Election Results Live Updates: గుజరాత్ ఫలితంపై ప్రధాని భావోద్వేగ స్పందన.. ఘోర ఓటమికి కారణం చెప్పిన కాంగ్రెస్..

ABN , First Publish Date - 2022-12-08T07:45:18+05:30 IST

గుజరాత్‌ (Gujarat Election Results), హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh Election Results) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్‌లో బీజేపీ దూసుకెళ్తోంది. 2017 విజయాన్ని అధిగమించి రికార్డ్ సృష్టించింది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అధికార బీజేపీ చతికిలబడగా కాంగ్రెస్ గట్టి సవాల్ విసిరి అధికారానికి చేరువగా ఉంది.

Election Results Live Updates: గుజరాత్ ఫలితంపై ప్రధాని భావోద్వేగ స్పందన.. ఘోర ఓటమికి కారణం చెప్పిన కాంగ్రెస్..

06:30 pm సుపరిపాలన, సత్వర అభివృద్ధి వల్లే గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీని రికార్డ్ మెజారిటీతో గెలిపించారు: త్రిపుర సీఎం మాణిక్ సాహా

05:31 pm గుజరాత్ ఫలితాలపై భావోద్వేగంగా స్పందించిన ప్రధాని మోదీ

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు. అసాధారణ విజయాన్ని కట్టబెట్టిన గుజరాత్ జనశక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ థ్యాంక్యూ గుజరాత్. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి నేను చాలా భావోద్వేగాలకు లోనయ్యాను. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిపూర్వక పరిస్థితులను కొనసాగించాలనే కోరికను ప్రజలు తెలియజేశారు. గుజరాత్ జనశక్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని పేర్కొంటూ ఆయన ట్విట్ చేశారు.

Untitled-5.jpg

05:01 pm హిమాచల్‌ ప్రజలకు ధన్యవాదాలు: రాహుల్ గాంధీ

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాత్మక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

Untitled-13.jpg

4:40 pm జాతీయ పార్టీగా అవతరించిన ఆప్: కేజ్రీవాల్ ప్రకటన

గుజరాత్‌లో తొలిసారి ఖాతా తెరిచిన ఆప్ (AAP) జాతీయ పార్టీగా (national party) అవతరించిందని ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘పదేళ్లక్రితం ఆప్ ఒక చిన్న పార్టీ. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడుపుతోంది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Untitled-12.jpg

4:35 pm గుజరాత్‌లో బీజేపీకి మద్ధతిచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: కేంద్ర హోమంత్రి అమిత్ షా

Untitled-11.jpg

4:16 pm హిమాచల్ గెలుపులో రాహుల్ భారత్ జోడో యాత్ర తోడ్పడింది

హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ విజయంపై మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘ హిమాచల్ ఎన్నికలు గెలుచుకున్నాం. ఈ ఫలితానికి కారణమైన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరికీ నా అభినందనలు. ప్రియాంక గాంధీతోపాటు రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఈ విజయానికి తోడ్పడ్డాయి. సోనియా గాంధీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’ అని మల్లికార్జున ఖర్గే అన్నారు.

Untitled-10.jpg

03:58 pm కాంగ్రెస్ ఓటమి వెనుక ఆప్, అసదుద్దీన్ ఒవైసీ: గుజరాత్ కాంగ్రెస్ చీఫ్

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెత్త ఓటమి వెనుక ఆప్ (APP), అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జే థాకూర్ ఆరోపించారు. ‘‘ కాంగ్రెస్‌ ఓటు షేర్ తగ్గడానికి ఆప్, ఒవైసీలు ఒక కారణమనేది సత్యం. ఘోర ఓటమిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి వైఫల్యాలను విశ్లేషించుకుంటాం. తదుపరి ప్రభుత్వం వాగ్దాలను నెరవేరుస్తుంది ఆశిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

03:35 pm సీఎం భూపేంద్ర పటేల్‌కు జేపీ నడ్డా అభినందనలు

గుజరాత్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సీఎం భూపేంద్ర పటేల్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. గుజరాత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయానికి కారణమైన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను ఆయన మెచ్చుకున్నారు.

03:01 pm కొద్దిసేపట్లో గవర్నర్‌కు రాజీనామా: హిమాచల్ సీఎం

మరికొద్ది సేపట్లోనే తన రాజీనామాను గవర్నర్‌కు పంపిస్తానని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్ వెల్లడించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు వెల్లడించారు. కాగా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆయనీ ప్రకటన చేశారు.

