Britain: బ్రిటన్ అలాంటి దేశం కాదు.. రిషి సునాక్
ABN , First Publish Date - 2022-12-20T23:09:24+05:30 IST
బ్రిటన్ ఎంతమాత్రం జాత్యాహంకారపూరిత దేశం కాదని ప్రధాని రిషి సునాక్ తాజాగా స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ ఎంతమాత్రం జాత్యాహంకారపూరిత(Racist) దేశం కాదని ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బ్రిటన్‌కు(UK) ప్రధాని అయిన తొలి ఆసియా సంతతి వ్యక్తిగా తన మాటపై నమ్మకం ఉంచాలని వ్యాఖ్యానించారు. బ్రిటన్ యువరాజు హ్యారీని(Prince Harry) పెళ్లాడిన ఆఫ్రికా సంతతి వనిత మేఘన్ మర్కెల్(Meghan Markle) రాజకుటుంబంలో(Royal Family) జాతివివక్ష ఎదుర్కొందన్న ఆరోపణలు ప్రస్తుతం బ్రిటన్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌ను రిపోర్టర్లు ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా రిషి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హ్యారీ, మేఘన్‌ల జీవితంపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డాక్యుమెంటరీ ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనిపై బ్రిటన్‌లోని ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత జెరెమీ క్లార్క్‌సన్ ది సన్ పత్రికకు రాసిన వ్యాసంలో మేఘన్‌పై మండిపడ్డారు. ఆమె అణువణువునూ ద్వేషిస్తున్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇది మరో కాంట్రవర్సీకి తెరతీసింది. జెరెమీ క్లార్క్‌సైన్‌పై జాతివివక్ష ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ది సన్ తన వెబ్‌సైట్ నుంచి ఆ ఆర్టికల్‌ను తొలగించింది. అంతే కాకుండా.. జెరెమీ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంపై స్పందించిన సునాక్.. ప్రజాజీవితంలో ఉన్నవారికి తమ మాట తీరు, ప్రవర్తన ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు.