జోడు ప్రత్యర్థులున్న చోట, ‘జోడో’ ఏమి చెబుతుందో?!

ABN , First Publish Date - 2022-10-27T05:30:58+05:30 IST

ఏమీజరగడం లేదన్నట్టుగా, జరుగుతున్నా పట్టించుకోనక్కరలేదన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది కానీ, ఆ నడక మీద అంతా ఒక కన్నువేసే ఉన్నారు...

జోడు ప్రత్యర్థులున్న చోట, ‘జోడో’ ఏమి చెబుతుందో?!

ఏమీజరగడం లేదన్నట్టుగా, జరుగుతున్నా పట్టించుకోనక్కరలేదన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది కానీ, ఆ నడక మీద అంతా ఒక కన్నువేసే ఉన్నారు. ఇదేదో గొప్ప అద్భుతాలు సాధిస్తుందన్న ముందస్తు ఊహలు, భయాలు ఎవరికీ లేవు. కాకపోతే, చిలికి చిలికి గాలివాన లాగా, ఒక కలకలం, సంచలనంగా మారకపోతుందా అని కొందరు ఆశ పెట్టుకున్నారు. ప్రభంజనమే కాగలదన్న అత్యాశ కలిగినవారూ ఉన్నారు. జాగ్రత్తగా గమనిస్తే, రాహుల్ గాంధీ కూడా ఉద్దేశించని, సంకల్పించని అర్థాలను ఆదర్శాలను కొందరు ఈ పాదయాత్రలో వెదుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. వేసవి ఎడారిలాగా మారిపోయిన రాజకీయంలో అతను ఒక ఒయాసిస్సు కావచ్చు, అంతిమంగా ఒక ఎండమావిగా మాత్రమే మిగలవచ్చు.

తెలంగాణలోకి రాహుల్ గాంధీ ప్రవేశం సందడిగా జరిగింది. రాష్ట్రంలో యాత్ర మార్గాలు జనసమ్మర్దంతో కిక్కిరిసిపోతాయన్న వాగ్దానం ఆరంభంలోనే కనిపించింది. పండగ విరామం తరువాత గురువారం పాత పాలమూరు జిల్లాలోనే పునః ప్రారంభం కానున్నది. ఒకనాడు, ఆకలిచావులకు, రైతు ఆత్మహత్యలకు, వలసలకు, అభివృద్ధి రాహిత్యానికి, వివక్షకు ప్రతీకగా పరిగణన పొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, తనను షోకేస్ చేసి, ఉద్యమాన్ని నడిపించిన నేతలు రాష్ట్రసాధన తరువాత తనను నిరాదరణకు గురిచేశారని, ముక్కలు చెక్కలయి విలపిస్తున్నది. బహుశా, రాహుల్‌తో పాటు, ఆ విషాదం కూడా నడకలో పాల్గొంటుంది. చెప్పుకోవడానికి ఏలికలు వీలివ్వని దుఃఖాలన్నీ, అణగిపోయిన ఆవేదనలన్నీ పాలమూరులోనే కాదు, తక్కిన తెలంగాణ అంతటా కూడా రోడ్డెక్కుతాయి. అణచివేత అనుభవించిన అనేక శ్రేణులు, రాహుల్ యాత్రలో రాజకీయపార్టీ కాంగ్రెస్‌తో కాక, దేశాన్ని ఏకం చేయాలనే నినాదంతో గొంతు కలుపుతున్నారు. ఈ ఒక్క యాత్ర వరకే, ఈ ఒక్క ఆదర్శం వరకు మాత్రమే మా మద్దతు, అందుకోసం మాత్రమే ఆయన అడుగులో అడుగులు అని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రహదారులపై రాహుల్ ప్రయాణం, అనూహ్యమైన సహయాత్రికులను ఆవిష్కరించబోతోంది.

