Gujarat Polls: ఒక్క శాతం ఓటింగ్ షేర్ లేకున్నా...షంషేర్ అంటున్న పార్టీలు

ABN , First Publish Date - 2022-11-26T15:12:02+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అంచనాగా ఉన్నప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ సైతం పట్టుదలగా బరిలోకి దిగడంతో...

Gujarat Polls: ఒక్క శాతం ఓటింగ్ షేర్ లేకున్నా...షంషేర్ అంటున్న పార్టీలు

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు (Gujarat polls) ఈసారి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అంచనాగా ఉన్నప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం పట్టుదలగా బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. వీటికి తోడు పలు చిన్నాచితకా పార్టీలు, గతంలో తక్కువ ఓటింగ్ షేర్‌తో చతికిలబడిన పార్టీలు కూడా ఈసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాతం కంటే తక్కువ ఓటింగ్ షేర్ సంపాదించిన పలు పార్టీలు సైతం ఈసారి బరిలోకి దిగడంతో పాటు గతంలో కంటే మరింత మంది ఎక్కువ అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం విశేషం.

ఆప్, మజ్లిస్ నుంచి బీఎస్‌పీ వరకూ...

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2017 ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ పడింది. కేవలం 0.1 శాతం ఓట్లు గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 181 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో 4 సీట్లకు పోటీపడి 0.01 శాతం ఓటింగ్ షేర్ సంపాదించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ఈసారి 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2017లో ఆ పార్టీ పోటీ చేసిన నాలుగు స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్ సైతం కోల్పోయారు. కాగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) సైతం ఈసారి 26 మంది అభ్యర్థులను పోటీలోకి దింపింది. గత పర్యాయం బీటీపీ రెండు సీట్లు గెలుచుకుంది. 0.74 శాతం ఓటింగ్ షేర్ సంపాదించింది.

గుజరాత్ ఎన్నికల్లో మొదటిసారిగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (AIMIM) పార్టీ పోటీ చేస్తోంది. 13 మంది అభ్యర్థులను ఈసారి ఎన్నికల బరిలోకి దింపింది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నుంచి 101 మంది అభ్యర్థులను పోటీ పడుతున్నారు. అయితే, గతం కంటే ఈసారి తక్కువ మంది అభ్యర్థులే ఆ పార్టీ నుంచి పోటీపడుతున్నారు. 2017 ఎన్నికల్లో 139 మంది అభ్యర్థులను బీఎస్‌పీ బరిలోకి దింపింది. కేవలం 0.69 శాతం ఓటింగ్ షేర్ పొందింది. గత ఎన్నికల్లో ఒక శాతం కంటే తక్కువ ఓటింగ్ షేర్ సాధించిన పార్టీలు సైతం ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడుతుండటంతో వీరు ఈసారి సత్తా చాటుకుంటారా, ప్రధాన పార్టీల బలాబలాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉందా అనేది ఫలితాల అనంతరమే తేలుతుంది.

Updated Date - 2022-11-26T15:15:18+05:30 IST