Tiruppavai: పుట్టపాము పడగలాంటి జననాంగమున్న...
ABN , First Publish Date - 2022-12-25T23:23:39+05:30 IST
ఈ మాటలను తాంత్రికంగా పరిగణించాలా? తంత్ర గ్రంథాలు ఏమంటున్నాయంటే... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం పదకొండోరోజు; తిరుప్‌పావై పదకొండోపాసురమ్ రోజు.
పాసురమ్ 11
ఆణ్డాళ్, ఎంతకీ నిద్రలేవని గోపకన్యను ఎందుకు నీకు ఈ నిద్ర? అని అడుగుతూ ఇదిగో ఇలా పదకొండోపాసురాన్ని అందుకుంది; ఆలకిద్దాం రండి..
మూలం-
కఱ్ట్రుక్ కఱవైక్ కణఙ్గళ్ పలకఱన్దు
సెఱ్ట్రార్ తిఱలళ్షియచ్ చెన్ఱు సెరుచ్ చెయ్యుమ్
కుఱ్ట్రమొన్ఱిల్లాద కోవలర్ తమ్ పొఱ్కొడియే!
పుఱ్ట్రరవల్గుల్ పునమయిలే! పోదరాయ్;
సుఱ్ట్రత్తుత్ తోళ్షిమార్ ఎల్లారుమ్ వన్దునిన్
ముఱ్ట్రమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
సిఱ్ట్రాదే, పేసాదే సెల్వప్ పెణ్డాట్టి నీ
ఎఱ్ట్రుక్కుఱఙ్గుమ్ పొరుళేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
దూడలతో ఉన్న పలు పాడి ఆవుల పాలు పితికే,
శత్రువులు పతనమయ్యేట్టుగా యుద్ధం చేసే
ఏ దోషమూ లేని గోపాలుల బంగారు వల్లరీ!
పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరీ! లేచిరా;
చుట్టాలైన తోటివాళ్లందఱూ వచ్చి నీ
ముంగిలిలోకి చేరి మేఘవర్ణుడి నామగానం చేస్తున్నా
కదలకుండా, పలకకుండా సౌభాగ్యవతీ! నువ్వు
ఎందుకు ఇలా ఉన్నావ్? నీ నిద్రకు అర్థం ఏముంది?; ఓ లాల నా చెలీ!
అవగాహన-
గోపాలులు పాలు పితికే వాళ్లు మాత్రమే కాదు శత్రువులు పతనం అయ్యేట్లుగా యుద్ధం చేసేవాళ్లు కూడా... అని చెబుతూ అలాంటి వాళ్ల "బంగారు వల్లరీ" అని గోపకన్యను ముద్దు చేస్తోంది ఆణ్డాళ్.
ఇక్కడ ఆణ్డాళ్ అన్న "పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరీ" మాటల్ని జాగ్రత్తగా గ్రహించాల్సి ఉంటుంది. ఈ మాటలను తాంత్రికంగా పరిగణించాలని తోస్తోంది. పాము ఆధ్యాత్మికతకు, కుండలినీ శక్తికి ప్రతీక. కుండలినీశక్తిని సర్పశక్తి అనీ అంటారు. వెన్నెముక కొన నుంచి తలలోని మెదడు వఱకు ఉన్న భాగం పడగతో ఉన్న పాములా ఉంటుందని తంత్రగ్రంథాలు చెబుతాయి. ఇక్కడ స్త్రీ జననాంగాన్ని పాము పడగగా ఆణ్డాళ్ చెప్పింది. సర్పశక్తి అధో ముఖమై ఉందని చెప్పడం ఆణ్డాళ్ ఉద్దేశం అని అర్థం ఔతోంది. "వనమయూరీ" అని అనడంలో విశేషముంది. నెమళ్లకు శారీరిక కలయిక ఉండదు అని ఆనాటి ఎఱుక. వనమయూరీ అన్నప్పుడు శారీరికంగా ఎవరితోనూ కలవని కన్య అని అర్థమని తెలుసుకోవాల్సి ఉంటుంది.
అధోముఖంగా ఉన్న కుండలినీశక్తి ఊర్ధ్వ ముఖం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ "మేఘవర్ణుడు" అని అనడం దైవం మేఘంలాగా పైనుండేది అన్న విషయాన్ని సూచిస్తోంది. ఆ పైనున్న దైవం వైపుకు వెళ్లాలంటే ఊర్ధ్వముఖం అవాలి. కనుక, ఆ దైవ "నామగానం జరుగుతున్నా" నువ్వెందుకు కదలవు, పలకవు, ఎందుకు ఇలా ఉన్నావ్? అని నిలదీస్తూ నిద్రలో ఏమీ లేదని చెప్పే రీతిగా "నిద్రకు అర్థం ఏముంది?" అని గోపకన్యను ప్రశ్నిస్తోంది ఆణ్డాళ్.
ఆణ్డాళ్ ప్రశ్నను మనమూ తీసుకుందాం. సమాధానంగా మనం మొద్దు నిద్రను విడిచి ఆ దైవం వైపుకు ఉర్ధ్వముఖులం ఔదాం.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279