Untitled-9.jpg

2:49 pm రవీంద్ర జడేజా భార్య రవిబా జడేజా గెలుపు!

గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవిబా జడేజా ఘనవిజయం సాధించారు. ఈసీ అధికారిక డేటా ప్రకారం.. తన సమీప అభ్యర్థి కంటే రవిబా 50,456 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. గెలుపు ఖాయమవ్వడంతో భర్తతో కలిసి ఆమె రోడ్‌షో నిర్వహించారు.

Untitled-8.jpg

2:40 pm చండీగఢ్‌కు హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి 14 చోట్ల గెలుపొంది మరో 25 చోట్ల ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీ మేజిక్ ఫిగర్ 35 మార్క్‌ను అధిగమించేలా కనిపిస్తోంది. అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలు ‘ఆపరేషన్ కమలం’ బారినపడకుండా అప్రమత్తమవుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలందరినీ చండీగఢ్ తరలిపించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. తదుపరి ఎలాంటి అడుగు వేయాలనేదానిపై అక్కడే చర్చిస్తారని రిపోర్టులు వెలువడుతున్నాయి.

2:15 pm ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల ప్రజలకున్న విశ్వసనీయత, ప్రజాదరణ వల్లే గుజరాత్‌లో ఇంతటి ఘన విజయం: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

2:02 pm ప్రజల తీర్పును హూందాగా స్వీకరిస్తున్నాం: గుజరాత్ సీఎం

గుజరాత్‌లో అధికారం ఖాయమవ్వడంతో ఆ రాష్ట్ర సీఎం భూపేందర్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ‘‘గుజరాత్ ఎన్నికల ఫలితం స్పష్టమైంది. గుజరాత్‌ అభివృద్ధితో కలిసి ప్రయాణించాలని ఓటర్లు నిర్ణయించారు. ప్రజల తీర్పును హూందాగా స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Untitled-7.jpg

01:45 pm 12న గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారం..

గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం డిసెంబర్ 12న జరగనుంది. భూపెన్ పటేల్ ప్రమాణం చేయనున్న ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు.

01:25 pm హిమాచల్‌లో మొదలైన రిసార్ట్ రాజకీయాలు !

హిమాచల్‌ప్రదేశ్‌లో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1:15 గంటల సమయానికి 7 స్థానాల్లో గెలుపు, 32 చోట్ల ఆధిక్యాలతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇక 7 విజయాలు, 19 చోట్ల లీడ్‌లో ఉన్న బీజేపీ రేసులో వెనుకబడిపోయింది. అయితే తమ కొత్త ఎమ్మెల్యేలు ఎక్కడ ‘ఆపరేషన్ కమలా’నికి ఎక్కడ ఆకర్షితులవుతారోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ముందుజాగ్రత్తగా రిసార్ట్ రాజకీయలు మొదలుపెట్టింది. నూతన ఎమ్మెల్యేలందరినీ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ తరలించాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక చార్టర్డ్ ఫ్లైట్‌ను పార్టీ సిద్ధం చేసినట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. కాగా హిమాచల్‌లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భాఘెల్, కీలక నేతలు రాజీవ్ శుక్లా, భూపేందర్ హుడాలను హిమాచల్‌‌కు పంపిస్తోంది.

Untitled-6.jpg

12:57 pm ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడాం: గుజరాత్ కాంగ్రెస్ నేత..

ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే కాంగ్రెస్ ఓటమిపాలయ్యిందని ఆ పార్టీ గుజరాత్ నేత భారత్‌భాయ్ వెల్జిభాయ్ సోలంకి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గాంధీధామ్ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు.

12:44 pm ఫుల్‌జోష్‌లో హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు

ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. బీజేపీ 24 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబురాలు మొదలుపెట్టారు. సిమ్లాలో ఆ పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు.

Untitled-5.jpg

12:30 pm హిమాచల్‌లో మరింత పెరిగిన కాంగ్రెస్ ఆధిక్యం..

ఉత్కంఠ రేపుతున్న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం మరింత పెరిగింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో 39 స్థానాల్లో కాంగ్రెస్, 26 చోట్ల బీజేజీ, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. హోరాహోరీ పోరు ఖాయమనుకున్నప్పటికీ బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 35 గా ఉంది.

