Tiruppavai: ఆణ్డాళ్ మాతృహృదయానికి అద్దం

ABN , First Publish Date - 2022-12-18T20:06:58+05:30 IST

"మేమూ ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు" అనడం ఆ కరుణలో తడసిపోవడానికి అని గొప్పగా తెలియజెబుతోంది ఆణ్డాళ్...

Tiruppavai: ఆణ్డాళ్ మాతృహృదయానికి అద్దం
Andal Tiruppavai Pasuram 04

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారుజామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం నాలుగో రోజు; తిరుప్‌పావై నాలుగో పాసురమ్ రోజు.

పాసురమ్ 04

ఆణ్డాళ్ నాలుగో పాసురమ్‌లో కన్నయ్యను ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు అనుగ్రహించమని కోరుతోంది ఇలా...

మూలం-

ఆళ్షి మళ్షైక్ కణ్ణా! ఒన్ఱు నీ కైకరవేల్;

ఆళ్షియుట్ పుక్కు ముగన్దు కొడార్తేరి,

ఊళ్షి ముదల్వన్  ఉరువమ్ పోల్ మెయ్ కఱుత్తుప్

పాళ్షియన్ తోళుడైప్ పఱ్బనాబన్ కైయిల్

ఆళ్షిపోల్ మిన్ని, వలమ్పురిపోల్‌ నిన్ఱదిర్‌న్దు

తాళ్షాదే సార్‌ఙ్గమ్ ఉదైత్త సరమళ్షైపోల్

వాళ్షవులగినిఱ్ పెయ్దిడాయ్; నాఙ్గళుమ్

మార్గళ్షినీరాడ మగిళ్ష్‌న్దేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

సాగరమా! వానవేల్పు కన్నయ్యా! నువ్వు ఇవ్వడం ఆపెయ్యకు;

సాగరంలోకి దిగి తోడుకుని చప్పుడు చేస్తూ పైకి వచ్చి ,

ఆదిపురుషుడి ఆకారంలాగా నల్లని మేనుతో,

విశాల బాహువుల పద్మనాభుడి చేతిలోని

చక్రంలా మెఱిసి, పాంచజన్యంలా మోగి

ఎడతెఱపి లేకుండా సారంగం నుండి వచ్చే శరవర్షంలా

అందఱూ వర్ధిల్లేట్టుగా వర్షించు; మేమూ

ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు; ఓలాల నా చెలీ!

అవగాహన-

ఆణ్డాళ్‌కు అంతా కన్నయ్యే; అన్నీ కన్నయ్యే. "సాగరమా" అని కన్నయ్యను సంబోధించాక "వానవేల్పు కన్నయ్యా" అంటూ వరుణదేవుడిగా కూడా కన్నయ్యనే పరిగణిస్తోంది. వర్షం సాగరం వల్లే వస్తుంది కదా? "సాగరంలోకి దిగి తోడుకుని చప్పుడు చేస్తూ పైకి వచ్చి" అనడం వర్షంతో‌ పాటు‌ వచ్చే శబ్దాన్ని సూచిస్తోంది. మెఱిసే మెఱుపును సుదర్శనచక్రం అనీ, పాంచజన్యం మోగడం అంటే ఉరుము అనీ చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్. వర్షాన్ని శరవర్షం అనడం ఉదాత్తంగా ఉంది.

ఈ పాసురమ్‌లో చెప్పబడిన పాంచజన్యం విష్ణువు చేతి శంఖానికి పేరు, సారంగం మహావిష్ణువు ధనుస్సుకు పేరు.

వర్షాన్ని కరుణకు ప్రతీకగా ఆణ్డాళ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. పాసురమ్ చివర "మేమూ ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు" అనడం ఆ కరుణలో తడసిపోవడానికి అని గొప్పగా తెలియజెబుతోంది ఆణ్డాళ్. ఆ కరుణను "అందఱూ వర్ధిల్లేట్లుగా వర్షించు" అని కోరుకోవడం ఆణ్డాళ్ మాతృహృదయానికి అద్దం పడుతోంది. ఈ మాతృహదయాన్ని అర్థం చేసుకునే వేదాంతదేశికులు గోదాస్తుతి(మొదటి శ్లోకం)లో "కరుణయా కమలామివాన్యాం గోదాం" అంటే కరుణ కారణంగా ఇంకొక శ్రీదేవి లేదా లక్ష్మి వంటిది గోదా అని తెలియజేస్తూ ఇలా అన్నారు:

"శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం

శ్రీ రంగరాజ హరిచందన యోగదృశ్యాం

సాక్షాత్ క్షమాం! కరుణయా కమలామివాన్యాం

గోదాం అనన్య శరణః శరణం ప్రపద్యే".

గొప్ప భావన, భావం, శైలి, శిల్పం వీటితో ఆణ్డాళ్ ఈ పాసురాన్ని మనకు అందించింది. ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థం ఔవుతుంది ఈ పాసురమ్.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon

రోచిష్మాన్

9444012279

Updated Date - 2022-12-19T19:07:10+05:30 IST