Elon Musk: షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందా..?
ABN , First Publish Date - 2022-12-03T23:47:22+05:30 IST
షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందంటూ సంచలన విషయాలు బహిర్గతం చేసిన మస్క్
ఎన్నారై డెస్క్: అమెరికాలో 2020 నాటి ఎన్నికల ఫలితాల్ని ట్విటర్(Twitter) ప్రభావితం చేసిందా..? బైడెన్(Joe Biden) వ్యతిరేక కథనం ప్రజల్లో విస్తృతంగా వ్యాపించకుండా అడ్డుపడిందా..? ఈ నిర్ణయం వెనుక ట్విటర్‌లో ఉన్నత ఉద్యోగులు కీలక పాత్ర పోషించారా..? అంటే అవుననే అంటున్నారు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)! ఇందుకు సంబంధించి ట్విటర్ ఉద్యోగుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను తాజాగా ఆయన ఓ జర్నలిస్టు సాయంతో ట్విటర్ వేదికగా విడుదల చేశారు.
గత ఎన్నికల్లో పోటీలో నిలబడ్డ బైడెన్‌పై ఓ అమెరికా పత్రిక ప్రచురించిన కథనాన్ని ట్విటర్ తొక్కిపెట్టిందట. అది బైడెన్ అవినీతికి(Corruption) సంబంధించిన కథనం. యూక్రెయిన్‌లో(Ukraine) కొందరికి మేలు చేకూర్చేలా బైడెన్ అనైతిక చర్యలకు పాల్పడ్డారన్నది ఆ కథనం సారాంశాం. ఇందుకు సాక్ష్యంగా బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లోని కీలక ఈమెయిల్స్‌ను కూడా పత్రిక ప్రచురించింది. అయితే..ఈ వార్త ట్విటర్‌లో వైరల్ కాకుండా ఉండేందుకు ట్విటర్‌లో కీలక ఉద్యోగులు పలు చర్యలు తీసుకున్నారట. హ్యాకింగ్‌తో సంపాదించిన సమాచారంతో ఆధారంగా ప్రచురించే కథనాలు ట్విటర్ నిబంధనలు ఉల్లంఘిస్తాయంటూ ఆ వార్తను తొక్కిపెట్టాటరట. అంతేకాకుండా.. డైరెక్ట్ మెసేజీల ద్వారా ఆ కథనాన్ని షేర్ చేసుకునే అవకాశం లేకుండా చేశారన్న ఆలోచన వెలుగులోకి వచ్చింది. ట్విటర్ చెప్పిన హ్యాకింగ్ సాకు నైతికంగా నిలబడని కొందరు ట్విటర్ ఉద్యో్గులే అభిప్రాయపడినట్టు వారి మధ్య సాగిన అంతర్గత ఉత్తరప్రత్యురాల్లో వెల్లడైంది. దీంతో.. ఈ ఉదంతం ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పటి ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి బైడెన్ గెలుపోందిన విషయం తెలిసిందే.