NRI: అమెరికాలో యాక్సిడెంట్.. ఐసీయూలో భారత విద్యార్థి.. ప్రాణం కోసం పోరాటం..
ABN , First Publish Date - 2022-11-29T19:27:34+05:30 IST
అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ భారతీయ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
న్యూయార్క్: అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ భారతీయ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. మెదడుకు తీవ్ర గాయాలు అవడంతో ప్రస్తుతం అతడు లైఫ్ సపోర్టుపై చికిత్స పొందుతున్నాడు. అతడికి ఆర్థిక సాయం అందించేందుకు స్నేహితులు ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ దిశగా గో ఫండ్ మీ(GoFundMe) పేజ్ ఏర్పాటు చేశారు.
న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(New Jersey Institute of Technology) చదువుకుంటున్న వినమ్ర శర్మ(Vinamra Sharma) నవంబర్ 12న కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడి మెదడుకు తీవ్రగాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోయాయి. ఘటన జరిగిన పది రోజుల్లోనే అతడికి ఏకంగా నాలుగు మెదడు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందని వినమ్ర శర్మ స్నేహితుడు అభిషేక్ తెలిపాడు. రట్గర్స్ యూనివర్సిటీ హాస్పిటల్(Rutgers University Hospital) ఐసీయూలో చేతులకు సెలైన్లతో అతడు ప్రాణాలతో పోరాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వినమ్రకు వెంటిలేటర్ తొలగించినప్పటికీ..మెదడులో వాపు ఇంకా తగ్గలేదని పేర్కొన్నాడు. మరోవైపు.. వినమ్ర తల్లిదండ్రులకు ఇంకా వీసా రాకపోవడంతో వారు తమ కుమారుడు ఎలా ఉన్నాడోనని తల్లడిల్లిపోతున్నారు.
ఈ విషమ పరిస్థితి నుంచి అతడు తొందరగా బయటపడాలని ఆశిస్తున్నామని అతడి స్నేహితులు పేర్కొన్నారు. ప్రస్తుతం వినమ్ర ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడితే..ఆ తరువాత అతడిని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు చికిత్స ప్రారంభించవచ్చు. శర్మ తీసుకున్న యాక్సిడెంట్ ఇన్సూరెన్స్.. ఆస్పత్రి ఖర్చులకు సరిపోదు. అతడికి ఆటో ఇన్సూరెన్స్ లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఇక.. గోఫండ్‌మీ పేజ్ ద్వారా ఇప్పటివరకూ వినమ్రకు 72,199 డాలర్ల ఆర్థికసాయం అందింది.