USA: క్లినిక్ నుంచి అందరూ వెళ్లిపోయినా ఆమె కూతురు బయటకు రాలేదు.. ఇంతలో షాకింగ్ వార్త చెప్పిన వైద్యులు..

ABN , First Publish Date - 2022-12-17T18:19:34+05:30 IST

అందానికి మెరుగులు దిద్దుకునేందుకు వెళ్లిన ఓ అమెరికా యువతి జీవితం అనూహ్యంగా ముగిసింది.

USA: క్లినిక్ నుంచి అందరూ వెళ్లిపోయినా ఆమె కూతురు బయటకు రాలేదు.. ఇంతలో షాకింగ్ వార్త చెప్పిన వైద్యులు..

ఎన్నారై డెస్క్: తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఓ యువతి ప్లాస్టిక్ సర్జరీ(Plastic Surgery) కోసం ఓ క్లినిక్‌కు వెళ్లింది. తోడుగా ఉండేందుకు తల్లికూడా వెంట వెళ్లింది. గంటలు గడిచిపోతున్నా కూతురి ఆపరేషన్ పూర్తికాలేదు. క్లినిక్‌కు వచ్చిన వారందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఇంతలో వైద్యులు తన కూతురి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మీ అమ్మాయి చనిపోయిందంటూ ఊహించని షాకిచ్చారు. దీంతో..ఆ మాతృమూర్తి ఒక్కసారిగా బోరుమంది. గతేడాది అమెరికాలో(USA) ఈ దారుణం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలోని హిల్స్‌బరో కౌంటీకి(Hillsborough) చెందిన జేలా విలియమ్స్‌ది(26) అందమైన జీవితం. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేలా సోదరికి ఆమెపై అపారమైన ఆప్యాయత. అక్కే నా బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె తరచూ జేలా గురించి చెబుతుంటుంది. అయితే.. తన అందానికి మెరుగులు దిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో జేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. పిరుదులు, వక్షోజాల ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఇందుకు ప్లాంటేషన్ నగరంలోని బెస్ట్‌ యూ నౌ కాస్మటిక్ సర్జరీ కేంద్రాన్ని సంప్రదించింది. గతేడాది అక్టోబర్ 10న శస్త్రచికిత్స కోసం క్లినిక్‌కు వెళ్లింది. ఆపరేషన్ రోజున కూతురి వెంట ఉండేందకు జేలా తల్లి కూడా కాలిఫోర్నియా నుంచి వచ్చింది. జేలాతో పాటూ క్లినిక్‌కు వెళ్లింది. అయితే.. అప్పుడో ఇప్పుడో ఆపరేషన్ పూర్తై తన కూతురు బయటకు వస్తుందని అనుకుంటున్న తరుణంలో ఆమె తల్లికి భారీ షాక్ తగిలింది. జేలా మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన వైద్యులు ఆమె చనిపోయిందంటూ తల్లికి షాకింగ్ వార్త చెప్పారు. మృతదేహాన్ని ప్లాంటేషన్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆపరేషన్ సందర్భంగా వైద్యుడు జేలాకు ఎనస్థీషియా ఇచ్చారు. ఆ తరువాత మత్తులోకి వెళ్లిపోయిన ఆమె మళ్లీ మేల్కొనలేదని పోస్ట్‌ మార్టం నివేదికలో వెల్లడైంది. జేలా మరణానికి కారణం ఏంటో తెలియరాలేదని రిపోర్టు ఇచ్చారు.

1.jpg

మరోవైపు.. ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆ కేంద్రంపై ఫిర్యాదు దాఖలు చేసింది. అర్హత లేని వైద్యుడితో జేలాకు అనస్థీషియా ఇచ్చినట్టు పేర్కొంది. కాగా..వైద్య రంగంలో అనస్థీషియా కూడా ఓ ప్రత్యేక విభాగమని, సుదీర్ఘ కాలంపాటు ట్రెయినింగ్ ఉంటుందని అమెరికా అనస్థీషియా వైద్యుల సంఘం అధ్యక్షుడు డా. మైఖేల్ ఛాంపూ తెలిపారు. సాధారణ మెడిసిన్ చదువుకున్న వారికి అనస్థీషియా ఇచ్చే అర్హత ఉన్నప్పటికీ.. సాధారణంగా అనస్థీషియా వైద్యులే ఈ పని చేస్తారని వివరించారు. కాగా.. ఇంత జరిగినా కూడా ఆ కేంద్రం నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని జేలా తల్లి తెలిపారు. మరోవైపు.. ఆ కాస్మటిక్ సర్జరీ కేంద్రం లైసెన్స్ రద్దు చేయాలని కూడా హెల్త్ డిపార్ట్‌మెంట్ సిఫారసు చేసింది.

Updated Date - 2022-12-17T18:29:46+05:30 IST