Facebook: కెనడాలో జాబ్.. కొత్త ఉద్యోగంలో చేరిన 2 రోజులకే భారీ షాక్..!
ABN , First Publish Date - 2022-11-10T20:34:43+05:30 IST
ఫేస్‌బుక్‌లో ఉద్యోగం పోగొట్టుకున్న ఎన్నారై
ఇంటర్నెట్ డెస్క్: మెటా(ఫేస్‌బుక్) యాజమాన్యం తాజాగా భారీ స్థాయిలో చేపట్టిన తొలగింపుల పర్వం ఉద్యోగులను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ముఖ్యంగా వీసాపై ఫేస్‌బుక్‌లో(Facebook) ఉద్యోగం చేస్తూ తొలగింపునకు గురైనవారు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. ఉద్యోగం పోయాక తన పరిస్థితి ఏంటో వివరిస్తూ కెనడాలోని హిమాన్షూ లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘‘మెటా(ఫేస్‌బుక్)లో చేరేందుకు నేను కెనడా వెళ్లాను. కానీ.. ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే నన్ను తొలగించారు. భారీస్థాయిలో జరిగిన తొలగింపుతో ఫేస్‌బుక్‌లో నా ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. ఇలా ఉద్యోగం కోల్పోయిన వారిని చూసి నా హృదయం ద్రవిస్తోంది.’’ అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం తాను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, ఇండియాలో అయినా కెనడాలో అయినా పర్వేలేదని చెప్పుకొచ్చాడు. ‘‘ నిజం చెప్పాలంటే.. నాకేం చేయాలో పాలుపోవట్లేదు. ఏదైనా ట్రై చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మీకేమైనా ఉద్యోగ ఖాళీల గురించి తెలిస్తే నాకు చెప్పండి’’ అని తన పోస్టులో పేర్కొన్నాడు.
బుధవారం మెటా(Meta) ఏకంగా 11 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన(Mass layoffs) విషయం తెలిసిందే. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి సంఖ్య దాదాపు 13 శాతం. కాగా.. తొలగింపుల పూర్తి బాధ్యత తనదేనని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) పేర్కొన్నారు. ఈ మేరకు అధికారిక బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘‘ఈ తొలగింపులు ఎందరినో బాధించాయని తెలుసు. వారందరికీ క్షమాపణలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు. కాగా..మెటా సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా తనకున్న కార్యాలయాల్లో ఉద్యోగులను తొలగించింది. ఇండియాలో ఎంతమంది ఫేస్‌బుక్ ఉద్యోగులను తొలగించారనేదానిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇక అమెరికాలో హెచ్-1బీ(H-1b) వీసాపై ఉంటూ ఫేస్‌బుక్ ఉద్యోగం పోగొట్టుకున్న వారికి మరో సంకటం వచ్చి పడింది. ఉద్యోగం కోల్పోయాక వీసాదారులు 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇందులో విఫలమైతే వారు తమ తమ సొంత దేశాలకు తరలిపోవాల్సి ఉంటుంది. అయితే.. వీసాదారుల విషయంలో ఫేస్‌బుక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ‘‘తొలగింపునకు ముందు మీకు నోటీస్ పిరియడ్ ఉంటుంది. దీనికి వీసా గ్రేస్ పీరియడ్ అదనం. ఇవన్నీ కలుపుకుంటే..తొలగింపునకు గురైన వారికి తదుపరి ఏర్పాట్ల కోసం కొంత సమయం చిక్కుతుంది. ఈ సమయంలో వీసాదారులకు తోడుగా ఉండేందుకు ఇమిగ్రేషన్ స్పెషలిస్టుల పేరిట ప్రత్యేక అధికారులను నియమించాం’’ అని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ఐటీ ఉద్యోగులకు వరుస షాకులు.. ఆ తప్పు చేసుంటే ఇంటికే..!
మరో షాకిచ్చిన మస్క్.. ఉద్యోగులకు దిమ్మతిరిగేలా తొలి ఈ-మెయిల్