Gujarat, Himachal polls: రికార్డు స్థాయిలో నగదు, మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-11-11T14:48:54+05:30 IST
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రికార్డు స్థాయిలో అక్రమ నగదు, మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్..
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రికార్డు స్థాయిలో అక్రమ నగదు, మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు వెల్లడించింది. ఈనెల 12వ తేదీ శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టుబడిన అక్రమ నగదు, మద్యం ఐదు రెట్లు పెరిగింది. గతంలో రూ.9.03 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడగా, ఈసారి అది రూ.50.28 కోట్లకు చేరింది. గుజరాత్‌లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. 2017 అసెంబ్లీకి ముందు పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ.17,21 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకోగా, గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి ఇంతవరకూ రూ.71.88 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.