12:01 pm రికార్డ్ విజయం దిశగా బీజేపీ

గుజరాత్ ఎన్నికలు-2022 ఫలితాల్లో (Gujatat election results) తాజా ట్రెండ్స్ ప్రకారం.. 154 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. దీంతో అధికార పార్టీకి రికార్డ్ స్థాయి విజయం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో 2002 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 127 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ రికార్డు చెరిగిపోవడం పక్కాగా కనిపిస్తోంది.

Untitled-4.jpg

11.57 am హిమాచల్‌లో ఖాతా తెరిచిన బీజేపీ..

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఖాతా తెరిచింది. సుందర్‌నగర్ సీటులో ఆ పార్టీ నేత రాకేష్ జన్వాల్ విజయం సాధించారు.

11:26 am హిమాచల్‌లో మారుతున్న సమీకరణం

ఉత్కంఠ రేపుతున్న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌లో సమీకరణం మారుతోంది. హోరాహోరీ పోరులో ఉదయం 11:20 గంటల సమయంలో బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35 కాగా 38 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. కాగా బీజేపీ 27 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. కాగా అవకాశం వస్తే జారవిడుచుకోకూడదని భావిస్తున్న బీజేపీ అసలైన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం 1-3 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్న స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవ్వొచ్చని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడంపై దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించింది. స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడంపై ఆయన ఇప్పటికే పావులు కదపడం మొదలుపెట్టారు. మరి ఫలితాలు ముగింపు సమయానికి సమీకరణాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

Untitled-2.jpg

11:12 am సాయంత్రం 6 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

Untitled-1.jpg

11:01 am గుజరాత్‌లో పార్టీల ఆధిక్యంపై ఈసీ అఫీషియల్ డేటా విడుదల..

Untitled-11.jpg

10:42 am హిమాచల్‌లో అసలు రాజకీయం మొదలుపెట్టిన బీజేపీ..

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం దాదాపు ఖాయమైంది. దీంతో యావత్‌దేశం దృష్టంతా హిమాచల్‌ప్రదేశ్ కౌంటింగ్‌పైనే పడింది. ఇక్కడ జరుగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వా -నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఉదయం 10:37 గంటల సమయంలో బీజేపీ 31, కాగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 35గా ఉండాలి. దీంతో అధికార పార్టీ బీజేపీ అసలైన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం 3-5 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్న స్వతంత్రులు కీలకం కాబోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. స్వతంత్రులను తమవైపు లాక్కోవడంపై దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించింది. స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడంపై ఆయన ఇప్పటికే పావులు కదపడం మొదలుపెట్టారు. మరి ఫలితాలు ముగింపు సమయానికి సమీకరణాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

Untitled-10.jpg

10:26 am గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ నయా చరిత్ర!

గుజరాత్ ఎన్నికల్లో అతిభారీ విజయంతో బీజేపీ చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదయం 10:25 గంటల సమయంలో ఎవరూ ఊహించని స్థాయిలో ఏకంగా 158 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉండగా.. ఆప్ 6, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Untitled-9.jpg

10:05 am పార్టీల వారీగా ఓటు షేర్ విడుదల

గుజరాత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఉదయం 10 గంటల వరకు నమోదైన ఓటు షేర్‌ను పార్టీల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసింది.

బీజేపీ - 52.8 శాతం

కాంగ్రెస్ - 26.8 శాతం

ఆప్ - 14 శాతం చొప్పున ఓటు షేర్ సాధించాయి.

Untitled-8.jpg

9:50 am పండగ చేసుకుంటున్న గుజరాత్ బీజేపీ కార్యకర్తలు!

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అధికార బీజేపీ మరోసారి విజయఢంకా మోగించడం ఖాయమనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉండగా ఉదయం 9:45 గంటలకు బీజేపీ 145కిపైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. ఆప్ పార్టీ 10 చోట్ల, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల సంఘం అఫీషియల్ ట్రెండింగ్‌లో కూడా 92కిపైగా స్థానాల్లో బీజీపీ లీడ్‌లో కొనసాగుతోంది. దీంతో గుజరాత్ బీజేపీ కేడర్, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. గెలుపు పండగను ముందుగానే మొదలుపెట్టారు.

Untitled-7.jpg

9:25 am రాజస్థాన్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ ప్లాన్ !

