USA: కొండపైకి వెళ్లిన జంట.. భర్త పెద్ద కేక పెట్టడంతో భార్య వెనక్కి తిరిగి చూడగా..
ABN , First Publish Date - 2022-12-13T18:14:52+05:30 IST
ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ అమెరికా వ్యక్తి కొండపై భార్యతో కలిసి ఫొటో దిగే క్రమంలో అనూహ్యంగా మరణించాడు.
ఎన్నారై డెస్క్: ట్రెక్కింగ్‌కు(Trekking) వెళ్లిన ఓ అమెరికా వ్యక్తి కొండపై భార్యతో కలిసి ఫొటో దిగే క్రమంలో అనూహ్యంగా మరణించాడు. కొండపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడిన అతడు ఘటనాస్థలంలోనే మరణించాడు. న్యూహాంప్‌షైర్(Newhampshire) రాష్ట్రంలో డిసెంబర్ 3న ఈ దుర్ఘటన జరిగింది. ఆ భార్యాభర్తలు విల్లార్డ్ కొండ పైకి వెళ్లారు. 800 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక వారు ఫొటో దిగేందుకు ప్రయత్నించారు. ఇంతలో అకస్మాత్తుగా తన భర్త పెద్ద కేక పెట్టడం భార్యకు వినిపించింది. కంగారుగా ఆమె వెనక్కు తిరిగి చూసే సరికే అతడు కొండపై నుంచి జారిపోతూ కనిపించడంతో ఆమె నిశ్చేష్టురాలైపోయింది. ప్రమాదం గురించి తెలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది..తాళ్ల సాయంతో కిందకు దిగి చూడగా..బాధితుడు అప్పటికే మృతిచెందాడు. ఆ తరువాత.. ఎంతో ప్రయాసపడి సిబ్బంది అతడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. కొండపైన తేమగా ఉండటంతో కిందకు జారిపోతున్న భర్తని ఆ మహిళ కాపాడుకోలేకపోయి ఉండొచ్చని స్థానిక మీడియా పేర్కొంది.
కాగా..గత నెలలో మరో జంట ఇలాగే పర్వతారోహణకు వెళ్లి అనూహ్యంగా ప్రమాదంలో పడింది. యూటా రాష్ట్రంలోని జయాన్ నేషనల్ పార్క్‌లో వారు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అయితే..కొండ ఎక్కుతుండగా అక్కడి ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందికి గురైయ్యారు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు భార్య పరిస్థితి విషమించడంతో సాయం కోసం భర్త కిందకు వస్తుండగా ఎమర్జెన్సీ సిబ్బంది అతడిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత అతడి భార్యను గుర్తించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు తెలిసింది.