NRI: వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-11-21T21:18:14+05:30 IST

వాషింగ్టన్ డిసిలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది.

NRI: వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం

వాషింగ్టన్ డిసిలో(Washington DC) గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(జీడబ్ల్యూటీసీఎస్-GWTCS) నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ GWTCS నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ ఈ సంస్థకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి వారి సేవలు దోహదపడతాయన్నారు. ‘‘అమెరికాలో వున్న ప్రవాసాంధ్రులు తెలుగుభాషను బ్రతికిస్తున్నారు. రాష్ట్రంలో పాలకపక్ష అనుభవరాహిత్యం వలన విద్యారంగం నిర్వీర్యమైపోయింది. ఇంగ్లీష్ భాష మోజులో మాతృ భాషను మర్చిపోతున్నారు. ఏ జాతి అయితే తన మాతృభాషను, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది’’ అని అన్నారు. తెలుగువారు రాజకీయాల్లో రాణించి అమెరికా చట్టసభల్లో ప్రాధాన్యత పెంచాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

కృష్ణ లాం మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానియ్యనన్నారు. రాబోయే 50 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. సాంస్కృతిక సేవ కార్యక్రమాలతోపాటు సామాజిక సేవాకార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రతివారం నిర్వహిస్తామన్నారు.

సతీష్ వేమన మాట్లాడుతూ తెలుగువారి చరిత్ర అమెరికా పేజీల్లో సువర్ణాక్షరాలతో లిఖించే రోజులు వచ్చాయన్నారు. తెలుగువారు అనేకమంది ఇక్కడ చట్టసభలకు ఎన్నికయ్యారు. తెలుగింటి ఆడపడుచు అరుణా మిల్లర్ కాట్రగడ్డ మేరీలాండ్ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికవ్వడం తెలుగువారు గర్వించదగ్గ విషయమన్నారు.

మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మితభాషి, హితభాషి, మృదుస్వభావం కలిగిన కృష్ణ తప్పక తెలుగువారి కీర్తిప్రతిష్టలు పెంచుతారన్నారు. ‘‘భాష మారింది, సంస్కృతి మారింది, నాగరికత మారింది... కానీ తెలుగువారు తమ సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలను మర్చిపోకుండా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తెలుగుభాషా తియ్యదనాన్ని, తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు’’ అని అన్నారు.

ముందుగా ఇప్పటివరకు GWTCS అధ్యక్ష బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన సాయిసుధ పాలడుగుకు వీడ్కోలు చెబుతూ ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యక్షులు రవి అడుసుమల్లి, కార్యదర్శి సుశాంత్ మన్నే, కోశాధికారి భాను మాగులూరి, సాంస్కృతిక ఉపాధ్యక్షులు సుష్మ అమృతలూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీవిద్య సోమ, యూత్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గంగా, సంయుక్త కార్యదర్శి కార్తీక్ కోమటి, సంయుక్త కోశాధికారి విజయ్ అట్లూరి, బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా చంద్ర మల్లావత్తు, ప్రవీణ్ కొండక, ఫణి తాళ్లూరి, యాష్ బొద్దులూరి, రాజేష్ కాసారనేని, ఉమాకాంత్ రఘుపతి తదితరులు నూతనంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, త్రిలోక్ కంతేటి, ప్రదీప్ గౌర్నేని, సత్య సూరపనేని, సునీల్ సింగ్, అనీల్ ఉప్పలపాటి, ప్రదీప్ గుత్తా, అశోక్ దేవినేని, సాయి బొల్లినేని, శ్రీనివాస్ చావలి, బాబురావు, కిషోర్ కంచర్ల, రవి పులి, శ్రీనివాస్ పెందుర్తి తదితరులు పాల్గొన్నారు.

1.jpg3.jpg4.jpg

Updated Date - 2022-11-21T21:30:32+05:30 IST