Tiruppavai: జపాన్ హైకు లాంటి పాసురమ్..!
ABN , First Publish Date - 2022-12-26T22:45:46+05:30 IST
ఇల్లంతా తడిసి చిత్తడికాగా సుసంపన్నుడైన వాడి చెల్లెలా... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం పన్నెండో రోజు; తిరుప్‌పావై పన్నెండో పాసురమ్ రోజు.
పాసురమ్ 12
ఆణ్డాళ్ పన్నెండో పాసురమ్‌తో నిద్రలేవని ఆ గోపకన్యను నిద్రలెమ్మంటూ కొనసాగుతోంది. మనమూ పాసురమ్‌తో పాటు సాగుదాం; రండి...
మూలం-
కనైత్ తిళఙ్ కఱ్ట్రెరుమై కన్ఱుక్కిఱఙ్గి
నినైత్తు ములైవళ్షియే నిన్ఱు పాల్‌సోర
ననైత్తిల్లమ్ సేఱాక్కుమ్ నఱ్‌సెల్వన్ తఙ్గాయ్!
పనిత్‌తలై వీళ్ష నిన్ వాసఱ్ కడైపఱ్ట్రిచ్
చినత్తినాల్ తెన్నిలఙ్‌గైక్ కోమానైచ్ చెఱ్ట్ర
మనత్తుక్ కినియానైప్ పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్;
ఇనిత్తాన్ ఎళ్షున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్?
అనైత్తిలత్తారుమ్ అఱిన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
అఱుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను
తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా
ఇల్లంతా తడిసి చిత్తడికాగా సుసంపన్నుడైన వాడి చెల్లెలా!
తలపైన మంచు కురుస్తుండగా నీ వాకిలి తలుపును పట్టుకున్నాను;
కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన
మనసుకు మధురమైన వాణ్ణి గానం చెయ్యడానికి నువ్వు నోరు తెఱవడం లేదు;
ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర?
ఇళ్లల్లోని వాళ్లందఱికీ తెలిసిపోయింది; ఓలాల నా చెలీ!
అవగాహన-
"అఱుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా ఇల్లంతా తడిసి చిత్తడికాగా" అని అంటూ సంఘటనను, చిత్రణను కలిపి ఆణ్డాళ్ మనకు చెబుతోంది. ఇలా సంఘటనను, చిత్రణను కలిపి చెప్పే విధానం జపనీయ హైకు శిల్పంలో కనిపిస్తుంది. "తల్లి గేదె అఱుస్తోంది; ఇల్లు పాలతో చిత్తడయింది" అని కొంచెం మార్చి చెబితే ఆ అభివ్యక్తి జపనీయ హైకు లా ఉంటుంది. మన మట్టికి చెందిన సంఘటన, చిత్రణల సమ్మేళనం ఇది. ఇలాంటి అభివ్యక్తిని భద్రపఱుచుకుందాం. రానున్న తరాలవారికి కానుకగా అందిద్దాం.
"ఇల్లంతా తడిసి చిత్తడికాగా సుసంపన్నుడు అవడం" అన్న భావన గొప్పగా ఉంది. ఇక్కడ పాలు అనేది అనుగ్రహం అనీ, ఆ అనుగ్రహం వల్ల సుసంపన్నమవడం జరుగుతుంది అనీ మనం అర్థం చేసుకోవచ్చు.
"కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన, మనసుకు మధురమైన వాణ్ణి" అంటూ రాముడు రావణాసురుణ్ణి చంపిన విషయాన్ని చెబుతూ ఆపై దైవత్వం రాక్షసత్వాన్ని కోపంతో చంపేస్తుందనీ, ఆ చంపడం వల్ల దైవత్వం మనసుకు మాధుర్యాన్ని ఇస్తుందనీ చక్కగా తెలియజేసింది ఆండాళ్. మనసుకు మధురమైన వాడు దైవమని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్.
క్రితం పాసురమ్‌లో "దైవ నామగానం జరుగుతున్నా ఎందుకు నువ్వు లేవడం లేదు?" అని ప్రశ్నించాక ఈ పాసురమ్‌లో "గానం చెయ్యడానికి నువ్వు నోరు తెఱవడం లేదు" అని మెత్తగా తిడుతోంది ఆణ్డాళ్. దైవనామగానం చెయ్యడానికి మొద్దు నిద్రను విడిచి లేవాలని చెబుతూ "ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర?" అని అంటోంది ఆణ్డాళ్. ఈ అనడం మనకు కూడా వర్తిస్తుంది. మనం మొద్దు నిద్రను విడిచి లేద్దాం; దైవనామగానం చేద్దాం.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279