రాజకీయంగా మాత్రం, తెలంగాణ యాత్ర, రాహుల్‌కు జటిలమైనది. యాత్రే రాజకీయ లక్ష్యంతో చేస్తున్నది కాదని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మతతత్వాన్ని వ్యతిరేకించడం అంటే రాజకీయ వైఖరే కదా? రాజకీయ యాత్ర కాదనడంలో అర్థం, బహుశా, ఏ ఎన్నికల ప్రచారానికో, అధికార సాధనకో ఉద్దేశించి చేస్తున్నది కాదని చెప్పడం కావచ్చు. నిర్వాహకుల, యాత్రికుల దృష్టిలో ఇది కేవలం ఒక సామాజిక ఆదర్శాన్ని చాటి చెప్పడానికి, రాజకీయాలలో కనిపించకుండా పోయిన ఆర్ద్రత, సహానుభూతి, సోదరత్వం వంటి మానవీయ ఆవేశాలను ఆవిష్కరించడానికి చేస్తున్న యాత్ర కావచ్చును. కాంగ్రెస్‌ను, దాని గతకాలపు చరిత్రకు, వర్తమానంలోని నిరర్థక అస్తిత్వానికి ద్వేషించే అనేకులు కూడా, ఆ పరిమితులలోనే యాత్రలో భాగం అవుతున్నారు. కానీ, బాహాటంగా చెప్పుకోనంత మాత్రాన, నిరాకరించినంత మాత్రాన, రాజకీయ లక్ష్యాలను యాత్ర స్పృశించకుండా పోదు. లక్ష్యాలను మాత్రమే కాదు, రాజకీయ సంక్షోభాలను, సమస్యలను కూడా రోడ్డు మీదకు తేకుండా పోదు. తమిళనాడులో మొదలుపెట్టి, కేరళలో కొనసాగించి, తిరిగి తమిళనాడు గుండా కర్ణాటకలోకి వచ్చి, ఆ దారి మధ్యలో అటుగా కాసేపు ఆంధ్రప్రదేశ్‌ను పలకరించి తిరిగి కర్ణాటక నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి, చాలా పచ్చి, మొరటు, ముతక రాజకీయ సన్నివేశాలు, చాలా వ్యూహప్రాధాన్యం ఉన్న విధాన సంక్లిష్టతలు, సంశయాలు తారసపడబోతున్నాయి.

