Tiruppavai: రతనాల తలుపు గొళ్లెం ఉన్న ఆ ఇల్లు ఎవరిదంటే...

ABN , First Publish Date - 2022-12-30T18:46:27+05:30 IST

నోము చేసుకునేప్పుడు ఈ తప్పెటను వాయిస్తారు. ఆ తప్పెటను కృష్ణుడే.... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: రతనాల తలుపు గొళ్లెం ఉన్న ఆ ఇల్లు ఎవరిదంటే...
Andal Tiruppavai Pasuram 16

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం పదిహారోరోజు; తిరుప్‌పావై పదిహారో పాసురమ్ రోజు.

పాసురమ్ 16

ఆణ్డాళ్ గోపకన్యలతో కలిసి కృష్ణుడి ఇంటికెళ్లి తలుపు తియ్యమంటూ ఈ పదహాఱో పాసురాన్ని సంధించింది. మనం పాసురమ్ తో పాటు అనుసంధానం ఔదాం రండి...

మూలం-

నాయగనాయ్ నిన్ఱ నన్దగోబనుడైయ

కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱున్ తోరణ

వాయిల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్‌ తిఱవాయ్;

ఆయర్ సిఱుమియరోముక్కు అఱైబఱై

మాయన్, మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్‌న్దాన్

తూయోమాయ్ వన్దోమ్ తుయిలెళ్షప్ పాడువాన్

వాయాల్ మున్నమున్నమ్ మాఱ్ట్రాదే అమ్మా; నీ

నేయ నిలైక్కదవమ్ నీక్కేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

నాథుడై నెలకొన్న నందగోపుడి

కోవెల కావలివాడా! ధ్వజాలు, తోరణాలు కట్టిన

వాకిళ్ల కావలివాడా! రతనాల తలుపు గొళ్లెం తియ్యి;

గోపకన్యలమైన మాకు మోగే తప్పెటను ఇస్తానని

నల్లనివాడు, రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు;

శుచిగా వచ్చాం మేలుకొలుపు పాడడానికి

తొందఱపడి నోటితో కాదనకుమా; నువ్వు

మూసి ఉన్న తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!

అవగాహన-

తమ నాథుడైన నందగోపుడు లేదా కృష్ణుడి ఇంటికెళ్లి "శుచిగా వచ్చాం, మేలుకొలుపు పాడడానికి" అంటూ అక్కడి కావలి వాడికి చెబుతూ "మూసి ఉన్న తలుపును తియ్యమంటోంది గోపికలతో వచ్చి‌న ఆణ్డాళ్. అంతే కాదు "గోపకన్యలమైన మాకు మోగే తప్పెటను ఇస్తానని నల్లనివాడు, రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు" అని తెలియజేస్తోంది. "కాదనకుమా" అంటూ అడ్డుపడద్దని కావలివాడికి చెబుతోంది.

నోము చేసుకునేప్పుడు ఈ తప్పెటను వాయిస్తారు. ఆ తప్పెటను కృష్ణుడే తమకు ఇస్తానని మాటిచ్చాడు అని చెబుతోంది‌. తప్పెట అన్నది అనుగ్రహానికి ప్రతీక.‌

"మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః"

అని కృష్ణుడు భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 34)లో చెప్పాడు. అంటే నా మనస్కుడివిగా ఉండు. నా భక్తుడివిగా, నా యజ్ఞాలు(పూజలు) చేసేవాడివిగా ఉండు. నన్ను నమస్కరించు. ఈ విధంగా అనుసంధానితుడవై నన్ను పరంగా తీ(చే)సుకుంటే నీలో నన్ను తప్పకుండా పొందగలవు అని అర్థం. ఇక్కడ కృష్ణుడు, తనను కోరుకుని, నమస్కరించి చెంతకు వచ్చినవాళ్లకు తనను లేదా తన అనుగ్రహాన్ని పొందగలరని మాట ఇచ్చాడు. ఈ భావాన్నే "తప్పెటను ఇస్తానని నల్లనివాడు, రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు" అని ఆణ్డాళ్ చెబుతోంది.

దైవం చెంతకు శుచిగా వెళ్లాలి; అందుకే తాము శుచిగా వచ్చిన సంగతి తెలియజేసింది అణ్డాళ్.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon

రోచిష్మాన్

9444012279

Updated Date - 2022-12-31T08:06:10+05:30 IST