా, ఒక నిరుపేద దళిత యువకుడిని పొట్టనబెట్టుకున్న వ్యక్తిని పార్టీ శ్రేణులు ఒక యోధుడిలాగా, వీరుడిలాగా, అంతర్జాతీయ క్రీడల్లో విజేతలాగా ఊరేగించడం చూసినప్పుడు ఆగ్రహం, ఆవేదనా కలుగుతాయి. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకపోగా, వారిని భక్షించినవారిని పాలకులు కాపాడుకురావడం విషాదం. హత్యచేసి కూడా బెయిల్ సాధించగలిగానన్న గర్వమో, ప్రభుత్వం తన పక్షాన ఉన్నదన్న అహంకారమో తెలియదు కానీ, తలవంచుకొని జైలునుంచి వెళ్ళాల్సిన నిందితుడు తలెగరేసి, చేతులు ఊపుతూ ఒక ర్యాలీగా వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బిల్కిస్ నేరస్థుల సత్కారానికి ఆగ్రహించిన సమాజం, మాకు ఇప్పుడు అదే రకమైన అవమానం జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదన్న దళితుల ఆవేదన అర్థరహితమైనదేమీ కాదు.

Updated Date - 2022-12-16T01:38:46+05:30 IST