తమిళనాడుతో అయితే సమస్యే లేదు. మిత్రపక్షం, సెక్యులర్ పక్షం. కేరళలో మాత్రం కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అక్కడ కాంగ్రెస్ ప్రధానప్రతిపక్ష కూటమిని నడిపిస్తోంది. అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి కూడా భారతీయ జనతాపార్టీని, మతతత్వ రాజకీయాలను, విధానపరంగా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి, భారత్ జోడో నినాదంతో అక్కడి పాలక వామపక్షకూటమికి అభ్యంతరం ఏమీ లేదు. రేపు ఢిల్లీలో ప్రతిపక్షాలకు అధికార అవకాశం లభిస్తే, కాంగ్రెస్‌కు వామపక్షాలు మిత్రులే. కానీ, కేరళలో రాహుల్ అనుకూల జనప్రదర్శన, ఆ కూటమికి రాజకీయంగా హానిచేస్తుంది. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అక్కడక్కడ నిర్వహిస్తున్న పత్రికాసమావేశాలలో, ప్రజాసమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా, ఆయన వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని కానీ, మార్క్సిస్టు పార్టీని కానీ పేరుపెట్టి మాట్లాడలేదు. కానీ, ప్రజాసమస్యల ప్రస్తావన రాష్ట్రప్రభుత్వ పరిపాలనతీరునే సూచిస్తుంది. పైగా, కేరళలో రాహుల్ గాంధీ చురుకైన ప్రజారాజకీయవాదిగా మెలగాలని ప్రయత్నించారు. రోడ్డు పక్కన దుకాణాల వారితో మాట్లాడడం, పిల్లలను ఎత్తుకుని నడవడం, సన్నటి పడవలో తెడ్డువేస్తూ ప్రయాణించడం, ఇవన్నీ ప్రజలకు బాగా ఆకట్టుకున్నాయి. దానితో, మార్క్సిస్టుపార్టీ నాయకులు మొదట్లో కొంచెం తీవ్రంగానే విమర్శలు గుప్పించారు. కేరళలో తన లోక్‌సభ స్థానం వైనాడ్‌ను కాపాడుకోవడం మీదనే రాహుల్ గాంధీ దృష్టి పెడుతున్నారు తప్ప, తాను జాతీయప్రత్యామ్నాయం అయ్యే ప్రయత్నం చేయడం లేదని, అతనివి మెత్తటి హిందూత్వ విధానాలని సిపిఎం నేతలు విమర్శించారు. తరువాత, అగ్రనాయకత్వం నుంచి మందలింపులు వచ్చాయేమో, యాత్ర జోలికి మళ్లీ వెళ్లలేదు. ఇక, కర్ణాటకలో రాహుల్‌కు ఏ రాజకీయ సందిగ్ధతా లేదు. తన పార్టీ అక్కడ గట్టి ప్రతిపక్షంగా ఉన్నది, బిజెపి మీద ప్రజావ్యతిరేకత పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి, త్వరలో ఎన్నికలు రానున్న ఆ రాష్ట్రంలో రాహుల్ యాత్ర తప్పనిసరిగా తగిన ప్రభావం చూపిస్తుంది. యాత్రకు చెబుతున్న సామాజిక ఆదర్శం, ఆ రాష్ట్రంలో రాజకీయ నినాదం రెండూ పరస్పరం అనుకూలమైనవే కనుక, ఎటువంటి వైరుధ్యానికి ఆస్కారం లేదు. అక్కడ ఉండిన సమస్య, డికె శివకుమార్‌కు, సిద్దరామయ్యకు మధ్య ఉన్న ముఠా తగవులు. ఆ ఇద్దరినీ చెరోవైపు నిలుపుకుని, నడచిన రాహుల్ పార్టీ శ్రేణులకు ఇవ్వవలసిన సందేశమే ఇచ్చారు. కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వైరాలు ఎక్కువ. రాహుల్ యాత్ర ఏర్పాట్లు వారిలో తప్పనిసరి ఐక్యతను తెచ్చాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు జుగుప్సాకరమైన స్థాయిలో ఉన్నాయి. తన యాత్రలో అవి ప్రతిఫలించకుండా చూడడం, వీలయితే, వాటిని పరిష్కరించడం రాహుల్ ముందున్న పెద్ద సమస్య. కానీ, అంతకంటె పెద్ద సమస్య, ఆయన యాత్ర ద్వారా వ్యక్తం కావలసిన ముఖ్యసందేశం ఏమిటన్నది. కేరళ లాంటి పరిస్థితి కాదు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి ఏ స్థాయిలోనూ కాంగ్రెస్‌తో సంబంధాలు, స్నేహాలు లేవు. 2018 ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. ఇప్పుడు పరిస్థితి మారింది, భారతీయ జనతాపార్టీ బలం పెరుగుతున్నది. ఏ కారణం వల్లనో టిఆర్ఎస్ అధినేత కూడా తన ప్రత్యర్థి బిజెపియే అన్న అభిప్రాయం కలిగిస్తూ వచ్చి, ఆ పార్టీ పెరుగుదలకు దోహదం చేశారు. అధికారపార్టీకి ప్రధాన ప్రత్యర్థి హోదా కోసం బిజెపి కాంగ్రెస్‌తో తలపడుతున్నది. జాతీయస్థాయిలో బిజెపితో ఒక పోరాటం, రాష్ట్రస్థాయిలో మరో పోరాటం. అదే సమయంలో, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బలపడుతున్న వ్యతిరేకతను రాజకీయలాభంగా మార్చుకోవలసిన కర్తవ్యం కూడా కాంగ్రెస్ మీద ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధ్యం చేసిన పార్టీగా కాంగ్రెస్, తనకున్న అదనపు యోగ్యతను జనామోదంగా మలచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఇది. ఈ సమయంలో రాహుల్ గాంధీ, కేవలం బిజెపికి వ్యతిరేకమైన నినాదాన్ని మాత్రమే ఇస్తూ సాగిపోతే, అది సరైన సందేశమే అవుతుందా?

