NRI దంపతుల ఔన్నత్యం.. తమ ఆదాయంలో ప్రజాసేవకు పాతిక శాతం కేటాయింపు

ABN , First Publish Date - 2022-12-16T22:23:29+05:30 IST

వచ్చే ఆదాయంలో ఎంతోకొంత దానధర్మాలు చేసే కుటుంబాలు చూస్తున్నాం.. కానీ ఈ ఎన్నారై కుటుంబం మాత్రం లెక్కపెట్టి మరీ పాతికశాతం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

NRI దంపతుల ఔన్నత్యం..  తమ ఆదాయంలో ప్రజాసేవకు  పాతిక శాతం కేటాయింపు
అనాధ ఆశ్రమం సేవలో శశికాంత్‌ దంపతులు

  • ఎన్నారై వల్లేపల్లి శశికాంత్‌, ప్రియాంక దంపతుల ఆదర్శం

  • తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ సేవా కార్యక్రమాలు

వచ్చే ఆదాయంలో ఎంతోకొంత దానధర్మాలు చేసే కుటుంబాలు చూస్తున్నాం.. కానీ ఈ ఎన్నారై కుటుంబం మాత్రం లెక్కపెట్టి మరీ పాతికశాతం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు వల్లేపల్లి శశికాంత్‌, ప్రియాంక దంపతులు.

1.jpg

కృష్ణా జిల్లా గుడివాడ వాస్తవ్యులైన వల్లేపల్లి శశికాంత్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పట్టా పొందాక.. 2009లో అమెరికాలో అడుగుపెట్టారు. ప్రారంభంలోనే అక్కడ ఐబిఎం, సన్‌ మైక్రోసిస్టమ్స్‌, ఫైజర్‌ లాంటి ప్రముఖ దిగ్గజ కంపెనీల్లో ఉన్నత స్థానంలో పనిచేశారు. తర్వాత పొంతంగా ఐటి కంపెనీ క్వాలిటీ మ్యాట్రిక్స్‌ స్థాపించారు. దీనికి శశికాంత్‌ వ్యవస్థాపకుడు, సీఈవోగా వ్యవహరిస్తుండగా, ఆయన భార్య ప్రియాంక ఎండ్లూరి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తర్వాత ఫార్మా, హెల్త్‌కేర్‌, బయోటెక్నాలజీ రంగాల్లోనూ వ్యాపారాలు స్థాపించి అనతికాలంలోనే అమెరికాలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. మరోవైపు హైదరాబాద్‌ కేంద్రంగా అనేక వ్యాపారాలకు నాంది పలికారు. ఒకవైపు వ్యాపారాలు సాగిస్తూనే.. సేవా కార్యక్రమాలపైనా దృష్టి సారించారు. అమెరికా వచ్చి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న తెలుగు విద్యార్థులను గుర్తించి ఆర్థిక సహకారం అందించేవారు. తాను పుట్టిపెరిగిన కృష్ణా జిల్లా గుడివాడలో అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించి సామాజిక సేవలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలన్న లక్ష్యంగా దశాబ్దంన్నర క్రితం తన భార్య ప్రియాంకతో కలిసి కాంత్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. తన సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలకూ విస్తరించారు. అమెరికాలోనూ తానా సంస్థతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. కాంత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

యువ స్టార్టప్‌లకు ‘క్యూ హబ్‌’..

వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌లో 2015లో టి-హబ్‌ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్‌లకే పరిమిత సంఖ్యలో అవకాశం ఉండేది. కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా.. ఆలోచన ఏదైనా, ఆవిష్కరణ ఏమున్నా.. స్టార్టప్‌లను ప్రోత్సహించాలన్న లక్ష్యంగా మాధాపూర్‌లో ‘క్యూహబ్‌’ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభించారు. వినూత్న ఆలోచనలున్న స్టార్టప్‌లకు ఇందులో ఉచితంగా చోటు కల్పించడంతోపాటు వారికి కావాల్సిన నైపుణ్యాలనూ ఈ సంస్థ అందిస్తుంది. అలాగే స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వారికి ఆర్థిక సహకారం అందించేందుకు ఇన్వెస్టర్లనూ అందుబాటులోకి తెచ్చారు. క్యూహబ్‌ ప్రోత్సాహంతో అనేక స్టార్టప్‌లు హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి.

2.jpg

500 విద్యార్థుల దత్తత..

నాణ్యమైన విద్యతోనే పేద విద్యార్థుల జీవితాలను మార్చవచ్చని విశ్వసించే శశికాంత్‌ పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందిస్తున్నారు. ప్రతిభ ఉండి పేదరికంతో చదువుకు దూరమైనవారిని గుర్తించి వారికి కావాల్సిన ఆర్థిక సహకారం అందిస్తున్నారు. గత దశాబ్దాకాలంలో అనేకమంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, పారామెడికల్‌, ఫార్మసీ విద్యకు కావాల్సిన సహకారం అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 500కి పైగా పేద విద్యార్థులను దత్తత చేసుకుని వారి ఉన్నతవిద్య పూర్తయ్యేంతవరకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తున్నారు.

5.jpg

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు..

తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా శ్రీకాకుళం, అనంతరపురం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కాంత్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనేక పాఠశాలల్లో ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించినా.. వాటికి నీటివసతి లేకపోవడంతో వినియోగంలో ఉండకపోయేవి. రెండు రాష్ట్రాల్లో ఐదు జిల్లాల్లో నీటివసతిలేని 120 పాఠశాలలు గుర్తించి అక్కడ బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించారు. అనేక పాఠశాలలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు 30 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌రూంలు ఏర్పాటుచేశారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్‌ బోధనకు ప్రభుత్వ బడులకు కంప్యూటర్లను అందించారు. గ్రంథాలయాలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున పుస్తకాలను విరాళంగా అందించారు. ఖమ్మం జిల్లాల్లో గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహారంతో బాధపడే విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో తరచూ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేస్తుంటారు.

3.jpg

6.jpg

‘తానా’లో డోనర్‌ ట్రస్టీగా..

తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న శశికాంత్‌ తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) డోనర్‌ ట్రస్టీగా 2017లో నియమితులయ్యారు. రెండేళ్ల పదవీకాలంలో అనేక సేవా కార్యక్రమలు నిర్వహించి ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. 2019లో కోశాధికారిగా చేశారు. ప్రస్తుతం తానా కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. శశికాంత్‌ తండ్రి వల్లేపల్లి మోహన్‌రావు గుడివాడలో ప్రముఖ పత్రికలో దాదాపు మూడున్నద దశాబ్దాల పాటు పాత్రికేయుడిగా పనిచేశారు. అనేకమంది యువ పాత్రికేయులకు ఆదర్శంగా నిలిచారు. తండ్రిగారి జ్ఞాపకార్థం వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పాత్రికేయులకు వల్లేపల్లి మోహన్‌రావు రాష్ట్ర పురస్కారాలను అందించనున్నట్టు వల్లేపల్లి శశికాంత్‌ తెలిపారు. కాంత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భార్య ప్రియాంక సహకారం ఎంతో ఉందన్నారు.

Updated Date - 2022-12-17T13:24:41+05:30 IST