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ఉదయం 9:25 గంటల సమయానికి మొత్తం 68 స్థానాలకుగానూ కాంగ్రెస్ 33 స్థానాల్లో, బీజేపీ 31 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ట్రెండింగ్‌ను బట్టి చూస్తే కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉండడంలో అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ తరపున గెలిచే అభ్యర్థులను రాజస్థాన్‌ తరలించాలని యోచిస్తోంది. ఈ బాధ్యతలను చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్, సీనియర్ నేత భూపేందర్‌ సింగ్‌ హూడాలకు అప్పగించారని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘ఆపరేషన్ కమలం’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ అడుగులు వేస్తోందని సమాచారం.

Untitled-6.jpg

9:10 am అఫీషియల్ ట్రెండ్స్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

Untitled-4.jpg

Untitled-4.jpg

9:08 am ఉదయం 9 గంటలకు ఇదీ ట్రెండింగ్..

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యి గంట సమయం దాటింది. ఉదయం 9 గంటల సమయానికి గుజరాత్‌లో బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. బీజేపీ 134 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 36 చోట్ల, ఆప్ 4, ఇతరుల 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరో రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు కనిపిస్తోంది. మొత్తం 68 స్థానాలుండగా బీజేపీ 30, కాంగ్రెస్ 29 స్థానాల్లో ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

9:00 am ఆధిక్యంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవిబా జడేజా..

బీజేపీ తరపున ఎన్నికల బరిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవిబా జడేజా లీడ్‌లో కొనసాగుతున్నారు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు.

Untitled-3.jpg

8:56 am బీజేపీ 135-145 సీట్లు గెలుస్తుంది: హార్ధిక్ పటేల్

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో 135 నుంచి 145 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కీలక నేత హార్ధిక్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Untitled-2.jpg

8:40 am గుజరాత్‌లో 100కిపైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

గుజరాత్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా ఉన్నాయి. మొత్తం 182 స్థానాలకుగానూ 8:40 గంటల సమయంలో 113కిపైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 31, ఆప్ 4, ఇతరులు 1 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉన్నాయి. దీనిని బట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బీజేపీకి ఎక్కువగా వచ్చాయని ఆరంభ ట్రెండింగ్ స్పష్టం చేస్తోంది.

8:30 am హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ !

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఆరంభ ట్రెండింగ్‌ను చూస్తే అర్థమవుతోంది. మొత్తం 68 స్థానాలు ఉండగా 8:30 గంటల సమయానికి బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.

8:20 am గుజరాత్‌లో బీజేపీ దూకుడు...

గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ ఆరంభంలో బీజేపీ దూసుకెళ్తోంది. 8:20 గంటల సమయానికి 182 స్థానాలకుగానూ బీజేపీ 72 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో, ఆప్ ఒక స్థానంలో లీడ్‌లో ఉన్నాయి.

08:00 am ప్రచార పర్వం నుంచి, పోలింగ్ డే వరకూ అడుగడుగునా ఆసక్తితో సాగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

07:30 am: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..

exit-polls.jpghimachal.jpg

గుజరాత్‌ (Gujarat Election Results), హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh Election Results) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు రానే వచ్చింది. ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ వీక్షకులు ఈ ఎన్నికల ఫలితాలను మినిట్ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్‌ (Election Results Live Updates) మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటు.. ఫలితాలకు సంబంధించిన హైలైట్స్ అన్నీ మీ చెంత ఉన్నట్టే. గుజరాత్‌లో (Gujarat Exit Polls) మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు (Gujarat Assembly Seats) ఉండగా మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ శీతల రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా పోరు నడుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి, హిమాచల్‌ ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రానుందని తేల్చింది.

గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 131 సీట్లను కమలం పార్టీ కైవసం చేసుకుంటుందని తేలినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 68 స్థానాలకుగాను కమలం పార్టీ 37 సీట్లను గెలుచుకుని అధికారాన్ని దక్కించుకుంటుందని తెలిపింది. కాగా, ఈసారి గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభావం చూపిస్తుందని మొదటి నుంచీ అందరూ అంచనా వేసినా.. ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం అటువంటిదేమీ కనిపించలేదని దాదాపు అన్ని సంస్థలూ తేల్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్‌ చీల్చిందని, అది కాంగ్రెస్‌కు భారీగా నష్టం చేకూర్చిందని అంచనా వేశాయి.

Updated Date - 2022-12-08T18:35:01+05:30 IST