మునుగోడు ఎన్నికల పోరాటాన్ని రాహుల్ గాంధీ పట్టించుకోనక్కరలేదు. పెద్ద జాతీయలక్ష్యం కలిగిన ఒక కార్యక్రమాన్ని, ఒక చిన్న స్థానిక ఉపఎన్నికతో ముడిపెట్టవలసిన అవసరం లేదు. కానీ, మునుగోడుతో లంకె పడి ఉన్న పరిణామాలను రాహుల్ పరిగణనలోకి తీసుకోవాలి. రెండోస్థానంలోకి, అంటే, అధికారపార్టీకి ప్రధాన ప్రత్యర్థి హోదాలోకి రావడానికి బిజెపికి మునుగోడు ఒక వేదిక. అందుకోసమే, అది ఉప ఎన్నికను కల్పించింది. అన్నీ అనుకూలించి, మునుగోడు గెలిస్తే, తక్షణమే పర్యవసానాలు ఉంటాయని, రెండో స్థానం మాత్రమే దక్కితే, రాబోయే ఎన్నికలలో అధికార ఫలితాలు సాధిస్తామని బిజెపి చెప్పుకుంటోంది. ఈ సమయంలో బిజెపిని మాత్రమే సంబోధించి ఇచ్చే సందేశం, ఓటర్లకు ఎట్లా అర్థమవుతుంది? కాంగ్రెస్, టిఆర్ఎస్ ఒక జట్టు అన్న అభిప్రాయం కలిగితే, 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ఉనికికే అది దెబ్బ కదా? పరిపాలనా పద్ధతులలో, అప్రజాస్వామికతలో బిజెపి, టిఆర్ఎస్ ఇద్దరూ ఒకటేనని చెప్పడం కదా నిజానికి జరగవలసింది? అందువల్ల, రాహుల్ గాంధీ, తన రెండు వైరిశిబిరాలను గుర్తించి, ఆచితూచి, వ్యవహరించవలసి ఉంటుంది. నేరుగానో, నర్మగర్భంగానో చెప్పవలసింది చెప్పడమే వివేకం కావచ్చు.

రాహుల్ గాంధీ ఎక్కడా రాజకీయ ప్రకటనలు చేయకపోవచ్చు. పత్రికా సమావేశంలో క్లుప్తంగా వైఖరులు మాత్రమే చెప్పి ఊరుకోవచ్చు. కానీ, ఆయన తెలంగాణ యాత్ర ఇక్కడ సిద్ధంగా ఉన్న వాతావరణాన్ని ఏదో ఒక రీతిలో ప్రభావితం చేయకపోదు. వచ్చే సంవత్సరం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మనసును సిద్ధం చేసుకుంటున్న సాధారణ ఓటరు దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిలబడుతుంది అన్నది రాహుల్ యాత్ర నిర్ణయిస్తుంది. లోపలి శత్రువులపై ఎంత కఠినంగా ఉండగలిగితే అంతటి దృఢత్వం పార్టీకి వస్తుంది. చిన్న నాయకుడు కూడా అగ్రనేతను బెదిరించగలిగితే, పార్టీ తరఫున సంపాదించుకున్న జనసమ్మతిని పదవికో ప్రలోభానికో అమ్మేసుకోగలిగితే, ఇక ఆ సంస్థ మీద గౌరవం ఏముంటుంది? భారత్ ను కలపడానికి, విడదీయడానికి మధ్య ఫిరాయింపులు జరిపే నీతిమంతుల వల్ల పార్టీకి ఏమి ప్రయోజనం? ఓటర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ అంగడిసరుకులను చేసి అపహసిస్తున్న తెలంగాణ రాజకీయ రంగం మీద ఆదర్శాల యాత్ర, దున్నపోతు మీద వానగా విఫలమైపోదా?

కె. శ్రీనివాస్

Updated Date - 2022-10-27T05:30:58+05:30 IST