Tiruppavai: పాముపై నిద్రపోతున్న బీజం...

ABN , First Publish Date - 2022-12-20T20:37:11+05:30 IST

ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన.... రోచిష్మాన్

Tiruppavai: పాముపై నిద్రపోతున్న బీజం...
Andal Tiruppavai Pasuram 06

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఆరోరోజు; తిరుప్‌పావై ఆరో పాసురమ్ రోజు.

పాసురమ్ 06

ఆణ్డాళ్ ఆఱో పాసురమ్‌లో "మేలుకో" అంటూ గోపకన్యను నిద్రలేపుతోంది. ఆ మేలుకోమనడం చక్కటి చిత్రణతోనూ, నిగూఢమైన తాత్త్విక చింతనతోనూ సమన్వితమైంది. అదేంటో తెలుసుకుందాం రండి...

మూలం-

పుళ్ళుఞ్‌సిలమ్బిన కాణ్; పుళ్ళరైయన్ కోయిల్

వెళ్ళై విళిసఙ్గిన్ పేరరవమ్ కేట్టిలైయో?

పిళ్ళాయ్! ఎళ్షున్దిరాయ్; పేయ్ ములై నఞ్‌జున్డు,

కళ్ళచ్ చగడం కలక్కళ్షియక్ కాలోచ్చి

వెళ్ళత్ తరవిఱ్ తుయిలమర్‌న్ద విత్తినై

ఉళ్ళత్తుక్ క్కొణ్డు మునివర్గళుమ్, యోగిగళుమ్

మెళ్ళ వెళ్షున్దు అరియెన్ఱ పేరరవమ్

ఉళ్ళమ్ పుగున్దు కుళిర్‌న్దేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

పక్షులు కిచకిచలాడుతున్నాయి చూడు; పక్షిరాజుకు రాజైన వాడి కోవెలనుంచి

తెల్లని పిలుపులశంఖపు పెనురావం వినిపించడం లేదా?

చిన్నదానా! మేలుకో; పిశాచి చన్నుల విషం తాగి,

కపటశకటాన్ని ధ్వంసం అయ్యేట్లు కాళ్లతో తన్ని

పాలకడలిలో పాముపై నిద్రపోతున్న బీజాన్ని

హృదయంలో నిలుపుకుని మునులూ, యోగులూ

మెల్లగా లేచి హరి అని అంటున్న పెనురావం

హృదయంలోకి చొరబడగా, చల్లగా; ఓలాల నా చెలీ!

అవగాహన-

ఈ పాసురమ్‌లో పక్షిరాజుకు రాజైన వాడు అంటే మహావిష్ణువు. పక్షిరాజు గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడి రాజు మహావిష్ణువు.

ఆణ్డాళ్ కాలంలో గుళ్లల్లో తెల్లవారుజామున కైంకర్యాలు మెదలయ్యే ముందు శంఖారావం చేసి ఊరి వాళ్లను పిలిచే ఒక వాడుక లేదా ఆచారం ఉండేదని 'పిలుపుల శంఖపు పెనురావం' అని అనడం ద్వారా తెలియవస్తోంది.

పిశాచి అనడం రక్కసి పూతననూ, కపటశకటం అనడం శకటాసురుణ్ణీ సూచిస్తోంది‌. "పిశాచి చన్నుల విషం తాగి" అన్నప్పుడు పైశాచికత్వపువిషం దైవత్వాన్ని చంపలేదనీ, "కపటశకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని" అన్నప్పుడు కపటం శకటమై‌ మీదపడితే దైవత్వం దాన్ని ధ్వంసం చేస్తుందనీ ఆణ్డాళ్ చెప్పకుండానే చెబుతోంది.

"పాముపై నిద్రపోతున్న బీజం" అనడం ఆణ్డాళ్ మాత్రమే అనగలదేమో? పరమాత్మే మొత్తం సృష్టికి బీజం. "జన్మాద్యస్య యతః" అంటూ ఒక బ్రహ్మసూత్రం (1-1-2) ఈ మొత్తం సృష్టికి ఏది ఆదిగా ఉందో అది బ్రహ్మం అని తెలియజెప్పింది. భగవద్గీత (అధ్యాయం 7 శ్లోకం 10)లో కృష్ణుడు "బీజం మాం సర్వభూతానాం..." అని చెబుతాడు. అంటే నేను సర్వభూతాలకు బీజాన్ని అని అర్థం. ఆణ్డాళ్ ఆ భావాన్నే ఇక్కడ గొప్పగా అందించింది. పాము ఆధ్యాత్మికతకు చిహ్నం.

"హరి" అన్నది పెనురావమై హృదయంలోకి చొరబడాలి లేదా చొచ్చుకునిపోవాలి ఆపై చల్లగా మేలుకోవాలి. ఎంతో గొప్పగా చెప్పింది ఆణ్డాళ్! పెనురావం చొరబడ్ద తరువాత హృదయం చల్లగా ఉంటుందా? అప్పుడు మేలుకోవాలా? అదేం పరిస్థితి? అది శ్రేష్ఠమైనస్థితి! అదే వాంఛనీయమైన స్థితి! అర్థం చేసుకుందాం.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon

రోచిష్మాన్

9444012279

Updated Date - 2022-12-21T08:30:27+05:30 IST